UAPA:అన్యాయంగా ఊపిరితీస్తున్న ‘ఉపా’!

పరిపాలించడం అంటే భయపెట్టడం కాదు. జనాల నోళ్లు కుట్టేసేది ప్రజాస్వామ్యం కాబోదు. తమతో మౌలికంగా విభేదించే రాజకీయ స్వేచ్ఛను గౌరవించే లక్షణం పాలకుల్లో ఉండాలి. ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఎవరైనా సరే, నిర్భయంగా వెల్లడించగలిగే వాతావరణాన్ని కల్పించాలి. ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా విని, కూలంకషంగా పరిశీలించి సత్వరం...

Updated : 07 Aug 2022 02:17 IST

రిపాలించడం అంటే భయపెట్టడం కాదు. జనాల నోళ్లు కుట్టేసేది ప్రజాస్వామ్యం కాబోదు. తమతో మౌలికంగా విభేదించే రాజకీయ స్వేచ్ఛను గౌరవించే లక్షణం పాలకుల్లో ఉండాలి. ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఎవరైనా సరే, నిర్భయంగా వెల్లడించగలిగే వాతావరణాన్ని కల్పించాలి. ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా విని, కూలంకషంగా పరిశీలించి సత్వరం పరిష్కరించే వ్యవస్థను నెలకొల్పాలి. దేశీయంగా ఆ మేరకు కాగితాల్లో, నాయకుల ప్రసంగాల్లో గొప్పగా తళుకులీనుతున్న జనస్వామ్యం- వాస్తవంలో మాత్రం నీట్లో ముంచిన ఉప్పుమూట అవుతోంది. విష ఫలాలు కాసే చెట్టు వంటి ‘ఉపా’(చట్టవ్యతిరేక కార్యకలాపాలక నిరోధక చట్టం)- విమర్శించే వాళ్ల వీపులను పగలగొట్టేందుకు సర్కార్లకు బాగా అక్కరకొస్తోంది. ‘అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో ఉగ్రవాద చర్యలకు, రాజ్యాంగబద్ధమైన నిరసన హక్కుకు మధ్య ఉండే విభజన రేఖను ప్రభుత్వం కాలరాస్తోంది’ అన్న దిల్లీ ఉన్నత న్యాయస్థానం నిరుటి వ్యాఖ్య- విమర్శనా గళాలకు ‘ఉపా’తో ఉరి బిగిస్తున్న కుటిల రాజకీయాలను ఎండగట్టింది. ఆ కరకు శాసనం కింద 2018-2020 నడుమ దేశవ్యాప్తంగా 4690 మంది అరెస్టు అయ్యారని, 149 మందికి శిక్షలు పడ్డాయని కేంద్రం తాజాగా రాజ్యసభకు సమాచారమిచ్చింది. 2014 నుంచి లెక్కేస్తే ఆ తరవాత ఏడేళ్లలో 10,552 మందికి ‘ఉపా’ సంకెళ్లు బిగుసుకుంటే- కేవలం 253 మందిపై నేరాభియోగాలు రుజువయ్యాయి. నేతలు, పోలీసులు కలిసి ఆడుతున్న మాయా చదరంగంలో మంట కలిసిపోతున్న మానవ హక్కులకు ఆ గణాంకాలు అద్దంపడుతున్నాయి.

మహమ్మద్‌ అలీ భట్‌, లతీఫ్‌ అహ్మద్‌ వజా, మీర్జా నిస్సార్‌ హుస్సేన్‌ అనే కశ్మీరీ కుర్రాళ్లను ‘ఉగ్రవాదులు’గా పేర్కొంటూ 1996లో అరెస్టు చేశారు. ఇరవై మూడేళ్ల కారాగారవాసం అనంతరం వాళ్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ ముగ్గురిపై పోలీసులు మోపిన అభియోగాలను దిల్లీ, రాజస్థాన్‌ హైకోర్టులు కొట్టేశాయి. కానీ, వారు కోల్పోయిన నిండు జీవితాలను ఎవరైనా తిరిగి తెచ్చివ్వగలరా? ఉగ్రవాదంపై పోరాటమంటే అమాయకులను రాచిరంపాన పెట్టడమేనా? కశ్మీర్‌కే చెందిన ఐజాజ్‌ బాబాను గుజరాత్‌ ఖాకీలు 2010లో ‘ఉపా’ కింద ఖైదు చేశారు. పదకొండేళ్ల సుదీర్ఘ నిర్బంధం తరవాత- ఉగ్రవాద కార్యకలాపాలతో అతడికి సంబంధం ఉన్నట్లుగా ఆధారాలేమీ లేవంటూ స్థానిక న్యాయస్థానం నిరుడు అతణ్ని విడుదల చేసింది. ప్రాసిక్యూషన్‌ వాదన పూర్తిగా భావోద్రేకాలపైనే ఆధారపడిందని కోర్టు తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పాత్రికేయుల హత్యలకు కుట్రపన్నారంటూ మహమ్మద్‌ ఇలియాస్‌, ఇర్ఫాన్‌ అనే ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం 2012లో పట్టుకొంది. వాళ్ల మీద ‘ఉపా’ చట్టం కింద అభియోగాలు మోపింది. ఆపై ఆ కేసు జాతీయ పరిశోధనా సంస్థ(ఎన్‌ఐఏ) చేతికొచ్చింది. చివరికి ఏమైంది... ఇలియాస్‌, ఇర్ఫాన్‌లు నేరస్థులు కారని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గతేడాదిలో తీర్పిచ్చింది! ‘బస్‌ నౌ సాల్‌ జో గయే, సబ్‌ హవా మే’ (జీవితంలో తొమ్మిదేళ్లు నష్టపోయాం) అని కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితుల గుండె మంటలను ఎవరు చల్లార్చగలరు? ‘ఉపా’ కింద అరెస్టు అవుతున్న వారిలో యాభై శాతానికి పైగా 18 నుంచి 30ఏళ్ల లోపు వారే. చీకటి కొట్టాల్లో సంవత్సరాల తరబడి వారు అనుభవిస్తున్న దుర్భర జీవితాలకు సమాంతరంగా- పోషించే బిడ్డల్లేక బయట వారి కుటుంబాలు చితికిపోతున్నాయి. నిందితులుగా కటకటాల పాలైనవారు నిర్దోషులుగా తిరిగి వచ్చేసరికి- అయినవాళ్ల ఆనవాళ్లు ఈ లోకంలోంచే చెరిగిపోతున్నాయి!

అయిదున్నర దశాబ్దాల క్రితం తొలిసారి ‘ఉపా’ ఊపిరిపోసుకుంది. 2004, 2008, 2013, 2019ల్లో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు దానికి సవరణలు చేశాయి. దుర్లభమైన బెయిలు నిబంధనలు, ఇతరాలతో ఆ చట్టం కోరలకు విపరీతంగా పదునుపెట్టాయి. అసలు ‘ఉపా’ పేరులోనే అంతులేని సందిగ్ధత ఉంది. చట్టవ్యతిరేక పనులను నిరోధించడానికి దేశీయంగా శాసనాలెన్నో పోగుపడినప్పుడు- రాజ్యాంగదత్తమైన జీవించే హక్కును కబళించే క్రూర నియమాలతో ప్రత్యేక చట్టం ఎందుకు... ఎవరిని ఉద్ధరించడానికి? పౌరసత్వ చట్టానికి సవరణలను నిరసించిన దేవాంగన కలిత, నటాషా నర్వాల్‌, ఆసీఫ్‌ ఇక్బాల్‌ తన్హా అనే ముగ్గురు విద్యార్థి ఉద్యమకారులను దిల్లీ పోలీసులు ‘ఉపా’ కింద బోనెక్కించారు. తీవ్రమైన శిక్షలకు అవకాశం కల్పించే చట్టాలను ప్రజలపై అక్రమంగా ప్రయోగించడాన్ని తప్పుపట్టిన దిల్లీ హైకోర్టు- ఇదే దుస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం పతనమవుతుందని హెచ్చరించింది. ప్రజల్లోంచి ఉద్భవించే ప్రభుత్వం- సమాజం బాగుకోసం వినియోగించాల్సిన తన అధికారాన్ని అరాచకత్వానికి అంటుకట్టడానికి వినియోగిస్తూ క్రమేణా జనానికి దూరమవుతోంది. ఆ వ్యథాభరిత సమకాలీన చిత్రమే న్యాయపాలిక ఆవేదనలో ప్రతిబింబిస్తోంది.

సాధారణ చట్టాల కింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు మామూలుగా బెయిల్‌ మంజూరు చేస్తుంటాయి. ఆ అవకాశం లేకుండా కోర్టుల చేతులు కట్టేయడానికి అధికారులు ‘టాడా’ కింద కేసులు బనాయిస్తున్నారని సుప్రీంకోర్టు 1994లో వ్యాఖ్యానించింది. అలా ఆ చట్టాన్ని పోలీసులు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించింది. ‘ఉపా’ పరిస్థితి సైతం నేడు అచ్చం అలాగే తయారైంది. మతకల్లోలాలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు న్యాయవాదులు, పాత్రికేయులు వంటివారిపై త్రిపుర పోలీసులు నిరుడు ‘ఉపా’ కేసులు మోపారు. అధిక సంఖ్యాకుల హింసకు అడ్డుకట్ట వేయడంలో స్వీయ వైఫల్యం నుంచి అందరి దృష్టిని మరల్చే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగమే ఆ నిర్బంధ కాండ అని ‘ఎడిటర్స్‌ గిల్డ్‌’ అభివర్ణించింది. ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛలపై అంతర్జాతీయ వేదికల మీద మోతెక్కిపోతున్న నేతల ప్రకటనలకూ, దేశీయంగా పరిస్థితులకు లంకె కుదరడం లేదని నిర్వేదం వ్యక్తంచేసింది. 2018-2020 మధ్య అస్సాం, ఝార్ఖండ్‌, మణిపుర్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో ‘ఉపా’ కేసులు అధికంగా నమోదయ్యాయి. అమానుషమైన చట్టాన్ని యథాలాపంగా విచ్చలవిడిగా అమలు చేస్తుండటంపై విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, న్యాయమూర్తులు కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో అటువంటి కిరాతక శాసనానికి స్థానం లేదని వాళ్లు నిర్ద్వందంగా తేల్చిచెబుతున్నారు. వారి మాటలను బుట్టదాఖలు చేస్తున్న పాలకులు- నాగరికతా విలువగా భాసించాల్సిన ‘చట్టాన్ని’ తమ రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ప్రతీకార సాధనంగా ప్రయోగిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్న ఆలోచనా స్రవంతులపై సర్కారీ అసహనం హద్దులు దాటుతుండటం ప్రమాదకరమే కాదు- జాతీయ సమైక్యతకు అదే పెను విఘాతమవుతుంది!

- శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.