ఔదార్యం ఖరీదు నిండుప్రాణం

మనిషి మరణించాక దేహం మట్టిలో కలుస్తుంది. ఆ వ్యక్తి అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే మరికొందరికి కొత్త జీవితం లభిస్తుంది. అవయవ దానం గొప్పతనం అది. దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అంటారు. అది ఒక్కరి కడుపే నింపుతుంది. అవయవ దానం కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది.

Published : 13 Aug 2022 00:58 IST

నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం

మనిషి మరణించాక దేహం మట్టిలో కలుస్తుంది. ఆ వ్యక్తి అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే మరికొందరికి కొత్త జీవితం లభిస్తుంది. అవయవ దానం గొప్పతనం అది. దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అంటారు. అది ఒక్కరి కడుపే నింపుతుంది. అవయవ దానం కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపోహల వల్ల ఇండియాలో మరణించిన తరవాత అవయవదానం చేస్తున్నవారు ప్రతి పది లక్షల మందిలో 0.34మంది మాత్రమే ఉంటున్నారు. అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాల్లో ప్రతి పదిలక్షల జనాభాలో ముప్ఫై మందికి పైగా అవయవ దానానికి అంగీకరిస్తున్నారు. జర్మనీ వంటివి ప్రతి వ్యక్తీ అవయవ దానానికి ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తున్నాయి.

తీవ్ర కొరత
మధుమేహం, అధిక రక్తపోటు వంటి కారణాలవల్ల భారత్‌లో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలకు కిడ్నీలు విఫలమవుతున్నాయి. ఆయా కారణాలవల్ల ఎంతోమందికి కాలేయం, గుండె, ఇతర అవయవాల మార్పిడి అవసరమవుతోంది. సరిపడా సంఖ్యలో అవయవాల లభ్యత లేనందువల్ల ఇండియాలో ఏటా అయిదు లక్షల మంది నిస్సహాయ స్థితిలో ప్రాణాలు విడుస్తున్నట్లు వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బతికి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, కొంత కాలేయాన్ని సేకరించి ఇతరులకు అమర్చవచ్చు. కుటుంబ సభ్యులు ఇలాంటి దానానికి ముందుకొస్తారు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలవల్ల జీవన్మృతులు (బ్రెయిన్‌ డెడ్‌)గా మిగిలిన వారి నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం వంటి వాటిని సేకరించవచ్చు. మరణించిన ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా ఎనిమిది మంది జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపవచ్చు. ఇండియాలో అవయవాల సేకరణ, నిల్వ, తరలింపు, వాణిజ్య పరంగా వాటి దుర్వినియోగం వంటివాటిని నియంత్రించడానికి 1994లో మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం తెచ్చారు. 2011లో దానికి సవరణలు చేశారు. అవయవాల సేకరణ, కేటాయింపు, తరలింపు వంటివాటిని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఓటీటీఓ) పర్యవేక్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానానికి ‘జీవన్‌దాన్‌’ ఎంతగానో కృషి చేస్తోంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలూ పాటుపడుతున్నాయి. మరణించిన వ్యక్తుల అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు 2019లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అయినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరవవుతోంది. కొవిడ్‌ సమయంలో అవయవదానం మరింతగా తగ్గిపోయింది. ఎన్‌ఓటీటీఓ లెక్కల ప్రకారం, అవయవ దానం విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

ఇండియాలో ఏటా దాదాపు రెండు లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరమవుతోంది. వారిలో ఎనిమిది వందల మంది మాత్రమే సంబంధిత శస్త్రచికిత్సకు నోచుకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొరత వల్ల అక్రమ దందా జోరందుకొంటోంది. కిడ్నీ రాకెట్‌ ఉదంతాల వంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇండియాలో ప్రతి సంవత్సరం యాభై వేల మందికి పైగా గుండె మార్పిడి అవసరమవుతోంది. వారిలో 250 కన్నా తక్కువ మందికే ఆ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు భారత కార్డియాలజీ సొసైటీ చెబుతోంది. గ్యాస్ట్రోఎంటరాలజీ సొసైటీ లెక్కల ప్రకారం ఏటా యాభై వేల మందికి పైగా కాలేయ మార్పిడి అవసరమవుతోంది. కేవలం రెండు వేల మందికే సంబంధిత ఆపరేషన్లు జరుగుతున్నాయి. భారత అవయవ మార్పిడి సొసైటీ లెక్కల ప్రకారం 1971-2015 మధ్య కాలంలో దేశీయంగా 21 వేలకు పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. వాటిలో 783 ఆపరేషన్లకు మాత్రమే మరణించిన వారి నుంచి మూత్రపిండాలు సేకరించారు. దీన్నిబట్టి ప్రాణాలు కోల్పోయిన వారి నుంచి అవయవాలను సేకరించడంలో భారత్‌ ఎంత వెనకబడిందో అర్థమవుతుంది. 2013లో దేశీయంగా దాదాపు అయిదు వేల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2019 నాటికి అవి సుమారు పదమూడు వేలకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గతేడాది వెల్లడించారు. కానీ, సకాలంలో అవయవాలు అందక నిత్యం ప్రాణాలు కోల్పోతున్న వారిని      కాపాడాలంటే, ఆ సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది.

అవగాహన కీలకం
దేశీయంగా అవయవ దానం పెరగాలంటే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దానిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి. పాఠశాల స్థాయిలోనే దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. డ్రైవింగ్‌ లైసెన్సులు అందించే సమయంలోనే ప్రతి ఒక్కరూ అవయవదానానికి అంగీకరించేలా చూడాలి. ‘జీవన్‌దాన్‌’లో పేరు నమోదు చేసుకొనేలా చైతన్యవంతం చేయాలి. దేశీయంగా రోడ్డు ప్రమాదాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు జీవన్మృతులుగా మిగులుతున్నారు. అలాంటి వారి నుంచి అవయవాలను సేకరించేందుకు వారి కుటుంబ సభ్యులను ఒప్పించాలి. కేంద్ర మంత్రి మాండవీయ చెప్పినట్లు ‘జీవించి ఉన్నప్పుడు రక్తదానం... మరణించాక అవయవదానం’ ప్రతి ఒక్కరి నినాదం కావాలి. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమందికి అది కొత్త ఊపిరులు ఊదుతుంది!

- మైత్రేయ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.