Published : 29 May 2022 00:57 IST

మందిసొమ్ముతో అవినీతి సామ్రాజ్యాలు

దొంగా దొంగా వచ్చాడే... అన్నీ దోచుకుపోతాడే’ అన్నది పాత తెలుగు సినిమా పాట. ‘నేతా నేతా నెగ్గాడే... అన్నీ నమిలేసిపోతాడే’ అన్నది పేరుగొప్ప ప్రజాస్వామ్యంలో ఎన్నటికీ పాతపడని మాట! బకాసురుడి ఆకలికైనా పరిమితి ఉంటుంది కానీ, తెల్లచొక్కాల పెద్దమనుషుల పేరాశలకు అంతం ఉండదన్నది జనావళి నిశ్చితాభిప్రాయం. ఆ ‘నమ్మకాన్ని’ అలాగే నిలబెట్టుకోవడమంటే భారతీయ నాయకుల్లో అత్యధికులకు మహా ఇష్టం. అటువంటి నేతాశ్రీల్లో ఒకరుగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌటాలా దేశమంతటికీ చిరపరిచితులు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో దోషిగా సుదీర్ఘ కాలం కారాగార వాసం అనుభవించిన ఆయన నిరుడే విడుదలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆ రాజకీయ కురువృద్ధుడికి తాజాగా నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. 1993-2006 మధ్య ‘ప్రజాసేవ’కు అంకితమైన రోజుల్లో రూ.6.09 కోట్లను చౌటాలా అక్రమంగా వెనకేసుకున్నారన్నది అభియోగం. ఇన్నేళ్లకు ఆ నేరం రుజువు కావడంతో శ్రీకృష్ణ జన్మస్థానానికి ఆయన తిరిగి ప్రయాణం కట్టక తప్పలేదు పాపం! అక్రమాస్తులకు బ్రాండు అంబాసిడర్ల వంటి నాయకోత్తములు, ‘నాకిది-నీకది’ తరహాలో తిలా పాపం తలా పిడికెడు పంచిపెట్టిన మహానేతలు, వారు గుటకాయ స్వాహా చేసిన లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే- ఆరు కోట్లు ఎంత, గాలికిపోయిన పేలపిండంత! దానికే నాలుగేళ్ల శిక్ష అంటే- తండ్రులూ తాతల పదవుల పునాదులపై అచిరకాలంలోనే అవినీతి మహాసామ్రాజ్యాలను నిర్మించిన జగత్‌ కంత్రీలకు ఎన్నేసి జీవితఖైదులు విధించాలి?

అవినీతి మూలంగా 1947-2017 మధ్య ఇండియా రూ.80 లక్షల కోట్లు కోల్పోయిందన్నది ఒక అంచనా. జాతి వనరులను దిగమింగేసే చీకటి కార్యకలాపాల కారణంగా దేశం ఏటా లక్ష కోట్ల రూపాయల దాకా నష్టపోతోందనీ అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రజాసేవకులుగా చలామణీ అయ్యే రాజకీయ నాయకులకు తెలియకుండా, వారి పాత్ర ఏమీ లేకుండానే అవన్నీ జరిగిపోతున్నాయా? ఆ భ్రష్టాచారాలకు, ఆకాశమే హద్దుగా ఎగబాకే నేతల ఆస్తులకూ సంబంధం లేదంటే ఎవరు విశ్వసిస్తారు? అక్రమంగా ఆస్తులను పోగేసుకునే నాయకుల పెడపోకడలు ప్రజాస్వామ్యాన్ని పెళ్లగించి, మాఫియా పాలనకు బాటలు పరుస్తాయని సుప్రీంకోర్టు లోగడ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా... ఎవరికి పట్టింది? మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చోరకళా విన్యాసాలను పరమాద్భుతంగా ప్రదర్శించిన నేతలకు దేశీయంగా లోటు లేదు. సంవత్సరాలు గడచిపోతున్నా అటువంటి వారిపై నమోదైన కేసులకు అతీగతీ ఉండటం లేదు. కేంద్ర ప్రభుత్వమే లోగడ సుప్రీం కోర్టుకు నివేదించిన గణాంకాల ప్రకారం- రాజకీయ నేతలు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు పడ్డ వాటి సంఖ్య కేవలం ఆరు శాతం. తాము తప్పు చేసినా, చట్టాలను ఏమార్చినా ఏమీ కాదన్న నమ్మకమే నాయకులకు పెద్ద బలం... దేశానికి అదే దౌర్భాగ్యం! ఆర్థిక నేరగాళ్లుగా జాతీయస్థాయిలో పేరు మోసిన వారు, పలు కేసుల్లో నిందితులుగా న్యాయస్థానాల మెట్లెక్కి దిగేవాళ్లూ పరిపాలకులుగా, ప్రజాధ నానికి ‘రక్షకులు’గా బాధ్యతలు నిర్వర్తించడమూ భారతావనిలోనే సాధ్యం. వాయిదాలపై వాయిదాలతో ఏళ్లూపూళ్లూ కొనసా...గుతున్న విచారణలు, అధికార పక్షాల కనుసన్నల్లో దర్యాప్తు సంస్థలు వేసే పిల్లిమొగ్గలతోనే ఆ అవినీతి జలగల ఆటలు యథేచ్ఛగా వర్ధిల్లుతున్నాయి.

మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లుగా విధులు నిర్వర్తించడంలో ఈడీ, సీబీఐ వంటివి అపార ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శిస్తుంటాయి. ముఖ్యంగా పెద్దల పాత్ర ఉన్న కేసుల్లోనైతే అవి తాబేళ్లకే నడకలు నేర్పుతుంటాయి. మనీ లాండరింగ్‌ నిషేధ చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణలు ఆరంభమయ్యేలా ఈడీ ఎటువంటి చొరవా చూపడం లేదని ముంబయిలోని ప్రత్యేక కోర్టు రెండు నెలల క్రితం ఆక్షేపించింది. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల దర్యాప్తులో మందకొడితనానికి కారణమేమిటో ఈడీ, సీబీఐ స్పష్టంగా చెప్పడం లేదని సర్వోన్నత న్యాయస్థానమూ నిరుడు తప్పుపట్టింది. కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తూ; పాలకపక్షాల పెద్దల అవసరాలకు అనుగుణంగా కొన్నింటిని హఠాత్తుగా తెరపైకి తెస్తూ, మరికొన్నింటిని దస్త్రాల వెనక కప్పెట్టేసే దర్యాప్తు సంస్థల కపట నాటకాలు చట్టాలను నవ్వులపాలు చేస్తున్నాయి. అమాయకుల మీద బురదజల్లడంలోనూ వాటికవే సాటిగా నిలుస్తున్నాయి. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌పై మాదక ద్రవ్యాల కేసులో ఆధారాల్లేవని ఎన్‌సీబీ తాజాగా ప్రకటించింది. మరి ఆ కుర్రాడిపై అభియోగాలు ఎలా మోపారు... కటకటాల్లోకి ఎలా నెట్టారు? పారదర్శకత, జవాబుదారీతనం లేని దర్యాప్తు సంస్థల తీరుతో ఆర్యన్‌ వంటి వాళ్లు మానసిక క్షోభకు గురవుతున్నారు. అదే సమయంలో అవినీతి గ్రంథసాంగులు మాత్రం బయట పైలాపచ్చీసుగా తిరుగుతున్నారు. అంగ, అర్థబలాలతో శాసననిర్మాతలుగా అవతరిస్తూ ప్రజాస్వామ్యం పరువు తీస్తున్నారు.

‘మంత్రులుగా పదవుల్లోకి వచ్చేవారు తమ ఆస్తులను ముందే ప్రకటించాలి... ఆ కుర్చీల్లోంచి దిగిపోయే ముందు మరోసారి వాటిని వెల్లడించాలి... ఆ మధ్యకాలంలో ఆస్తులు అసాధారణంగా ఎగబాకితే అందుకు వారు లెక్కలు చెప్పాలి... తప్పు చేసినట్లు తేలితే తగిన శిక్షకు పాత్రులు కావాలి’- 1948 డిసెంబరులో రాజ్యాంగ సభలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వ్యక్తంచేసిన అభిప్రాయాలివి. అమాత్యుల్లో నైతిక నిష్ఠ దాదాపుగా నేతిబీర చందమని, చట్టవిరుద్ధంగా వారు సంపదను పోగేసుకుంటున్నారని సంతానం కమిటీ ఆ తరవాతి కాలంలో అసలు విషయం సూటిగా చెప్పేసింది. దశాబ్దాలు  గడచిపోతున్నా ఆ అవ్యవస్థ తొలగిపోలేదు సరికదా, రాజకీయ అవినీతి రక్కసి కబంధ హస్తాలు పోనుపోను మరింతగా బలపడుతున్నాయి. వాటి పట్టులోంచి దేశాన్ని విడిపించే వ్యూహంలో భాగమంటూ- ఎన్నికలప్పుడు అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులను ప్రకటించే పద్ధతి అమలులోకి వచ్చింది. వారు వెల్లడించే వివరాల్లోని నిజానిజాలేమిటో  ప్రజలకు తెలియదు. వాటిని పరిశీలించే వ్యవస్థ సైతం దేశంలో  పాదుకొనలేదు. బినామీలు, డొల్ల కంపెనీలతో పర్వతాల మాదిరిగా అక్రమాస్తులను పేరబెట్టే నేతలు పుట్టుకొచ్చాక అటువంటి కంటితుడుపు ప్రకటనలతో ఒనగూడేదేమిటి? ప్రత్యక్ష ప్రజాద్రోహులైన స్వార్థ నాయకుల చేతుల్లో దేశం భవిత ఏమైపోతుంది?

- శైలేష్‌ నిమ్మగడ్డ

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని