Updated : 29 May 2022 07:04 IST

చిట్టగాంగ్‌లో లంగరు

జోరెత్తనున్న సరకు రవాణా

శాన్య భారతదేశం వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన ప్రాంతం. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా రహదారులు, రైలు మార్గాలను అభివృద్ధి చేసినా పర్వత, అటవీ ప్రాంతాల కారణంగా ఈశాన్యంలో ఆశించిన స్థాయిలో రవాణా సౌకర్యాలు విస్తరించలేదు. దేశ విభజన సమయంలో అత్యంత కీలకమైన చిట్టగాంగ్‌ నౌకాశ్రయాన్ని కోల్పోయాం. భారత ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని సిలిగుడి నడవా అనుసంధానిస్తుంది. చాలా చిన్నగా ఉండే ఈ ప్రాంతాన్ని చికెన్‌నెక్‌ కారిడార్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఎలాంటి అలజడులు ఏర్పడినా ఈశాన్య భారతానికి వెళ్ళే రవాణా సౌకర్యాలపై ప్రభావం పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా రహదారి మార్గంలో వెళుతుండటంతో ఆర్థికంగా భారం పడుతోంది. బంగ్లాదేశ్‌లో భారత అనుకూల ప్రభుత్వం ఉండటంతో ఆ దేశం చిట్టగాంగ్‌, మోంగ్లా ఓడరేవులను ఉపయోగించుకోవడానికి అంగీకరించేందుకు ముందుకు వచ్చింది. 2010లోనే ఉభయ దేశాల మధ్య ఈ నౌకాశ్రయాల వినియోగంపై ఒక అవగాహన ఒప్పందం కుదిరినా పెద్దగా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. చివరికి 2018లో బంగ్లాదేశ్‌ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది.

చిట్టగాంగ్‌ బంగ్లాదేశ్‌కు ప్రధాన నౌకాశ్రయం. బంగాళాఖాతానికి ఎగువన కర్ణాఫులి నదిపై దీన్ని నిర్మించారు. ప్రపంచంలోని అత్యంత రద్దీ గల నౌకాశ్రయాల్లో ఇది ఒకటి. ఇండియా, నేపాల్‌, భూటాన్‌లకు అత్యంత చేరువలో ఉంది. ఇక్కడ సరకులను దిగుమతి చేసుకొని రోడ్డు మార్గం ద్వారా ఈ దేశాలకు చౌకగా రవాణా చేసే సౌలభ్యముంది. కంటైనర్‌ టెర్మినల్‌ను కూడా భారీయెత్తున విస్తరిస్తున్నారు. 2020లో బెంగాల్‌లోని హల్దియా నౌకాశ్రయం నుంచి చిట్టగాంగ్‌కు రవాణా నౌకల్ని ప్రయోగాత్మకంగా నడిపారు. అక్కడి నుంచి త్రిపుర, అస్సాం, మేఘాలయాలకు సరకులు రవాణా చేశారు. చిట్టగాంగ్‌, మోంగ్లా నౌకాశ్రయాలను ఈశాన్యానికి అనుసంధానిస్తే ఉభయ దేశాలకు లాభదాయకమే. సిలిగుడి కారిడార్‌ ద్వారా సరకు తరలింపునకు వ్యయం అధికంగా అవుతోంది. చిట్టగాంగ్‌ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు చాలా చౌకగా రవాణా చేసే అవకాశముంది. మరోవైపు కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిన బంగ్లాదేశ్‌కు ఈ నౌకాశ్రయంతో వచ్చే సుంకాలతో ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. నౌకాశ్రయంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చైనా ‘ముత్యాలసరం’ భవిష్యత్తులో మనదేశానికి భద్రతా సమస్యలను సృష్టించగల ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్‌లోని గ్వదర్‌, శ్రీలంకలోని హంబన్‌టొటా నౌకాశ్రయాలు బీజింగ్‌ అధీనంలోకి వెళ్ళాయి. చిట్టగాంగ్‌లోనూ ఇదే వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. అయితే ఈ నౌకాశ్రయంలో భారత్‌కు అనుసంధానత కల్పించడం ద్వారా చైనాకు బంగ్లాదేశ్‌లో చెక్‌ పెట్టినట్లేనని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాల విస్తరణలో భాగంగా ఫెని నదిపై మైత్రి సేతును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 1.9 కి.మీ. పొడవైన ఈ వంతెన త్రిపురలోని సబ్రూమ్‌, బంగ్లాదేశ్‌లోని రామ్‌గఢ్‌లను కలుపుతుంది. చిట్టగాంగ్‌లో భారత రవాణా సరకులను దించిన అనంతరం ఈ మార్గం ద్వారా భారత్‌కు త్వరితగతిన తరలించవచ్చు. భారత ఉపఖండంలో ఉప ప్రాంతీయ కూటమిలోని దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, నేపాల్‌ (బీబీఐఎన్‌)ల మధ్య మరింత సహకారానికి ఇలాంటి ఒప్పందాలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. చిట్టగాంగ్‌ నౌకాశ్రయాభివృద్ధికి చైనా గతంలో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాంతంలో డ్రాగన్‌ నౌకల సంచారం ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి రాజధాని ఢాకాకు హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టును నిర్మించేందుకు చైనా ఆసక్తి చూపుతోంది. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో చైనా సంచారం పెరగడం భారత్‌కు ఆందోళనకరమే. బంగ్లాదేశ్‌లో చైనాను నియంత్రించేందుకు, ఈశాన్య భారతానికి నౌకాశ్రయ అనుసంధానానికి దిల్లీ సత్వర చర్యలు చేపట్టాలి.

- కె.శ్రీధర్‌

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని