వర్షంనీరు... సముద్రంపాలు

భూమండలంపై సమస్త ప్రాణికోటికి జలమే జీవనాధారం. అలాంటి నీరు పోనుపోను తరిగిపోతోంది. భారత్‌లో ఏటా అధికమవుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెరగడంలేదు. మరోవైపు వాగులు, చెరువుల ఆక్రమణలతో జల వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని పల్లెలు విలవిల్లాడుతున్నాయి.

Published : 19 Aug 2022 00:53 IST

ఒడిసిపట్టకపోతే ఎద్దడి తప్పదు

భూమండలంపై సమస్త ప్రాణికోటికి జలమే జీవనాధారం. అలాంటి నీరు పోనుపోను తరిగిపోతోంది. భారత్‌లో ఏటా అధికమవుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెరగడంలేదు. మరోవైపు వాగులు, చెరువుల ఆక్రమణలతో జల వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని పల్లెలు విలవిల్లాడుతున్నాయి. భూ ఉపరితలంపై తాగడానికి ఉపయోగపడే మంచి నీరు మూడు శాతమే ఉంది. అందులోనూ ఒకశాతం మంచు రూపంలో ఘనీభవించింది. భారత్‌లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి సవాలు విసురుతోంది. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం నీటి కొరతను ఎదుర్కొనే రాష్ట్రాల్లో హరియాణా, రాజస్థాన్‌, తమిళనాడు, పంజాబ్‌ ముందు వరసలో ఉన్నాయి. గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటిచోట్లా నీటి ఎద్దడి అధికమవుతోంది. దేశంలో 30 నగరాలు నీటి సమస్యతో అల్లాడుతున్నాయి. వాటిలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులు సైతం కనిపిస్తాయి. ప్రతి బొట్టునూ ఒడిసి పట్టి, వృథాకు చరమగీతం పాడితేనే నీటి సమస్యను అధిగమించడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

భూతాప ప్రభావం

భారత్‌లో ఏటా సగటున 1000-1200 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఆ నీటిలో 40శాతం వృథాగా సముద్రంలో కలుస్తోంది. మిగిలిన జలంలో ఆవిరి, తేమ రూపంలో పోగా కేవలం 10శాతమే భూమిలోకి ఇంకుతోంది. దేశవ్యాప్తంగా గత పదేళ్లుగా భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. నీటి వనరుల్లో సైతం క్షీణత కనిపిస్తోంది. భారత్‌లో వార్షిక తలసరి నీటి లభ్యత 2011లో 1545 చదరపు మీటర్లు. నీటి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల అది 2025 నాటికి 1350 చదరపు మీటర్లకు పడిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో భూగర్భ జలాన్ని భారత్‌ అధికంగా వినియోగిస్తోంది. ఏటా 25 వేల కోట్ల ఘనపు మీటర్లకుపైగా భూగర్భ జలాన్ని ఇండియా తోడేస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న నీటిలో 64శాతానికి పైగా వ్యవసాయానికి వాడుతున్నాం. మరోవైపు మారుతున్న వాతావరణ పరిస్థితుల  కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40శాతం జనాభాకు నీటి కొరత ఎదురు కానుందని జర్మనీకి చెందిన అంతర్జాతీయ వాతావరణ సంస్థ గతంలోనే వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం వల్ల నీటి లభ్యత తగ్గుతుందని స్పష్టం చేసింది. నీటి సంరక్షణలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో అమృత్‌ సరోవర్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కనీసం 75 జల వనరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దెబ్బతిన్న తటాకాలకు మరమ్మతులు జరిపించి, వాటిని వినియోగంలోకి తేవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 2023 ఆగస్టు 15 నాటికి భారత్‌లో కనీసం యాభై వేల నీటి వనరులను తయారు చేయాలని లక్షించారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా చెరువులను అభివృద్ధి, మరమ్మతుల కోసం గుర్తించారు. అయిదు వేలకు పైగా చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. వాటికోసం ఉపాధి హామీ నిధులను కేటాయిస్తున్నారు. జల వనరుల అభివృద్ధి భావి తరాలకు గొప్ప వరంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా చెరువుల అభివృద్ధి చేపట్టింది. నీటి వనరుల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో పరిశోధనలు జరిపిస్తోంది. నదుల అభివృద్ధి, పరిశోధన, వాటిపై అవగాహన కోసం కరపత్రాల ముద్రణ వంటి కార్యక్రమాలకు మూడేళ్లుగా కేంద్ర సర్కారు ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తోంది.  

చైతన్యం అవసరం

వర్షం ద్వారా లభిస్తున్న నీటిలో నిల్వ చేసుకుంటున్న దానికన్నా వృథా అవుతున్నదే ఎక్కువగా ఉంటోంది. రాబోయే రోజుల్లో నీటి కొరత ముమ్మరించనున్న నేపథ్యంలో నీటి పొదుపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సమర్థ నీటి నిర్వహణకు కావాల్సిన నిధులను సమకూర్చాలి. జల సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. బిందు సేద్యం ద్వారా వ్యవసాయంలో ఉపయోగించే నీటిలో 40-50శాతం పొదుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల బిందు, తుంపర సేద్యాలను విరివిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జల వనరులను చదును చేసి వాటిని ఆక్రమించడం, నీటి ప్రవాహాల దిశను మళ్ళించడం వంటి వాటిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. నగరాల్లో, పట్టణాల్లో పైపులైన్ల లీకేజీలను అరికట్టడమూ తప్పనిసరి. జపాన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నీటి ప్రాధాన్యం, దాని పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యర్థజలాన్ని ఇంట్లోనే పునర్వినియోగిస్తున్నారు. భారత్‌లో సైతం ఇలాంటి పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంది. నీటి పొదుపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి, ఆచరించాలి. తద్వారా ముమ్మరిస్తున్న నీటి సంక్షోభాన్ని నిలువరించడానికి అవకాశం లభిస్తుంది.

- వై. బసవ సురేంద్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.