Published : 25 May 2022 00:51 IST

ఆచూకీ లేని బాల్యం

పెద్దయెత్తున తప్పిపోతున్న చిన్నారులు

పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ ఉన్నట్టుండి కనిపించకుండా పోతే, ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం. అప్పటి వరకూ చేయి పట్టుకుని తిరిగి, మారాం చేసిన పిల్లలు ఒక్కసారిగా మాయమైపోతే, ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని కరోనా మహమ్మారి మరింతగా దిగజార్చింది. ఆ సమయంలో తప్పిపోయిన చిన్నారుల కోసం పెద్దయెత్తున ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధ్యయనంలో వెల్లడైంది. 2020లో దేశవ్యాప్తంగా 1,08,234 మంది చిన్నారులు తప్పిపోయారు. తెలంగాణలో 3,755, ఆంధ్రప్రదేశ్‌లో 3,294 మంది తప్పిపోయినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. ఏటా మే నెల 25వ తేదీని ‘తప్పిపోయిన చిన్నారుల అంతర్జాతీయ దినం’గా జరుపుకొంటున్నారు. తప్పిపోయిన, అపహరణకు గురై మళ్ళీ దొరికిన పిల్లలను సన్మానిస్తూ ఈ దినాన్ని నిర్వహిస్తారు.

చిన్నారులు తప్పిపోవడానికి అనేక కారణాలు తోడవుతాయి. జన సమ్మర్ద ప్రదేశాలు, పని వెదుక్కోవడం, క్లిష్టమైన కుటుంబ పరిస్థితులతో ఇల్లు విడిచి వెళ్ళడం, తోటివారు, అక్రమ రవాణాదారుల ప్రభావం, బాల్య వివాహాలు, బాలకార్మికుల కోసం అపహరణలు, అల్లర్లు, విపత్తులు, కుటుంబ కలహాలు, హింసకు భయపడి పారిపోతుంటారు. వీరందరినీ తప్పిపోయిన చిన్నారులుగానే పరిగణిస్తారు. పిల్లలను అపహరించి అక్రమంగా రవాణా చేసే ముఠాలకూ కొదవలేదు. ఇలా రకరకాల పరిస్థితుల్లో కుటుంబాలకు దూరమయ్యే లక్షలమంది చిన్నారులు- వెట్టిచాకిరి, ఇళ్లలో పని, బానిసత్వం, భిక్షాటన, అవయవాల దోపిడి, లైంగిక వ్యాపారంలో మగ్గిపోతున్నారు. కొంతమంది అక్రమార్కులకు ఇదంతా లాభదాయక పరిశ్రమగా తయారైంది.

తప్పిపోయిన పిల్లల కేసులకు సంబంధించి ప్రామాణిక విధివిధానాలు రూపొందించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం, 2015 వంటి చట్టాలు బాధిత చిన్నారుల సంరక్షణకు తోడ్పాటు కల్పిస్తున్నాయి. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చిన్నారులకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రాయోజిత బాలల సంరక్షణ సేవలను అమలు చేస్తోంది. ట్రాక్‌ చైల్డ్‌, ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్పిపోయిన పిల్లల స్థితిగతుల్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నాయి. సంవత్సరంలో రెండుసార్లు ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు- తప్పిపోయిన పిల్లల్ని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేందుకు యత్నిస్తున్నాయి. బాధిత చిన్నారులను త్వరగా గుర్తిస్తే తమ సిబ్బందికి పురస్కారాలు, పదోన్నతులు కల్పించే పథకాన్ని దిల్లీ పోలీసు విభాగం ప్రవేశపెట్టింది. తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక యాప్‌ రూపొందించి కృషి చేస్తున్నారు.

చిన్నారి కనిపించకుండా పోయినప్పుడు ఏమాత్రం ఆశ వీడకుండా ఎక్కడున్నారో గుర్తించేందుకు కృషి చేయడం కీలకం. చాలా మంది తల్లిదండ్రులు కనిపించకుండాపోయే తమ పిల్లల గురించి కేసులు నమోదు చేయకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఎక్కడైనా ఒక చిన్నారి తప్పిపోతే పోలీసుల కోసం 100, చైల్డ్‌లైన్‌ కోసం 1098కు ఫోన్‌ చేయడంతోపాటు, ఠాణాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడం కీలకం. పిల్లల వివరాల్ని ‘ఖోయా-పాయా’ తదితర పోర్టళ్లలో నమోదు చేయడం అవసరం. తప్పిపోయిన ప్రతి చిన్నారి కేసునూ రిజిస్టర్‌ చేయాలి. అన్ని స్థానిక ప్రసార మాధ్యమాలకు వివరాలు తెలపడం, పిల్లల దుస్తులు, ఇతరత్రా అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలి. మొబైల్‌ ఫోన్‌, డబ్బులు, బ్యాంకు కార్డులు, ఇతరత్రా విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్ళారా అనేది గుర్తించి తెలియజెప్పాలి. సాధారణంగా పిల్లల అక్రమ రవాణా, తరలింపు వంటి కార్యకలాపాలు ఎక్కువగా రైల్వే మార్గం ద్వారానే జరుగుతాయి. అందుకని, తల్లిదండ్రులు సమీపంలోని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ వంటి అధికారులకూ సమాచారం అందించడం మేలు. అదేవిధంగా, చిన్నారులు తిరిగి వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులు, హెల్ప్‌లైన్‌, పోర్టళ్లు తదితర వ్యవస్థలకు తెలియజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఇలాంటి సమాచారం మరెంతో మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బాధిత చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ప్రభుత్వపరంగా వ్యవస్థల్లో నెలకొన్న లోపాలు, అడ్డంకులను సరిదిద్దాలి. ఇలాంటి కేసులకు సంబంధించి అంతర్రాష్ట్ర సమన్వయం, సహాయ-పునరావాసాలు అత్యావశ్యకం. చిన్నారులు దూరమైతే ఆ కుటుంబ సభ్యులు ఎంతో క్షోభ అనుభవిస్తారు. బాలలు తప్పిపోకుండా పాటించాల్సిన జాగ్రత్త చర్యలపై కుటుంబాల్లో అవగాహన కల్పించాలి. తప్పిపోయిన చిన్నారులను వెదికి సత్వరమే కుటుంబం వద్దకు చేర్చే పటిష్ఠ వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే ఈ సమస్య తీవ్రత చాలావరకూ తగ్గుతుంది.

- డాక్టర్‌ మమతా రఘువీర్‌ (సామాజిక విశ్లేషకులు)

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని