రహస్య పత్రాల రగడ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం నుంచి ఆ దేశ నేర పరిశోధక సంస్థ (ఎఫ్‌బీఐ) అధికారులు ఇటీవల 300 అధికార పత్రాలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. గూఢచర్య చట్టంతోపాటు అనేక ఇతర చట్టాలను ట్రంప్‌ ఉల్లంఘించి ఉండవచ్చనే అనుమానంతో

Published : 01 Sep 2022 03:06 IST

మరో వివాదంలో ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం నుంచి ఆ దేశ నేర పరిశోధక సంస్థ (ఎఫ్‌బీఐ) అధికారులు ఇటీవల 300 అధికార పత్రాలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. గూఢచర్య చట్టంతోపాటు అనేక ఇతర చట్టాలను ట్రంప్‌ ఉల్లంఘించి ఉండవచ్చనే అనుమానంతో ఒక ఫెడరల్‌ జడ్జి వారంట్‌ జారీ చేశారు. దాని ఆధారంగా ఎఫ్‌బీఐ ఆ పత్రాలను స్వాధీనం చేసుకుంది. పదవి నుంచి దిగిపోతున్న సమయంలో అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌హౌస్‌) నుంచి ట్రంప్‌ పలు రహస్య పత్రాలను తన ఇంటికి తీసుకెళ్ళారు. ఫ్లోరిడాలో ట్రంప్‌ ఎస్టేట్‌ మారె లాగో నుంచి ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో 150- జాతీయ అభిలేఖాగారానికి (నేషనల్‌ ఆర్కైవ్స్‌కు) చెందినవి ఉన్నాయి. ఆ పత్రాలు రహస్యమేమీ కాదని ట్రంప్‌ వాదిస్తున్నారు. వైట్‌హౌస్‌ పత్రాలపై యాజమాన్య, కస్టడీ హక్కులు పదవి నుంచి దిగిపోతున్న అధ్యక్షుడికి ఉండవు. అవి నేషనల్‌ ఆర్కైవ్స్‌కు మాత్రమే దఖలుపడ్డాయి. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) 1978లో అధ్యక్ష రికార్డుల చట్టాన్ని ఆమోదించింది. 1974లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి రిచర్డ్‌ నిక్సన్‌ వైదొలగడానికి కారణమైన వాటర్‌ గేట్‌ కుంభకోణాన్ని పురస్కరించుకొని ఈ చట్టం తెచ్చారు. దాని ప్రకారం వైట్‌హౌస్‌ నుంచి రహస్య లేదా సాధారణ పత్రాలను అనధికారికంగా బయటకు తీసుకెళ్ళడం చట్టవిరుద్ధం.

జాతీయ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వైట్‌హౌస్‌ అధికారులు, మంత్రుల స్థాయి నాయకులు గతంలో చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు. 1996లో అమెరికా గూఢచార శాఖ (సీఐఏ) సంచాలకులు జాన్‌ డోయిచ్‌ తన సొంత కంప్యూటర్లో రహస్య పత్రాలను భద్రపరచినట్లు బయటపడటంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జాన్‌పై చట్టపరంగా చర్య తీసుకునేలోపే నాటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ క్షమాభిక్ష ప్రకటించారు. 2005లో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శాండీ బెర్జర్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌ నుంచి రహస్య పత్రాలను బయటకు తీసుకెళ్ళినందుకు యాభై వేల డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. జాతీయ భద్రతకు కీలకమైన పత్రాలను ప్రేయసిగా మారిన తన జీవిత కథా రచయిత్రికి చూపించినందుకు సీఐఏ మాజీ సంచాలకులు డేవిడ్‌ పెట్రేయస్‌ నలభై వేల డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. విదేశాల్లోని అమెరికా గూఢచారుల వివరాలు, తాము చేపట్టిన రహస్య కార్యకలాపాలను తన ప్రేయసికి పెట్రేయస్‌ గొప్పగా చెప్పుకొన్నారు. ఆ వ్యవహారాన్ని కోర్టుకు లాగితే అమెరికా గూఢచర్య రహస్యాలు ప్రపంచానికి బహిర్గతమవుతాయనే భయంతో అమెరికా న్యాయశాఖ పెట్రేయస్‌ను జరిమానాతో వదిలేయక తప్పలేదు. ప్రస్తుతం డొనాల్డ్‌ ట్రంప్‌నూ అలాగే విడిచిపెడతారనే అభిప్రాయం వినిపిస్తోంది. 

గొప్పలు చెప్పుకోవడంలో ట్రంప్‌ను మించినవారు లేరు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను పదవి నుంచి దించడానికి తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇస్తున్నామని 2017లో ఆయన ట్వీట్‌ చేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌కు సంబంధించిన సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రికి వెల్లడించారని, ఎంతో గోప్యంగా ఉంచాల్సిన ఉపగ్రహ చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనకు గూఢచర్య నివేదికలను సమర్పించకూడదని అధ్యక్షుడు జో బైడెన్‌ రెండేళ్ల క్రితమే ఆదేశించారు. అధ్యక్షుడితోపాటు మాజీ అధ్యక్షులకూ గూఢచర్య నివేదికలను అందించడం అమెరికాలో ఆనవాయితీ. 

వైట్‌హౌస్‌ నుంచి తీసుకెళ్ళిన రహస్య పత్రాలతో ఏమి చేయదలచారన్నది కోర్టుకు ట్రంప్‌ చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానాల ఆధారంగా ఎలాంటి అభియోగాలను నమోదు చేయాలన్నది ఎఫ్‌బీఐ నిర్ణయిస్తుంది. డోయిచ్‌, పెట్రేయస్‌ల మాదిరిగా తప్పును అంగీకరించి, జరిమానా కట్టి ట్రంప్‌ బయటపడే అవకాశం ఉంది. గతంలో విశ్వవిద్యాలయం నడుపుతానంటూ మోసగించారని ఆరోపణ వచ్చినప్పుడు బాధితులకు 2.5 కోట్ల డాలర్ల పరిహారమిచ్చి ట్రంప్‌ బయటపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మళ్ళీ పోటీ చేస్తానంటున్నారు. రహస్య పత్రాల కేసులో ఒకవేళ శిక్ష పడినా ఆయన్ను పోటీ చేయకుండా నివారించడం కుదరదు. ఎందుకంటే, అమెరికా అధ్యక్షుడికి కావాల్సిన అర్హతలను రాజ్యాంగమే తప్ప చట్టాలు నిర్దేశించవు. రహస్య పత్రాల కేసు నుంచి ట్రంప్‌ బయటపడినా 2021 జనవరి నాటి అమెరికా పార్లమెంటు భవనంపై దాడి కేసు నుంచి ఆయన తప్పించుకోలేరని న్యాయ నిపుణులు అంటున్నారు. ట్రంప్‌ ఆ దాడికి తన మద్దతుదారులను ప్రేరేపించారని రుజువైతే అది దేశద్రోహమవుతుంది. అప్పుడు ఆయనకు శిక్ష పడటం తథ్యమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

- కైజర్‌ అడపా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.