ఎగుమతుల్లో వెనకంజ

ప్రపంచవ్యాప్తంగా ఉద్యాన పంటల ఉత్పత్తిలో చైనా తరవాత రెండో స్థానం ఇండియాదే. 2021-22లో దేశీయంగా ఉద్యాన పంటల ఉత్పత్తులు 34.16 కోట్ల టన్నుల మేర ఉండవచ్చునని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 70 లక్షల టన్నులు (2.10 శాతం) అధికం...

Published : 19 Aug 2022 00:53 IST

ఉద్యాన సాగులో కొరవడిన ఆధునికత

ప్రపంచవ్యాప్తంగా ఉద్యాన పంటల ఉత్పత్తిలో చైనా తరవాత రెండో స్థానం ఇండియాదే. 2021-22లో దేశీయంగా ఉద్యాన పంటల ఉత్పత్తులు 34.16 కోట్ల టన్నుల మేర ఉండవచ్చునని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 70 లక్షల టన్నులు (2.10 శాతం) అధికం. పండ్లు, కూరగాయలు, తేనె ఉత్పత్తుల పెరుగుదల వల్ల వృద్ధి నెలకొంటుంది. అదే సమయంలో సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధ మొక్కల ఉత్పత్తి తగ్గుతుందని కేంద్రం తెలిపింది. ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తికి సంబంధించి వ్యవసాయ మంత్రిత్వశాఖ ఇటీవల రెండో ముందస్తు అంచనాలను వెలువరించింది. దేశీయంగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.77 కోట్ల హెక్టార్లకు చేరినట్లు వెల్లడించింది. 2020-21లో 10.24 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యాయి. 2021-22లో అది 10.71 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. అదే సమయంలో కూరగాయల ఉత్పత్తి 20 కోట్ల టన్నుల నుంచి 20.4 కోట్ల టన్నులకు, ఉల్లిపాయల ఉత్పత్తి 2.66 కోట్ల టన్నుల నుంచి 3.17 కోట్ల టన్నులకు చేరుతుందని వివరించింది. బంగాళాదుంపలు, టమేటాల ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. మొత్తంగా భారత్‌లో ఉద్యాన పంటల ఉత్పత్తుల్లో ఏటా వృద్ధి నమోదవుతూనే ఉంది. దేశ వ్యవసాయ జీడీపీలో ఉద్యాన రంగం 30శాతం వాటా కలిగి ఉంది.
ఇండియా ఉద్యాన పంటల ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయినా ప్రపంచంలో ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇండియా వాటా రెండుశాతం కంటే తక్కువే. భారత్‌లో ఎన్నో రకాల ఉద్యాన పంటలను ఉత్పత్తి చేస్తున్నా, కొన్నింటినే ఎగుమతి చేస్తున్నాం. ఉద్యాన పంటల శుద్ధి, నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగాల సృష్టి, ఆహార పరిశ్రమలకు ముడిపదార్థాలను అందించడం ద్వారా ఉద్యాన పంటలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. ఈ ఉత్పత్తులు పోషకాలు, ఖనిజాలను కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మామిడి, అరటి, జామ వంటి పండ్ల సాగులో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వాలు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటే ఇండియా అతిపెద్ద ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతిదారుగా మారే అవకాశం ఉంది. ఈ రంగం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. ఉద్యాన పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌తోపాటు పరిశోధన, కన్సల్టెన్సీ, రవాణా, ప్యాకేజింగ్‌ తదితర విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. తోటల పెంపకం వల్ల నేల కోతను అరికట్టవచ్చు. వరదల నియంత్రణకూ అవి తోడ్పడతాయి. పర్యావరణ పరిరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇండియాలో ఏటేటా పెరుగుతున్నాయి. అదే సమయంలో రైతులను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ధరల్లో స్థిరత్వం లేకపోవడం అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, పూలు తదితర ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ సదుపాయాలు లేవు. పంట సీజన్‌లో ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల తెలుగు     రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టమేటాలను కొనేవారు లేక రైతులు వాటిని రహదారుల పక్కన పారబోశారు. ఇలాంటి సందర్భాలను ఏటా చూస్తూనే ఉన్నాం. తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలూ ఉద్యాన పంటల రైతులను కుంగదీస్తున్నాయి. యాంత్రీకరణలో వెనకబాటు, కూలి రేట్లు, రసాయన, పురుగుమందుల ధరలు పెరగడం వల్ల పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యాన పంటల శుద్ధి పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. వాటిని ఇతోధికంగా ఏర్పాటు చేయాలి. ఉద్యాన పంటల ఉత్పత్తుల నుంచి పలు రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆయా ఉత్పత్తుల నిల్వకు గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాల్సిన అవసరమూ ఉంది. ఆ పంటలకు మద్దతు ధరలను ప్రకటించి అమలయ్యేలా చూడటం తప్పనిసరి. ఎన్నో సానుకూలాంశాలు ఉన్న ఉద్యాన పంటల సాగును, ఆ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తే రైతుల ఆదాయాలు   పెరగడంతోపాటు, దేశార్థికానికీ ఎంతో మేలు జరుగుతుంది.

- డి.ఎస్‌.బాబు

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని