సర్కారీ కొలువుల్లో ఖాళీల మేట

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2023 నవంబర్‌ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొంటుంది. ప్రస్తుతం జనాభా పరంగా తొలి స్థానంలో ...

Published : 18 Aug 2022 01:38 IST

ఉపాధి కల్పనలో ప్రభుత్వాల వెనకంజ

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2023 నవంబర్‌ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొంటుంది. ప్రస్తుతం జనాభా పరంగా తొలి స్థానంలో ఉన్న చైనాను, మరో ఏడాదిలో భారత్‌ అధిగమించే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్‌, జర్మనీ, ఇటలీలలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్‌లో మాత్రం యువ జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. వారందరికీ సరైన ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఇండియాను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం లభిస్తుంది.

పెరిగే శ్రామిక శక్తికి అనుగుణంగా ఉపాధి మార్గాలు పెరగకపోతే నిరుద్యోగ భూతం జడలు విరబోసుకుంటుంది. దేశాభివృద్ధికి అది ఏమాత్రం మంచిది కాదు. నిరుద్యోగం కారణంగా భారత్‌లో పెళ్ళి వయసు వచ్చిన 23శాతం యువత వివాహానికి నిరాకరిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ఇండియాలో ఉన్నత విద్యా రంగంలో విద్యార్థుల నమోదు కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఏటా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకుంటున్న వారిలో అత్యధికులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. రెండేళ్ల క్రితం కేంద్ర ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం, దేశంలో 997 ఉపాధి కల్పన కేంద్రాలున్నాయి. 2008-2018 మధ్య కాలంలో ఉన్నత చదువులు చదువుకున్న 2.78 కోట్ల మంది ఉద్యోగాల కోసం వాటిలో పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో మహిళా అభ్యర్థులే 1.38 కోట్ల మంది.  ప్రపంచీకరణ వల్ల ఇటీవలి కాలంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ప్రభుత్వ కొలువుల భర్తీ కుంటువడింది. దానివల్ల ఉపాధి కల్పన కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఉద్యోగాల భర్తీ మందగించడంతో చివరికి ఆ కేంద్రాలు సైతం తమ ఉనికిని కోల్పోయాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో 60లక్షల పోస్టులు ఖాళీగా పడి ఉన్నట్లు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 9.10 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండు లక్షలు, ప్రభుత్వ పాఠశాలల్లో 8.37 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నాయి. సైన్యంలో 1.07 లక్షలు, పోలీసు శాఖలో 5.31 లక్షలు, ఆరోగ్య కేంద్రాల్లో 1.68 లక్షల కొలువులను భర్తీ చేయాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలు పెద్దయెత్తున పోగుపడ్డాయి. రాబోయే ఏడాదిన్నర కాలంలో పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. కొలువుల భర్తీ ప్రకటనలు సకాలంలో వస్తాయో లేదోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నిపథ్‌ పథకంపై నిరుద్యోగులు తీవ్ర నిరసన తెలిపారు. అయినా, ఆ పథకం కింద వాయుసేనలో పనిచేయడానికి 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో అత్యధికంగా వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఇవి 1.2 లక్షలు ఎక్కువ. నాలుగేళ్ల కొలువులే అయినా అంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారంటే, దేశీయంగా నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లో నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టాలంటే, యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఏకైక మార్గం. అందుకోసం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లను ప్రోత్సహించాలి. మరోవైపు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమానికి నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏడేళ్ల కాలంలో 26.62 లక్షల మంది స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎస్‌సీలు 16శాతం, ఎస్‌టీలు ఎనిమిది శాతం, బీసీలు 32శాతం, మైనారిటీలు తొమ్మిది శాతం, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు 36శాతం ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నిర్లక్ష్యం, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎంపికలో పారదర్శకత పాటించాలి. యువతకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పాలకులు ఉపాధి అవకాశాలను కల్పించాలి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా మేలు చేకూరుతుంది.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ (రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసోసియేట్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.