Published : 14 Aug 2022 01:10 IST

చిరుతలకు కొత్త ప్రాణం

అంతరించిన జాతి పునరుద్ధరణ యత్నం

ప్రపంచంలో అత్యధిక వేగంతో పరుగెత్తగలిగే ప్రత్యేక పిల్లి జాతికి చెందిన చిరుతలు దశాబ్దాల కిందటే భారత్‌లో అంతరించిపోయాయి. వాటిని తిరిగి స్వదేశానికి తెప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 12 చిరుతలను భారత్‌కు తెచ్చి, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ ఉద్యానవనంలో విడిచిపెట్టనున్నారు. అక్కడ చిరుతల ఆహారంగా అవసరమైన లేళ్లు, దుప్పులు, నాలుగు కొమ్ముల జింకలు అధికంగా ఉన్నాయి. అందువల్ల చిరుతలకు ఆ ప్రాంతం అనువైనదని దేహ్రాదూన్‌లోని భారతీయ వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు సూచించారు. ఈనెల 15లోగా వాటిని ఆఫ్రికా దేశాల నుంచి వాయుమార్గంలో పశువైద్యుల పర్యవేక్షణలో భారత్‌కు తీసుకురానున్నారు.

చిరుతలను తీసుకురావడంవల్ల భారత్‌లో అంతరించిపోతున్న జీవజాతుల పునరుద్ధరణకు మార్గం సుగమమయ్యే అవకాశముంది. ఆఫ్రికాలోని మలావీ అనే చిన్నదేశం ఇలాంటి ప్రయత్నంలో విజయం సాధించింది. మలావీలోని లివాండ్‌ జాతీయ ఉద్యానవనంలోకి చిరుతల పునరాగమనం తరవాత అంతరించిపోయే దశలో ఉన్న రాబందుల జాతి మళ్ళీ ప్రాణం పోసుకుంది. చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర పర్యాటక, అటవీ మంత్రిత్వ శాఖ ఏడో దశకంలోనే ప్రయత్నించింది. ఇరాన్‌ నుంచి ఆసియా చిరుతలను తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పరిస్థితులు అనుకూలించలేదు. భారత్‌ చేపట్టిన ఈ ఖండాంతర చిరుతల తరలింపు ప్రయత్నం పట్ల అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (ఐయూసీఎన్‌) సైతం ఆసక్తి చూపుతోంది. చిరుతలకు సంబంధించి భారత పర్యావరణ, అటవీ శాఖామాత్యులు భూపేందర్‌ యాదవ్‌ వ్యక్తిగతంగా శ్రద్ధ కనబరిచి దక్షిణాఫ్రికా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిర్చారు. గతంలో నమీబియా ఉప ప్రధాని భారత్‌లో పర్యటించిన సమయంలో ఆ ప్రభుత్వంతోనూ చిరుతల తరలింపు ఒప్పందం కుదిరింది. దాని ఫలితంగా ఇప్పుడు అక్కడి నుంచి ఆ ప్రాణులు ఇండియాకు వస్తున్నాయి.

ఆఫ్రికా నుంచి తెస్తున్న చిరుతలను తొలుత బహిరంగంగా విడిచిపెట్టకుండా సంరక్షణ ఆవరణల్లో కొంత కాలం ఉంచాలి. అప్పుడే కొత్త పర్యావరణానికి, ఆవాసానికి అవి అలవాటు పడతాయి. వాటికి ఎలాంటి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా పశువైద్యులు కొన్నాళ్ల పాటు నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఇంజెక్షన్లు వేసే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకప్పటి సుర్‌గుజా సంస్థాన మహారాజు రామానుజ్‌ ప్రతాప్‌ సింగ్‌ దేవ్‌ 1948లో చివరి చిరుతను చంపినట్లు నమోదైంది. ఆ తరవాత ఆ జాతి అంతరించిపోయినట్లు 1952లో భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వలస పాలకులు సైతం అప్పట్లో ఈ చిరుతలను విపరీతంగా వేటాడారు. బ్రిటిష్‌ ప్రజల్లో చిరుతల సంహారం పట్ల మక్కువ ఎక్కువ. చిరుతలను వేటాడటాన్ని రాజసంగా భావించేవారు. సంహరించిన చిరుతల వద్ద ఛాయాచిత్రాలు తీసుకొని ప్రదర్శించుకొనేవారు. వారి వేట కాంక్షకు భారత్‌లోని వేలాది చిరుతలు ప్రాణాలు కోల్పోయాయి. వలస పాలన అంతమైన తరవాత చిరుత జాతి దేశంలో కనిపించకుండా పోయింది. ఆఫ్రికా నుంచి తీసుకొస్తున్న చిరుతలు భారత్‌లోని వాతావరణానికి త్వరగానే అలవాటు పడతాయని, వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని డబ్ల్యూఐఐకి చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త యాదవేంద్ర జాలా తదితరులు చెబుతున్నారు. స్థలమార్పు వాటికి పెద్దగా ఇబ్బందికరంగా ఉండకపోవచ్చునని, చిరుతలు స్వేచ్ఛగా సంచరించడానికి కూనో జాతీయ ఉద్యానవనం అనువుగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

- ఆర్‌.పి.నైల్వాల్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని