Briton Elections: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికపై ఉత్కంఠ

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఎన్నికవుతారా లేదా అన్న అంశంపై మనదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఈ

Updated : 01 Aug 2022 08:05 IST

పోటీలో రిషి సునాక్‌ వెనకంజ!

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఎన్నికవుతారా లేదా అన్న అంశంపై మనదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఈ పదవికి పోటీ పడుతున్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. పాలక కన్జర్వేటివ్‌ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో అత్యధికులు రిషి వైపే మొగ్గు చూపడం భారతీయులకు ఆనందం కలిగించింది. భారతీయ మూలాలున్న రిషి- ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్ళాడారు. ఒకప్పుడు భారతదేశాన్ని ఏలిన బ్రిటన్‌కు ఇప్పుడు ఒక భారత సంతతి వ్యక్తి పాలకుడైతే చిత్రమైన ఆనందం కలగక మానదు. అయితే, బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి ఎన్నికవుతారని భారతీయులు అతిగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

మారిన పరిస్థితి
సునాక్‌ పాలక పార్టీ ఎంపీల మద్దతు చూరగొన్నా, ఆ పార్టీకి ఉన్న రెండు లక్షల మంది క్రియాశీల కార్యకర్తల అండదండలు సంపాదించడం తేలిక కాదు. ఈ కార్యకర్తల్లో అత్యధికులు లిజ్‌ట్రస్‌ నాయకత్వానికే ఓటు వేస్తున్నట్లు ఇటీవల ‘యూగవ్‌’ సర్వేలో తేలింది. ప్రధాని పోటీలో గెలుపు అవకాశాలు 90శాతం ట్రస్‌కే ఉన్నట్లు బ్రిటన్‌ బెట్టింగ్‌ ఎక్స్ఛేంజ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేసింది. భారత్‌లో మాదిరి కొద్దిమంది సీనియర్‌ నాయకులో, ఏదైనా కుటుంబమో దేశాధినేతను ఎంపిక చేసే పద్ధతి బ్రిటన్‌లో లేదు. అక్కడ పార్లమెంటు సభ్యులతోపాటు పార్టీ క్రియాశీల కార్యకర్తలు, సభ్యులు సైతం కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారు. పరదేశాల్లో భారత సంతతి వ్యక్తులు రాజకీయాలతోపాటు ఇతర రంగాల్లో ఎదిగితే మనం ఆనందంతో గంతులేయాల్సిన పని లేదు. అసలు భారతీయ మూలాలు ఉండటమే వారి ముందరి కాళ్లకు బందాలు వేస్తుంది. భారత్‌లో ఎదిగి, మాతృదేశం పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం విదేశాల్లోని స్థానికులకు కలగకుండా మరిన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భారతదేశం పట్ల ఏ విషయంలోనైనా మొగ్గు చూపారా? అమెరికాలో ప్రస్తుత బైడెన్‌ ప్రభుత్వంలో చాలామంది భారత సంతతివారు ఉన్నత పదవులు అలంకరించారు. వారివల్ల మనకు ప్రత్యేకంగా ఒనగూడింది ఏమీ లేదు. పైపెచ్చు భారతీయ మూలాలున్న ఒక జూనియర్‌ అధికారి పనిగట్టుకొని దిల్లీకి వచ్చి ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను తెగనాడనందుకు భారత్‌ను విమర్శించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అతడికి చురక అంటించినా, ఆ అధికారి తీరు భారతీయులను నొప్పించింది. విదేశాల్లో భారత సంతతివారు స్వశక్తితో విజయాలు సాధిస్తారు లేదా ఆయా దేశాల్లోని స్థితిగతులు వారి ఎదుగుదలకు దోహదం చేసి ఉంటాయి. పోర్చుగల్‌, ఐర్లాండ్‌లకు భారత సంతతివారు ప్రధానమంత్రులైనా ఆయా దేశాలతో మనకు కొత్తగా ఆత్మీయ బంధమేదీ ఏర్పడలేదని గుర్తించాలి. ఇతర దేశాల నుంచి వలస వచ్చి స్థిరపడినవారు బ్రిటిష్‌ క్రికెట్‌ జట్టుకు వత్తాసు పలికితేనే వారు విధేయతా పరీక్షలో నెగ్గినట్లని గతంలో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిపోయింది. నేడు బ్రిటిష్‌ ప్రజలు జాతి, మతం వంటి భేదాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో విదేశీ సంతతివారు రాణించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. అందుకే బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్‌ పార్టీలో తొలివిడతలో పోటీపడిన వారిలో నలుగురు విదేశీ సంతతివారున్నారు.

అవరోధం కాదు
సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతివారు అక్కడ సాటి భారతీయులతోనే కలిసిమెలిసి ఉంటారు. ప్రవాస భారతీయ సంపన్నులు సైతం భారతీయ మూలాలున్న వారితోనే స్నేహాలు, పరిచయాలు పెంచుకుంటారు. దాంతో భారత సంతతి వ్యక్తులు దశాబ్దాలుగా తెల్లవారి దేశాల్లో నివసిస్తున్నా స్థానిక శ్వేతజాతీయులతో సామాజిక దూరం కొనసాగుతోంది. రాజకీయంగా మాత్రం జాతి, మత భేదాలు అంతరించడం విశేషం. 2019 ఎన్నికల్లో విదేశీ మూలాలున్నవారు ఏకంగా 60 మంది బ్రిటిష్‌ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారు గెలిచిన నియోజకవర్గాలు చాలావాటిలో శ్వేత జాతి వారు కాకుండా ఇతర జనాభాయే అధికం. వచ్చే దశాబ్దంలో లండన్‌లో శ్వేతజాతీయులు అల్పసంఖ్యాకులుగా మారతారని ఒక అంచనా. ప్రస్తుత లండన్‌ మేయర్‌ సాదిక్‌ఖాన్‌ పాకిస్థానీ సంతతి వ్యక్తి. ఏతావతా బ్రిటిష్‌ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి విదేశీ మూలాలు అడ్డంకి కావు. రాజకీయ పార్టీల సభ్యులు, కార్యకర్తలు, ఎంపీలు అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రధానమంత్రిని ఎన్నుకొంటారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలో రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి అయ్యే అవకాశం తక్కువేనని చెప్పక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.