Published : 24 May 2022 00:21 IST

అవినీతి కూలితేనే...

‘కోట్లు పెట్టి కట్టే వంతెనలు కూలడమంటే మామూలు విషయం కాదు! ఏవో మహావిపత్తులే రావాలి?’

‘అదంతా పాతకాలం. ఇప్పుడు మహావిపత్తులేమీ అక్కర్లేదు. ఎలాగైనా కూలిపోవచ్చు. గుల్లబారిన కంకర, తుప్పు పట్టిన ఇనుము, ఘాటు తగ్గిన సిమెంటు, మట్టినిండిన ఇసుక... మురికి కాలువలు కట్టడానికీ పనికిరాని చెత్తతో కడితే పిచ్చుకగూళ్లలా ఊగిపోతాయి. వీటికితోడు డబ్బులుపెట్టి కొనుక్కున్న కేటుపట్టాలు తగిలించుకున్న అవతారులు ప్లాన్లు గీస్తే- కచ్చితంగా కుప్పకూలతాయి’

‘వంతెనలు కూలడం వెనక కర్ణుడి చావుకున్నన్ని కారణాలుండగా... కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి ఐఏఎస్‌ అధికారి చెప్పిన కారణం వీటిలో ఒక్కటీ లేదేమిటి, విచిత్రంగా!’

‘అంత విచిత్రమైన కారణం ఏం చెప్పారు?’ 

‘బిహార్‌లో గంగానదిపై కడుతున్న ఓ వంతెన ఈ మధ్య కూలిపోయింది. ఎందుకలా జరిగిందని మంత్రి ఆరా తీస్తే... బలమైన ఈదురు గాలులు వీయడంతో కూలిపోయిందని చెప్పారట!’ 

‘వినేవాళ్లుంటే పడుకొని కూడా హరికథ చెబుతారన్నట్లుగా, తమ అక్రమ లీలావిన్యాసాలకు అడ్డమైన కారణాలు చెప్పి ఏమార్చడం అధికారులు, గుత్తేదారులకు వేలికొసల్లో వెలిగే విద్య!’

‘అదీ నిజమే... ఆ మధ్య కోల్‌కతాలో ఓ భారీ వంతెన కూలిపోతే గుత్తేదారులు చిత్రవిచిత్ర వివరణలు, వ్యాఖ్యానాలతో తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నాలు మసిగుడ్డతో మొహం తుడుచుకున్న తీరును మైమరిపించింది.’ 

‘ఎప్పుడో పాతబడిపోయిన పాలుతాగే పిల్లి టెక్నిక్‌నే ఇంకెంతకాలం వాడతారు?’

‘నమ్మేవాళ్లుంటే కాలంతో పనేముంది? వంతెన కూలిపోవడానికి మానవ మాత్రులెవరూ కారణం కాదని, మనుషులపరంగా ఎలాంటి లోపం లేదని, అదొక దుర్ఘటనగా భావించాలని విన్నవించారు. మరీ చెప్పాలంటే అదొక ‘దైవలీల’గా విశ్వసించాలంటూ వత్తి వక్కాణించారు’

‘అంటే, తమ అకృత్యాల పాపమకిలిని దేవుడికీ అంటించేశారన్న మాట! తిలా పాపాన్ని తలా పంచుకోమంటే... దైవానికీ కొంచెం పంచేద్దామనుకున్నారేమో! అయినా, దేవుడు ఫలానా చోటుకొచ్చి, ఫలానా వంతెననే ఎంచుకుని మరీ కూల్చడు కదా! వీళ్ల అక్రమాల్లోకి దైవాన్ని లాగడమెందుకు? అడ్డగోలు ఆర్జనలో అవినీతి వాటాల్ని ప్రకృతికీ పంచేస్తున్నారన్నమాట! పదిమందికీ పంచడానికి అదేమైనా ప్రసాదమా... పాపపు సొత్తు కదా?’

‘పాపికే భయం ఎక్కువ! పాపపు సొత్తులో పదిమందికీ వాటాలు పంచితే, పాపభారం తగ్గిపోతుందనుకునే అతి తెలివి ప్రదర్శనావిన్యాసాలవి! నేతలు తమ అక్రమాలకు అధికారుల్ని, అధికారులు తమ అవినీతికి నేతల్ని తోడు తెచ్చుకోవడం, అక్రమ సొత్తును పప్పూబెల్లాల్లా పంచుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే! ఇప్పుడు తెలివి మీరిన అక్రమార్కులు సొంత అఘాయిత్యాలకు ప్రకృతిని, పంచభూతాల్ని తోడు తెచ్చుకుంటున్నారన్నమాట!’

‘అమ్మో... అక్రమార్కుల సిత్రాలు అంతరిక్షాన్నీ దాటేసేలా ఉన్నాయే!’

‘ఆ మధ్యన ఒకసారి పైవంతెన కుంగిపోతే, కిందున్న నీటి గొట్టాలపై నెపం మోపారు కదా! అలాగే అక్రమాల్ని కప్పిపుచ్చుకొనేందుకు రకరకాల కథలు వండుతారు. వంతెన ఇరుపక్కలా కోసుకుపోయిందంటే, నది తిన్నగా పారకుండా పక్కలకు పరుగెత్తిందని... చెరువు కట్టకు లీకులెందుకు పడ్డాయంటే, లోపల చేరిన కప్పలనే అడగాలని... వర్షంలో నానడం వల్లే ప్రాజెక్టు కూలిందని... పునాదుల్లో పందికొక్కులు దూరడం వల్లే భవనాలు పడిపోయాయని, ఎండదెబ్బకు పైకప్పులు పగిలి గుళ్లు, బళ్లలోకి నీళ్లొచ్చాయని, కిందున్న నేలలో పగుళ్లతో ఆనకట్ట పగిలిపోయిందంటూ నోటికొచ్చిన కారణాలు చెబుతారు. అసలు కట్టడానికయ్యే ఖర్చులపై చెప్పే కాకిలెక్కలు ఇంతకుమించి ఉంటాయి. కట్టడం మొదలు పెట్టినప్పుడు చెప్పే అంకెలకు, ఏళ్లకొద్దీ సాగదీసి పూర్తిచేసేటప్పటికి చెప్పే సంఖ్యలకు కల్వర్టుకు, ఆనకట్టకు ఉన్నంత తేడా ఉంటుంది. అంచనా లక్షల్లో ఉంటే, ముక్తాయింపు కోట్లు దాటేస్తుంది. మధ్యలో చేరినదంతా పంచుకోవడానికి పెంచుకుని చెప్పేదే! ఇదంతా ఎవరికీ అంతుచిక్కని దైవరహస్యంలా జరిగిపోతుంది!’

‘అవినీతిని అన్నంతో కలిపి తింటున్న దుర్మార్గులకు అడ్డుకట్టే ఉండదా?’

‘అప్పనంగా ఎత్తుకు తినాలన్న దురాశవల్లే... సాయంత్రం వేసిన తారురోడ్లు తెల్లారేసరికి కంకరగుండ్లు తేలేస్తాయి. సీసీరోడ్డు మట్టిదారిలా మారిపోతుంది. మురుగు కాల్వలు భద్రంగా చెత్తను నిల్వచేస్తే, లోపల పారాల్సిన మురుగు రోడ్డుపై వరద కట్టి, దుర్గంధం పంచుతుంది. వర్షం నీళ్ల కోసం కట్టే వరద కాలువల్లోకి చుక్కనీరూ చేరకుండా రహదారుల్ని గోదారుల్లా మార్చి ముంచేస్తుంది. బారెడు స్తంభాలకు జానెడు గుంతలు తవ్వి, గుప్పెడు ఇసుక, చిటికెడు సిమెంటు మాత్రమే కలిపి, నాణ్యతను నామరూపాల్లేకుండా చేసి కడితే పిల్లగాలికైనా పేకమేడలా కుప్పకూలాల్సిందే! అందుకని ముందుగా నేతలు, అధికారులు, గుత్తేదారుల అక్రమాలు, అవినీతి కుప్పకూలాలి. అప్పుడే వంతెనలు, ప్రాజెక్టులు, కాలువలు, కట్టలు, భవనాలు కూలకుండా నిలుస్తాయి! ఇదంతా మన జీవితకాలంలో జరగాలని ఆశించాలంతే!’ 

- శ్రీనివాస్‌ దరెగోని

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts