ప్రాణాలను మింగేస్తున్న నాసిరకం రోడ్లు

ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇలాంటి దుర్ఘటనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కార్లలో వెనక సీట్లలో కూర్చునేవారు సైతం సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం ప్రస్ఫుటంచేసింది.

Published : 24 Sep 2022 01:56 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇలాంటి దుర్ఘటనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కార్లలో వెనక సీట్లలో కూర్చునేవారు సైతం సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం ప్రస్ఫుటంచేసింది. రోడ్ల నిర్మాణం, డిజైన్లలో లోపాలు, నాసిరకం నిర్వహణ సైతం తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి.

భారత్‌లో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2021లో నాలుగు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో లక్షన్నర మందికిపైగా మరణించారు. సుమారు 3.71 లక్షల మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు ఏడాదికన్నా నిరుడు అధిక సంఖ్యలో దుర్ఘటనలు నమోదయ్యాయి. రహదారుల నిర్మాణం, డిజైన్లు, నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉండటం, నిబంధనలను ఉల్లంఘించడం, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. నిరుడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగానికిపైగా అతివేగమే కారణం.

వాహనాల్లో అవసరమైన మేర సమర్థఎయిర్‌ బ్యాగులను అమర్చడం, ప్రయాణికులు విధిగా సీటు బెల్టులు అమర్చుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ప్రమాదాల తీవ్రతను, తద్వారా మరణాల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. ఎయిర్‌ బ్యాగులు ఉంటే 63శాతం, సీటుబెల్టులను వాడితే 72శాతం మరణాలను నివారించవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఇకపై దేశంలో తయారయ్యే ప్రతి కారుకు ఆరు ఎయిర్‌ బ్యాగులతో కూడిన సీట్లు ఉండాలని ఉత్తర్వులు జారీ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ముందు సీట్లలో కూర్చునేవారికే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం ఎక్కువని, వెనక సీట్లు సురక్షితంగా ఉంటాయనేది చాలామంది నమ్మకం. వెనక సీట్లలో కూర్చునేవారికే ప్రాణాపాయం అధికమని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారత్‌లో నడిచే వాహనాల సంఖ్య మొత్తం ప్రపంచ వాహనాల్లో కేవలం ఒక శాతమే. దేశీయంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలు మొత్తం ప్రపంచ రోడ్డు ప్రమాదాల్లో 11శాతాన్ని ఆక్రమిస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉన్నట్లు పేరున్నా- రోడ్ల నిర్మాణాలు, డిజైన్లన్నీ లోపభూయిష్ఠమనే ఆరోపణలున్నాయి. రోడ్ల నిర్వహణ సైతం నాసిరకమనే పేరుంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభించడానికి ముందు భారత్‌లో ప్రతి నాలుగు నిమిషాలకు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మరణించారని ప్రపంచబ్యాంకు పేర్కొంది. సీటుబెల్టు ధరించకపోతే కారులో మోగే అలారాన్ని నిలువరించేందుకు ఆన్‌లైన్‌ సంస్థల్లో లభ్యమయ్యే మెటల్‌ క్లిప్పులు కొని వాడుతున్నారని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. వాటి అమ్మకాలను నిలిపివేయాలంటూ కేంద్రం సూచించింది.

రహదారి ప్రమాదాలతో వాటిల్లే అనర్థాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. వాహన చోదకుల్లో ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, చిన్న పొరపాటు, తొందరపాటు నిర్ణయంతో వాహనాన్ని నడిపినా, రెండో వాహనంలోని చోదకుడు, ప్రయాణికులు నష్టపోవాల్సి ఉంటుంది. ఎలాంటి తప్పు లేకపోయినా, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అగత్యం చోటుచేసుకుంటుంది. చిన్నచిన్న పొరపాట్లు, భావోద్వేగాల నియంత్రణ కరవైన స్థితిలో నిత్యం రోడ్లపై చోటుచేసుకుంటున్న ప్రమాదాల కారణంగా అనేకమంది మరణిస్తున్నారు. మరెంతోమంది శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. మరికొంతమంది సంవత్సరాల తరబడి మంచాలకే పరిమితం అవుతున్నారు. కుటుంబాల్లో ఇవి తీవ్ర విషాదం నింపుతున్నాయి. సాఫీగా, సంతోషంగా సాగాల్సిన జీవితాలు రోడ్లపై నిర్లక్ష్యం కారణంగా తారుమారవుతుండటం బాధాకరం. పోలీసు యంత్రాంగం ప్రతి కారునూ ఆపి లోపల కూర్చున్న వ్యక్తులు సీటుబెల్టులు పెట్టుకున్నారా, లేదా అనేది పరీక్షించడం సాధ్యమయ్యే పనికాదు. ప్రయాణికులే విధిగా స్వీయరక్షణ చర్యలు పాటించాలి. అందరూ ప్రాణాల విలువను గుర్తుంచుకొని, కుటుంబ సభ్యులూ, ఆత్మీయుల కోసం రహదారి ప్రయాణాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

- ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు

(విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.