Politicians: పెత్తనోత్సాహం

‘ఏమిటోయ్‌... కొత్త లాల్చీతో పెద్దపంచె కట్టి- భుజాన జరీ అంచున్న కండువా వేసుకొని జోరుగా ముస్తాబై వెళ్తున్నావ్‌?’

Updated : 08 Aug 2022 02:12 IST

‘ఏమిటోయ్‌... కొత్త లాల్చీతో పెద్దపంచె కట్టి- భుజాన జరీ అంచున్న కండువా వేసుకొని జోరుగా ముస్తాబై వెళ్తున్నావ్‌?’
‘మా ఆవిడ పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది కదా... ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్నా...’
‘ఆమె గెలిస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేయడమేమిటి... మీ ఆవిడ కదా చేయాలి?’

‘అందుకే బాబాయ్‌ నిన్ను పాత చింతకాయ పచ్చడంటూ పిన్ని ఎగతాళి చేసేది... కాలం మారిపోతోంది. ఎన్నెన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. మన దేశంలో పంచాయతీలు కానివ్వు, ఇతర స్థానిక సంస్థలు కానివ్వు... మహిళలకు కేటాయించిన సీట్లలో వారు గెలిస్తే అధికారం చలాయించేది ఎవరూ?!’

‘చాలా సందర్భాల్లో భర్తో, తండ్రో, సోదరులో...’
‘కదా... పదవి ఆమెదే... కుర్చీలో కూర్చునేదీ ఆవిడే... కానీ పెత్తనమంతా పురుషులది. అంటే మనది! అలాంటప్పుడు ఆ ప్రమాణ స్వీకారం కూడా మనమే చేస్తే పోలా... అంటూ మధ్యప్రదేశ్‌లోని సాగర్‌, దమోహ్‌ జిల్లాల్లో పురుష పుంగవులు కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఏకంగా వాళ్లే ప్రమాణ స్వీకారం చేసేశారు. దేశంలో ఎన్నో కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. ఇదంతా కాలమహిమ సుమీ! నువ్వేమో తాజా రాజకీయ పరిణామాలను తెలుసుకోకుండా నన్ను తప్పు పడుతున్నావు’
‘అవునా... మరి ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అధికారులైనా వారిని వారించలేదా?’

‘పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు? ఎన్నిసార్లు పిలిచినా గడపదాటి బయటికి వచ్చేందుకు గెలిచిన మహిళలు సుముఖత చూపలేదు. ఆయా కుటుంబాల నుంచి మగమహారాజులు మాత్రం మేమున్నాముగా... అంటూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. దాంతో చేసేది లేక ఆ మగ బంధువులతోనే అధికారులు ప్రమాణ స్వీకారాలు కానిచ్చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌ కావడంతో- ఇలా కూడా చేయవచ్చంటూ దేశవ్యాప్తంగా ఒక స్పష్టత వచ్చిందనుకో...’

‘ఎక్కడో ఎవరో చేశారని దాన్నో సంప్రదాయంగా మార్చేయాలంటావా... ఏమిటి?’

‘మరే... అయినా ప్రమాణ స్వీకారం సారాంశం ఏమిటి? నేనది చేస్తా... ఇది చేస్తా... బాధ్యతగా వ్యవహరిస్తా... అనేగా! ఆమె ప్రమాణం చేసిన తరవాత ఎటూ భర్తో, తండ్రో, తమ్ముడో ఆ పనులు చేస్తారు. క్షేత్రస్థాయిలో వారే తిరుగుతారు. సమావేశాలకూ హాజరవుతారు. చివరికి ఉన్నతాధికారులకు ఆమె తరఫున సలహాలూ ఇస్తారు. కొందరు అధికారుల దగ్గర మహిళా ప్రజాప్రతినిధుల ఫోన్‌ నంబర్లకు బదులు వారి భర్త, తండ్రి నంబర్లే ఉంటాయి. వాళ్లతోనే మాట్లాడి నిర్ణయాలు చేసేస్తుంటారు. సతులు ప్రమాణం చేసి, పతులు పనులు చేయడం సాంకేతికంగా తప్పేగా... అధికారం ఎవరు చలాయిస్తారో వారే ప్రమాణ స్వీకారం చేయడం గందరగోళం లేని వ్యవహారమనుకో... ఇప్పుడిప్పుడే మన అధికారులకూ ఆ స్పష్టత వస్తోంది. ఇంకా కొందరు ఉన్నతాధికారులకే తత్వం పూర్తిగా బోధపడటంలేదు. అందుకే పాపం మగ బంధువులతో ప్రమాణ స్వీకారం చేయించిన సిబ్బందిని శిక్షించారు అన్యాయంగా... అలా శిక్షించడంద్వారా ఈ కొత్త సంప్రదాయానికి ఊపిరులూదే అవకాశాలకు గండి కొట్టారు’
‘అది కొత్త సంప్రదాయం కాదు... మహిళల పాలిట దుష్ట సంప్రదాయం. స్థానిక ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం ఈ మధ్య బాగా పెరగడం శుభపరిణామమని ఎంతో ఆనందించాం. కాకపోతే మహిళలు ఇంకా భర్తచాటు భార్యగానో, తండ్రి చాటు కూతురిగానో ఉండిపోతున్నారనడానికి మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఉదంతమే ఓ నిదర్శనం. అంతగా చదువుకోనివారి సంగతి సరే... చదువుకొన్నవారు సైతం పదవులు చేపట్టాక స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. భర్తో, తండ్రో రాసిచ్చిన స్క్రిప్టును చదవడం మినహా స్వయంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో లేకపోవడం బాధాకరమే!’

‘మరి అలాంటప్పుడే కదా... మన మగవాళ్లం వారికి బాసటగా నిలవాలి. ప్రతి మగవాడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందంటారు. విజేత అయిన మహిళ వెనక మగవాడు ఉన్నప్పుడే కదా రుణం తీర్చుకున్నట్లవుతుంది?’

‘వార్నీ... నీ సమర్థింపులో అజ్ఞానంతో పాటు పురుషాహంకారం కూడా ధ్వనిస్తోందోయ్‌... ఇది రుణం తీర్చుకోవడం కాదు. మహిళలను మరింత అణచివేయడం. వాళ్లను ఎదగనివ్వకుండా నీలాంటివాళ్లు అడ్డుపడుతూ ఉండటంవల్లే మహిళలు ఇంకా ఎన్నో రంగాల్లో ఇప్పటికీ వెనకబడి ఉన్నారు’

‘అదేమిటి బాబాయ్‌! అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ నామీదే పడ్డావ్‌! అయినా మహిళలకు సహాయం చేయడం కూడా నీ కళ్లకు అణచివేతలాగే కనిపిస్తే ఎలా?’
‘ఓరి దుర్మార్గుడా... ఆడవారి స్వాతంత్య్రాన్ని హరిస్తూ నువ్వేదో ఉద్ధరిస్తున్నట్లు ఫోజులు కొడుతున్నావా... సాయం చేస్తున్నాననే భ్రమలో ఉన్నావో లేక జనాన్ని భ్రమింపజేస్తున్నావో అర్థం కావడంలేదొరేయ్‌!!’

- వేణుగోపాల్‌ నీలి

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని