Updated : 25 May 2022 06:34 IST

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

నేడు ప్రపంచ థైరాయిడ్‌ దినం

గొంతు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి, శరీరంలో పలు రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. హార్మోన్లను స్రవించడం ద్వారా సాధారణ జీవక్రియలతో పాటు ఎదుగుదల, శరీర ఉష్ణోగ్రతల్ని ప్రభావితం చేస్తుంది. నాడీవ్యవస్థ, ప్రత్యుత్పత్తిలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతమైన శిశువు జననం, మెదడు ఎదుగుదలలో ఈ గ్రంథి పాత్ర ఎంతో కీలకం. థైరాయిడ్‌ స్రవించే హార్మోన్ల ఉత్పత్తి శరీరంలో అయోడిన్‌ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అయోడిన్‌ లోపించిన ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్‌ పనితీరు మందగిస్తుంది. గ్రంథి స్రవించే హార్మోన్‌ స్థాయుల్లో అసమతౌల్యం ఏర్పడినప్పుడు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్‌ స్థాయులు తక్కువైతే హైపోథైరాయిడిజం, ఎక్కువైతే హైపర్‌ థైరాయిడిజం వ్యాధికి దారితీసి కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదమూ ఉంటుంది. రోగ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించే వీలు లేకపోవడం, అయోడిన్‌ రహిత ఉప్పును వినియోగించడం వంటి కారణాలతో పాటు- థైరాయిడ్‌ సమస్యలపై ప్రజల్లో సరైన అవగాహన లేక నానాటికీ థైరాయిడ్‌ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2007లో అంతర్జాతీయ థైరాయిడ్‌ సమాఖ్య ఏటా మే నెల 25 తేదీని ‘ప్రపంచ థైరాయిడ్‌ దినం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. థైరాయిడ్‌ వ్యాధులు, రోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించి వ్యాధి ముప్పును అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.

నానాటికీ తీవ్రతరం

మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధ పడుతుండగా వీరిలో అత్యధికులు మహిళలే. గర్భందాల్చిన తరవాత మొదటి త్రైమాసికంలోనే 40 శాతం మహిళల్లో హైపోథైరాయిడిజం నిర్ధారణ అవుతుండటం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. సరైన చికిత్సను అందించని పక్షంలో గర్భస్రావం, పిండ దశలోనే శిశు మరణం, నెలలు నిండకుండానే శిశు జననం, శిశువు శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. హైపోథైరాయిడిజంతో జన్మించిన శిశువులకు చికిత్స అందించని పక్షంలో నాడీవ్యవస్థ పనితీరు మందగించి మానసిక వైకల్యం సంభవిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ థైరాయిడ్‌ సమస్యాత్మకంగా మారుతోంది. హైపోథైరాయిడిజం బారిన పడిన శిశువులను ఈ వ్యాధి దుష్ప్రభావాలు జీవితాంతం వేధించడం వల్ల గర్భస్థ మహిళలందరికీ థైరాయిడ్‌ పరీక్షలు నిర్వహించడాన్ని అన్ని దేశాలూ తప్పనిసరి చేస్తున్నాయి. మన దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి స్క్రీనింగ్‌ పద్ధతి, పరీక్షలు అందుబాటులో ఉన్నా- ప్రభుత్వ వైద్యశాలల్లోనూ గర్భిణులు, శిశువులు తదితరులకు పరీక్ష సదుపాయాల్ని కల్పించాల్సిన అవసరం ఉంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు అస్తవ్యస్తంగా మారడంవల్ల గాయిటర్‌ వ్యాధి వస్తుంది. దీని తీవ్రతను అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ 1980వ దశకంలో గాయిటర్‌ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సమస్యగా గుర్తించి ఆహార పదార్థాలను అయోడిన్‌తో సమృద్ధం చేయాలని సూచించాయి. దేశవ్యాప్తంగా వంటల్లో వాడే ఉప్పును అయోడిన్‌తో సమృద్ధం చేయాలని భారత్‌ నిర్ణయించింది. జాతీయ గాయిటర్‌ నియంత్రణ కార్యక్రమాన్ని జాతీయ అయోడిన్‌ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమంగా మార్చి అయోడిన్‌ లోపం వల్ల తలెత్తే శారీరక, మానసిక ఎదుగదల లోపాలను, మూగ, చెవిటి, గర్భస్రావం, శిశు మరణాలను కట్టడి చేయడానికి పలు చర్యలు చేపట్టింది. ఉప్పులో అయోడిన్‌ చేర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఉప్పులో అయోడిన్‌ను చేర్చే విధానం ప్రపంచమంతటా సత్ఫలితాలనివ్వగా, 21 దేశాల ప్రజలు నేటికీ అయోడిన్‌ లోపంతో బాధపడుతున్నారని 2020 నాటి నివేదికలు స్పష్టం చేశాయి.

అయోడిన్‌ లోపం

అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అయోడిన్‌ లోపాలను సవరించేందుకు అధిగమించాల్సిన మైలురాళ్లు మరెన్నో ఉన్నాయని తేలింది. దేశవ్యాప్తంగా దాదాపు పదిహేడు కోట్ల జనాభాలో అయోడిన్‌ లోపమున్నట్లు ఈ సర్వే గుర్తించింది. వీరిలో 5.4 కోట్లమంది గాయిటర్‌ జబ్బు, ఇరవై లక్షల మంది చిన్నారులు తీవ్ర శారీరక, మానసిక లోపాల బారినపడే ముప్పుతో ఉన్నట్లు తేలింది. 71 శాతం కుటుంబాలు నిర్దేశిత స్థాయి కన్నా తక్కువ పరిమాణంలో స్వీకరిస్తున్నట్లు వెల్లడి కావడం- దేశ ప్రజల్లో అయోడిన్‌ లోపం తీవ్రతకు అద్దం పడుతోంది. అయోడిన్‌తో కూడిన ఉప్పును స్వీకరిస్తున్నవారు అత్యధికంగా త్రిపుర (99.5శాతం), కేరళ (99.3శాతం) రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణలో దాదాపు 96 శాతం ఉన్నట్లు తేలింది. అత్యంత తక్కువగా, కేవలం 83శాతం జనాభా మాత్రమే అయోడిన్‌తో కూడిన ఉప్పును వినియోగిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దిగువ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలను తయారు చేసే పలు ఏపీ కంపెనీలు సముద్రపు ముడి ఉప్పును నేరుగా వాడటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అయోడిన్‌ ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర రీతిలో అవగాహన పెంపొందించే బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజలు కూడా సరైన రీతిలో స్పందించి జాగ్రత్తలు పాటించినప్పుడే థైరాయిడ్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది.

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని