Updated : 23 May 2022 09:24 IST

పైలట్‌ మత్తు పెనుముప్పు

ప్రయాణ భద్రత చిత్తు

ద్యం సేవించి వాహనాలు నడుపుతున్నందువల్ల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇండియాలో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగాత్రులుగా మిగులుతున్నారు. అందువల్ల మత్తులో వాహనాలను నడపడాన్ని ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మరి విమానాలను నడిపే సమయంలో పైలట్లు మద్యం సేవించి ఉంటే! ఆర్థిక వృద్ధి కారణంగా కొన్నేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య ఊపందుకొంది. దానికి అనుగుణంగా విమాన సర్వీసుల సంఖ్యా పెరిగింది. అదే సమయంలో పైలట్లు, విమాన సిబ్బంది మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న ఘటనలు అధికంగా వెలుగుచూస్తున్నాయి. దీనిపై భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్నాయి.

తీవ్ర విషాదమే!

ఇండియాలో ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో తొమ్మిది మంది పైలట్లు, 32 మంది విమాన సిబ్బంది ఆల్కహాల్‌ పరీక్షలో విఫలమయ్యారు. దాంతో వారిని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) సస్పెండ్‌ చేసింది. ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు విమాన సిబ్బంది రెండోసారి మద్యం సేవించి పట్టుబడటంతో వారిపై మూడేళ్ల నిషేధం విధించింది. మిగిలిన వారిని మూడు నెలల పాటు విధుల నుంచి తప్పించింది. వారంతా వేర్వేరు విమానాల్లో పనిచేస్తున్నారు. కొవిడ్‌ తరవాత ఈ ఏడాది మార్చినుంచి ఇండియాలో పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దేశీయ సర్వీసులను గతేడాది అక్టోబరులో పునరుద్ధరించారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు, విమాన సిబ్బంది విధులకు ముందు శ్వాస విశ్లేషణ పరీక్ష చేయించుకోవాలి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, విమానాశ్రయాల్లో లగేజీ వాహనాల డ్రైవర్లు వంటి వారికీ ఆల్కహాల్‌ పరీక్షను డీజీసీఏ తప్పనిసరి చేసింది. కొవిడ్‌ తరవాత కొన్ని నెలల పాటు అవి నిలిచిపోయాయి. ఆ తరవాత వాటిని పునఃప్రారంభించినా- 50శాతం పైలట్లు, విమాన సిబ్బందికే ఆల్కహాల్‌ పరీక్షలు జరుపుతున్నారు. 10శాతం విమానాశ్రయ సిబ్బందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2016-2019 మధ్య కాలంలో భారత్‌, విదేశాల్లోని విమానాశ్రయాల్లో 171 మంది పైలట్లు విమానం నడపడానికి ముందు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దిల్లీ విమానాశ్రయంలో 57 మంది, ముంబై ఎయిర్‌పోర్టులో 43 మంది పైలట్లు మద్యం మత్తులో పట్టుబడ్డారు. ఏటా సగటున 40 మందికి పైగా పైలట్లు శ్వాసవిశ్లేషణ పరీక్షలో విఫలమవుతున్నారు.
విమానంలో ప్రయాణించేవారి భద్రత పైలట్లపైనే ఆధారపడి ఉంటుంది. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌, ప్రయాణ సమయంలో ఏ చిన్న అపశ్రుతి చోటుచేసుకున్నా పెను విషాదం తప్పదు. విమాన సిబ్బంది, ఎయిర్‌పోర్టులో పనిచేసేవారి నిర్లక్ష్యం సైతం ప్రమాదాలకు దారితీయవచ్చు. ఈ ఏడాది మార్చిలో చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. తొమ్మిది మంది సిబ్బందితో సహా మొత్తం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విమానం కూలడానికి పైలట్లే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 53శాతం విమాన ప్రమాదాలకు పైలట్ల తప్పిదాలే కారణమని పరిశోధనలు చాటుతున్నాయి. మద్యం మత్తులో ఇవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. మూడేళ్ల క్రితం అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో నలుగురి మరణానికి కారణమైన విమాన ప్రమాదానికి పైలట్‌ మద్యం సేవించి ఉండటమే కారణమని తేలింది. పద్నాలుగేళ్ల క్రితం రష్యా ఎయిర్‌లైన్స్‌ విమానం కూలి 88 మంది దుర్మరణం పాలైన దుర్ఘటనలోనూ ప్రధాన పైలట్‌ రక్తంలో ఆల్కహాల్‌ను గుర్తించారు. నాలుగేళ్ల క్రితం జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్‌ పీకలదాకా మద్యం సేవించి బోయింగ్‌ 777 విమానాన్ని నడపడానికి ఉపక్రమించాడు. అధికారులు ముందుగానే ఆ విషయాన్ని గుర్తించడంతో 244 మంది ప్రాణాలు ఆపద నుంచి బయటపడ్డాయి. ఇటీవల న్యూయార్క్‌లో జెట్‌బ్లూ విమాన సంస్థ పైలట్‌ మద్యం సేవించి విధులకు హాజరవడంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

పటిష్ఠ నిబంధనలు అవసరం

విధి నిర్వహణకు ఎనిమిది గంటల ముందు నుంచి పైలట్లు మద్యం సేవించకూడదని అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిబంధన విధించింది. రక్తంలో ఆల్కహాల్‌ స్థాయి 0.04శాతం దాటితే పైలట్లు విమానం నడపడాన్ని నిషేధించింది. ఐరోపా దేశాల నిబంధనల ప్రకారం పైలట్ల రక్తంలో ఆల్కహాల్‌ 0.02శాతానికి మించకూడదు. ఈ విషయంలో డీజీసీఏ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. విధి నిర్వహణకు 12 గంటల ముందు నుంచి పైలట్లు, విమాన సిబ్బంది ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదన్న నిబంధన విధించింది. వారి రక్తంలో ఆల్కహాల్‌ సున్నా శాతం ఉండాలి. వైరస్‌ విజృంభణ తగ్గడంతో ఇటీవల మళ్ళీ విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. రాబోయే రోజుల్లో పౌర విమానయానంలో మరింత వృద్ధి నెలకొంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రమాదాలను నివారించేలా పటిష్ఠ నిబంధనలు రూపొందించి అమలుపరచాలి. పైలట్లు, విమాన సిబ్బందితోపాటు విమానాశ్రయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ శ్వాసవిశ్లేషణ పరీక్షలు తప్పనిసరి చేయాలి.

- ఎం.అక్షర

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని