Published : 11 Aug 2022 00:54 IST

ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

ప్రపంచ వాణిజ్యంలో అనూహ్య పరిణామాలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలతో ప్రపంచ ఇంధన మార్కెట్‌ స్వరూపం మారిపోతోంది. క్రెమ్లిన్‌పై నాటో ఆంక్షల ఫలితంగా సరికొత్త వాణిజ్య భాగస్వామ్యాలు కుదురుతున్నాయి. భారత్‌, చైనాలు తమ ఇంధన అవసరాలను తీర్చే అతిపెద్ద భాగస్వామిగా రష్యాను గుర్తించాయి. మిత్రదేశం రాయితీపై అందించే చమురుతో అవి లబ్ధి పొందుతున్నాయి. ఆంక్షలను పట్టించుకోకుండా మాస్కోతో భారత్‌, చైనాలు బలమైన ఇంధన బంధం ఏర్పరచుకోవడంపై పాశ్చాత్య దేశాల రుసరుసలకు విలువ లేకుండా పోయింది. అమెరికాను కాదని రష్యా చమురును భారీగా కొంటున్న దేశాల జాబితాలోకి సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ సైతం చేరాయి. అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో సౌదీ ఒకటి. తన విద్యుత్తు ప్లాంట్లకు రష్యా నుంచి వచ్చే చవక చమురును సౌదీ వినియోగిస్తూ, తాను ఉత్పత్తి చేసే ప్రీమియం చమురును అధిక ధరలకు విక్రయిస్తోంది. మరోవైపు మాస్కో నుంచి ఐరోపాలోని నెదర్లాండ్స్‌, పోలాండ్‌,  ఫిన్లాండ్‌లకు చమురు సరఫరాలు పెరిగాయి.

ఆఫ్రికాపై దృష్టి
మాస్కోపై ఎడాపెడా ఆంక్షలు విధించిన ఐరోపా సంఘం (ఈయూ) 2027 నాటికి రష్యా చమురు, గ్యాస్‌ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇలాంటి వాటిని క్రెమ్లిన్‌ ఏమాత్రం ఖాతరు చేస్తున్నట్లు కనిపించడంలేదు. ఐరోపా దేశాలకు ఎగుమతి తగ్గడం వల్ల మిగులుతున్న గ్యాస్‌ను పైపులైన్‌ ద్వారా చైనాకు గరిష్ఠ స్థాయిలో రష్యా సరఫరా చేస్తోంది. మాస్కో ప్రభుత్వ ఇంధన సంస్థ ‘గాజ్‌ప్రోమ్‌’, చైనా ప్రభుత్వ విద్యుత్తు సరఫరా సంస్థ ‘సీఎన్‌పీసీ’ మధ్య ఈ మేరకు దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. గాజ్‌ప్రోమ్‌ ఇటీవలే నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ (ఎన్‌ఐఓసీ)తో సుమారు 40 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకొంది. అందులో భాగంగా ఇరాన్‌లోని పలు సముద్రతల, భూతల గ్యాస్‌ క్షేత్రాల అభివృద్ధిలో ఎన్‌ఐఓసీకి గాజ్‌ప్రోమ్‌ సహకరిస్తుంది. ప్రపంచంలో రష్యా తరవాత అత్యధికంగా సహజ వాయువు నిల్వలు ఇరాన్‌లోనే ఉన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా వెలికితీత సాంకేతిక పరిజ్ఞానం ఇన్నాళ్లూ ఇరాన్‌కు చేరలేదు. ఇకపై ఆ లోటు తీరిపోనుంది.

రష్యా నుంచి గ్యాస్‌ సరఫరాలో అనిశ్చితి వల్ల ఈయూ, మరీ ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. ఆఫ్రికాలోని తమ సంప్రదాయ ఇంధన సరఫరాదారులైన అల్జీరియా, ట్యునీసియాతో పాటు కొత్తగా రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, అంగోలా, సెనెగల్‌ దేశాల నుంచి దీర్ఘకాలిక కాంట్రాక్టుల కోసం వెంపర్లాడుతున్నాయి. ప్రపంచంలో గుర్తించిన సహజ వాయు నిల్వల్లో దాదాపు ఏడు శాతం ఆఫ్రికాలో ఉన్నట్టు అంచనా. ఆఫ్రికా దేశాల్లో రాజకీయ అనిశ్చితి, మౌలిక సదుపాయాల కొరతతో సహజ వాయువు వెలికితీత క్లిష్టంగా మారింది. ‘ఓఎన్‌జీసీ విదేశ్‌’కు మొజాంబిక్‌లో భారీ గ్యాస్‌ చమురు క్షేత్రం ఉన్నా- హింసాత్మక ఘర్షణలు, రాజకీయ అశాంతి వల్ల కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ కారణాలతోనే ఇన్నాళ్లూ అటువైపు ఐరోపా పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. షెల్‌, టోటల్‌, ఎని వంటి ఐరోపా సంస్థలు కొత్తగా నమీబియా, ఐవరీకోస్ట్‌ దేశాల్లో గ్యాస్‌ నిల్వలను కనిపెట్టినట్టు ఇటీవల ప్రకటించాయి. అంగోలా ప్రభుత్వ కంపెనీ నుంచి గ్యాస్‌ కొనుగోలుకు టోటల్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకొంది. ఈజిప్ట్‌లో గ్యాస్‌ అన్వేషణకు పలు ఐరోపా కంపెనీలు అనుమతులు పొందాయి. నమీబియా, బోట్స్‌వానాల మధ్యలో గుర్తించిన భారీ సహజ వాయు క్షేత్రంలో కెనడాకు చెందిన ‘రీకాన్‌ఆఫ్రికా’ సంస్థ వెలికితీత ప్రారంభించింది. అమెరికా కంపెనీలు అంగోలా, లిబియా, ఈజిప్ట్‌ వంటి దేశాల్లో ఎప్పటినుంచో అన్వేషణ, వెలికితీతలో నిమగ్నమయ్యాయి. యుద్ధం కారణంగా ఐరోపా నుంచి ధాన్యం అందక ఆహార కొరతతో అల్లాడుతున్న ఆఫ్రికా ఖండమే చివరికి ఐరోపాకు ఇంధనంలో ప్రత్యామ్నాయ ఎంపికైంది.

భారత్‌ వెనకంజ
యుద్ధ ఫలితం తేలకపోవడంతో చమురు, సహజ వాయువు ఒప్పందాల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్‌కు మెరుగైన, స్థిరమైన ప్రత్యామ్నాయాలు లేవనే చెప్పాలి. రష్యా నుంచి ఈయూకు దిగుమతులు కనిష్ఠానికి చేరాక అమెరికా తన ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి పెంచవచ్చు. అలా రష్యా నుంచి వస్తున్న చౌక చమురు ఈ ఏడాది చివరిదాకా మాత్రమే దొరికే అవకాశముంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు ఇప్పటిదాకా లిబియా, మొజాంబిక్‌, దక్షిణ సూడాన్‌ వంటి ఆఫ్రికా దేశాల్లో రూ.63 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో క్రియాశీల పెట్టుబడుల విషయంలో ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్‌ బాగా వెనకబడింది. భారత చమురు, గ్యాస్‌ దిగుమతుల్లో ఆఫ్రికా వాటా 15-16శాతం. మారిన పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ సైతం ఆఫ్రికా ఇంధన పోటీలో క్రియాశీలం కావాలని, తద్వారా భవిష్యత్తు ప్రయోజనాలను ఒడిసిపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

- సీహెచ్‌.మదన్‌ మోహన్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts