వికృతక్రీడా భారతం!

ఎంతటి మూర్ఖులైనా సరే, మరుగుదొడ్డిలో ఎవరికైనా భోజనం పెడతారా? మలమూత్రాదులను విసర్జించే చోట- ఆ రొచ్చు గచ్చు మీద ఒక కాగితం పరిచి, దానిపై ఆహార పదార్థాలు పెట్టి తినమంటారా? చదువుతుంటేనే కడుపులో దేవేసినట్లు లేదూ! నిజంగానే అలా చేస్తే- వాళ్లనసలు

Published : 25 Sep 2022 00:52 IST

ఎంతటి మూర్ఖులైనా సరే, మరుగుదొడ్డిలో ఎవరికైనా భోజనం పెడతారా? మలమూత్రాదులను విసర్జించే చోట- ఆ రొచ్చు గచ్చు మీద ఒక కాగితం పరిచి, దానిపై ఆహార పదార్థాలు పెట్టి తినమంటారా? చదువుతుంటేనే కడుపులో దేవేసినట్లు లేదూ! నిజంగానే అలా చేస్తే- వాళ్లనసలు మనుషులంటారా? దేశం ఏం పాపం చేసుకుందో కానీ, అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారతావనిలోనే అటువంటి అనాగరిక ప్రబుద్ధులు పోగుపడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహరాన్‌పుర్‌లో పదిహేడేళ్ల లోపు అమ్మాయిలకు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. వాటికి హాజరైన క్రీడాకారిణుల కోసం స్టేడియంలోని ఈతకొలను దగ్గర వంటలు చేయించారు. ఎక్కడా స్థలం లేదన్నట్లు- వండిన అన్నం, కూరలు, పూరీలను నిర్వాహకులు పట్టుకెళ్ళి మరుగుదొడ్డిలో ఉంచారు. ఆకలి తీర్చుకొనేందుకు పాపం ఆ ఆడపిల్లలు వాటినే తమ పళ్లాలలో వడ్డించుకోవాల్సి వచ్చింది. గుండెలు రగిలిపోయే ఆ మరుగుదొడ్డి భోజనశాల దృశ్యాలు కొద్దిరోజుల క్రితం వెలుగుచూశాయి. వర్ధమాన క్రీడాకారుల ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్న దారుణ దుర్విచక్షణల తీవ్రతను అవి మరోసారి కళ్లకు కట్టాయి. శుష్క ప్రసంగాలూ శూన్య హస్తాలతో దేశీయంగా ప్రభుత్వాలు ఆటలను ఎంత ‘పరమాద్భుతం’గా ప్రోత్సహిస్తున్నాయో ఆ దృశ్యాలు చాటిచెప్పాయి!

టాయిలెట్లో తిండి పెట్టడమేమిటని అందరూ పడతిట్టిపోయడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ సర్కారు స్పందించింది. స్థానిక క్రీడాధికారిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ‘పోటీల గురించి ఆ అధికారి మాటమాత్రంగానైనా మాకు చెప్పలేదు... ముందే తెలిస్తే, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేసేవాళ్లం’ అని సహరాన్‌పుర్‌ జిల్లా కలెక్టర్‌ అఖిలేశ్‌ సింగ్‌ నమ్మబలుకుతున్నారు. జిల్లా యంత్రాంగానికి తెలియకుండా రాష్ట్రస్థాయి టోర్నీ ఆరంభమవుతుందా ఎక్కడైనా? ఘనత వహించిన ఆ క్రీడాధికారి అనిమేష్‌ సక్సేనా ఏమో- మరుగుదొడ్డిలో భోజనం పెట్టామన్నది వట్టి ఆధారరహిత ఆరోపణగా తేల్చేశారు. తమ నిర్వాకమేమిటో వీడియోలో స్పష్టంగా కనపడుతున్నా అడ్డుగోలు మాటలతో దాన్ని కొట్టిపడేశారు. ‘స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి, వాన కూడా పడుతోందప్పుడు... అందుకే స్థలాభావంతో బట్టలు మార్చుకునే గదిలో ఆహార పదార్థాలను ఉంచాం’ అని సక్సేనా సాబ్‌ సెలవిచ్చారు. సిగ్గెందుకు లేదురా జగ్గా! అంటే- అన్నీ వదిలేసినవాణ్ని నాకేమి సిగ్గన్నాడట వెనకటికి ఒక మహానుభావుడు. నీతి నిజాయతీలనే కాదు, కనీస మానవతా విలువలను సైతం విడిచిపెట్టేసి నిర్లజ్జగా విధులు నిర్వర్తించే సర్కారీ సిబ్బందికి దేశీయంగా లోటేమీ లేదని సహరాన్‌పుర్‌ అధికారులు నిరూపించారు. ఒలింపిక్‌ పతక విజేత, రెజ్లింగ్‌ ఛాంపియన్‌ యోగీశ్వర్‌దత్‌ వ్యాఖ్యానించినట్లు- భారతీయ క్రీడాకారులకు మళ్ళీ మళ్ళీ అవమానాలే బహుమానాలవుతున్నా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకునే వారే కొరవడుతున్నారు.

స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు నాగ్‌పుర్‌కు చెందిన పారా అథ్లెట్‌ కాంచన్‌మాలా పాండే అయిదేళ్ల క్రితం చాలా శ్రమించి జర్మనీలోని బెర్లిన్‌ నగరానికి వెళ్ళారు. జాతీయ క్రీడాప్రాధికార సంస్థ (శాయ్‌) నుంచి దేశీయ పారాలింపిక్‌ కమిటీకి అందాల్సిన స్పాన్సర్‌షిప్‌ సొమ్ము అప్పటికి రాలేద]ు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులకోసం బెర్లిన్‌ వీధుల్లో కాంచన్‌ భిక్షమెత్తుకోవాల్సి వచ్చింది. అభినవ్‌ బింద్రా, మహేశ్‌ భూపతి వంటి ప్రముఖ ఆటగాళ్లు దానిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘క్రీడలు, క్రీడాపాలన పట్ల మన దృష్టికోణం మారాలి... ప్రస్తుత వ్యవస్థ సిగ్గుమాలినది’ అని టెన్నిస్‌ ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఆనాడు ఆగ్రహం వెలిబుచ్చారు. అవన్నీ అరణ్యరోదనలే అయినట్లు సహరాన్‌పుర్‌ ఉదంతం వెల్లడిస్తోంది. క్రీడాకారులను ‘ఐక్య, శ్రేష్ఠ భారతావని పతాకధారులు’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. కానీ, క్షేత్రస్థాయిలో వారిని అలా గుర్తిస్తున్న వారెవరు? జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వివిధ ఆటల్లో రాణించిన క్రీడాకారులెందరో నేడు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. సెక్యూరిటీ గార్డులు, ఇటుకబట్టీ కార్మికులు, దినసరి కూలీలు, కూరగాయలూ చిరుతిళ్ల విక్రేతలుగా పేదరికంలో అల్లాడుతున్నారు. కష్టాల కొలిమిలో రాటుతేలి, కుటుంబ సభ్యులూ కోచ్‌ల మద్దతుతో ఏ కొందరు ఆటగాళ్లో విశ్వవేదికలపై విజయాలు సాధిస్తున్నారు. వాళ్లను సత్కరించడానికి పోటీలుపడే ప్రభుత్వాలు- తీరైన మౌలిక సదుపాయాలు, నిధులతో మొగ్గదశ నుంచే క్రీడాకారులను సానపట్టడంపై మాత్రం ఏళ్ల తరబడి సవతితల్లి ప్రేమనే కనబరుస్తున్నాయి. దేశీయ జనాభాకు తగినట్లుగా ఒలింపిక్స్‌ వంటి పోటీల్లో ఇండియా రాణించలేకపోవడానికి కారణాలేమిటో పాలకులు అన్వేషించడం లేదు. సరైన విధానాలూ అనుసరించడం లేదు. కానీ, తమ దార్శనికత వల్లే క్రీడాభారతం నేడు దివ్యంగా వెలిగిపోతోందని వాళ్లు గప్పాలు కొట్టుకుంటున్నారు. అది విచిత్రమే కాదు, విస్మయకరం కూడా!

దేశంలో ఆటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ తలసరి వ్యయం- రోజుకు మూడు పైసలకు మించి లేదని క్రీడాశాఖ మంత్రిగా రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ లోగడ పార్లమెంటులో స్పష్టీకరించారు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలూ అరకొరగానే విదిలిస్తున్నాయి. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాలు క్రీడలకు ఇతోధిక కేటాయింపులు చేస్తున్నాయి. ఆ నిధులన్నీ సద్వినియోగమయ్యేలా చక్కటి వ్యవస్థలను అవి తీర్చిదిద్దుకొన్నాయి. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి ఆటలే ఆలంబనలవుతాయి. కానీ, మన దగ్గరేమో ప్రతి దానికీ క్షామమే. బడుల్లో మైదానాలు, క్రీడా పాఠశాలల్లో కనీస వసతులు... ఏవీ పక్కాగా లేని దుర్భరావస్థ- రాష్ట్రాలకు అతీతంగా అన్ని చోట్లా  తాండవిస్తోంది. దానికితోడు క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు ఒడిగడుతున్న గురురూప కీచకుల దుశ్చేష్టలు నివ్వెరపరుస్తున్నాయి. ఒక్క ‘శాయ్‌’కు సంబంధించే అటువంటివి నలభై వికృతక్రీడలు నమోదయ్యాయి. ఆ దుష్టసంస్కృతికి చరమగీతం పాడకపోతే- దేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించాలన్న నవతరం అమ్మాయిల ఆశలు కరిగిపోతాయి.
అవినీతి, బంధుప్రీతి, ఎంపికల్లో అక్రమాలు, పారదర్శకత లేని, క్రీడాపాలనలో అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోకపోవడం వంటివే దేశంలో ఆటలకు తీవ్ర ప్రతిబంధకాలవుతున్నాయని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు, వ్యాపారుల పట్టులోంచి క్రీడా సంఘాలు బయటపడితేనే- భారత్‌ నుంచి ఒలింపిక్‌ విజేతలు ఎక్కువగా ఆవిర్భవించగలుగుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. పొట్టకోస్తే ఆటల గురించి అక్షరం ముక్క రాకపోయినా అర్థ అంగబలాలతో సంఘాల్లో తిష్ఠవేస్తున్న బడాబాబులు- తమ దుర్రాజకీయాలతో వాటిని భ్రష్టుపట్టిస్తున్నారు. ఒలింపిక్‌ పోడియంపై మువ్వన్నెల పతాకం మరింతగా రెపరెపలాడాలంటే- పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రోదిచేయడం మొదలు క్రీడా సంఘాల ప్రక్షాళన వరకు అన్నీ సాకారం కావాలి.  కానీ, మాటలతో నింగిని నేలకు దించే వారే తప్ప చేతలతో ఇంటిని బాగుచేసే నేతలే అరుదైపోయిన వాతావరణంలో- అది సులభసాధ్యమైతే కాదు!

- శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.