పోషణ భాగ్యానికి సవాళ్లెన్నో...

దేశ భవిష్యత్తు నిర్దేశకులైన బాలలను దృఢంగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం పాలకుల కర్తవ్యం. అందుకోసం భారత్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం బడుల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 26 Sep 2022 00:58 IST

దేశ భవిష్యత్తు నిర్దేశకులైన బాలలను దృఢంగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం పాలకుల కర్తవ్యం. అందుకోసం భారత్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం బడుల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమలులో లోపాలు మధ్యాహ్న భోజన పథకానికి శాపాలుగా మారుతున్నాయి.

పేద వర్గాలకు చెందిన పిల్లలు సరైన పౌష్టికాహారం కొరవడి శారరీక, మానసిక ఎదుగుదలతో వెనకబడే ప్రమాదం ఉంది. చదువుపైనా అది ప్రభావం చూపి వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు దీన్ని అందిస్తున్నారు. ప్రాథమిక స్థాయి పిల్లలకు ఉదయంపూట అల్పాహార పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఇటీవల ప్రారంభించారు. దేశీయంగా అయిదేళ్లలోపు పిల్లల్లో 36శాతం ఎదుగుదలలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 32శాతం  వయసుకు తగిన బరువు లేరని తేల్చి చెప్పింది. దేశీయంగా సెప్టెంబరును పోషణ మాసంగా నిర్వహిస్తున్నాం. ఈ తరుణంలో తమిళనాడు అల్పాహార కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలనూ పరిష్కరించాలి.

నాసిరకం భోజనం

స్వాతంత్య్రం తరవాత బడి పిల్లల కోసం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని 1960ల్లో తమిళనాడులో కె.కామరాజ్‌ సర్కారు ప్రారంభించింది. అనంతరం మరికొన్ని రాష్ట్రాలు ఆ పథకాన్ని అమలు చేశాయి. 1995లో కేంద్రం పిల్లల కోసం పోషకాహార కార్యక్రమాన్ని తెచ్చింది. తరవాత దాని పేరును మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. దాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు గతేడాది ‘ప్రధాన మంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ పథకం (పీఎం పోషణ్‌)’ తెచ్చారు. పూర్వ ప్రాథమిక దశలోని విద్యార్థులనూ అందులో చేర్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయిదేళ్ల కాలానికి దానికోసం రూ.1.30 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నాయి. 11.20 లక్షల బడుల్లో చదివే కోట్లాది విద్యార్థులు ఆ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు వారిలో పోషణ స్థాయులను సైతం పర్యవేక్షించాలన్నది పథకం లక్ష్యం. రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాల్లో విద్యార్థులకు వేరుసెనగ, సోయా చిక్కీ, అరటిపళ్లు, తృణధాన్యాల లడ్డూ, సూప్‌, గుడ్డు వంటి అదనపు పౌష్టికాహారాన్ని అందించాలని పీఎం పోషణ్‌లో నిర్దేశించారు. కొన్ని రాష్ట్రాలు సొంత ఖర్చుతో పిల్లలందరికీ వాటిని సమకూర్చాలని నిర్ణయించాయి. అయితే, మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటున్నట్లు నిత్యం చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీళ్ల సాంబారు, రుచీపచీ లేని కూరలు, మాడిపోయిన, సరిగ్గా ఉడకని అన్నం, పాడైపోయిన గుడ్లు పెట్టడం వంటి కారణాలతో చాలామంది పిల్లలు ఆ భోజనాన్ని తినకుండా పడేస్తున్నారు.   

ఏజెన్సీలకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మధ్యాహ్న భోజనంలో నిర్ణీత పదార్థాల జాబితా చాలాచోట్ల సరిగ్గా అమలు కావడంలేదు. పీఎం పోషణ్‌ కింద ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.1.83 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు తక్కువ వేతనాల కారణంగా వంట చేయడానికి నిర్వాహకులెవరూ ముందుకు రావడంలేదు. కుల దుర్విచక్షణ సైతం మరో ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆకాశానికి ఎగబాకుతున్న ధరలతో పోలిస్తే ఒక్కో విద్యార్థి భోజనం కోసం చేస్తున్న కేటాయింపులు చాలా తక్కువన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం నిధులు పక్కదారి పడుతున్న వైనాన్నీ గతంలో కాగ్‌ నివేదిక వేలెత్తి చూపింది.

అనారోగ్యంతో సతమతం

మధ్యాహ్న భోజనం వల్ల 2006-16 మధ్య కాలంలో పిల్లల్లో    13-32శాతం ఎదుగుదల లోపాలు తగ్గినట్లు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం, ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థకు చెందిన పోషకాహార నిపుణులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో తేలింది. దీన్నిబట్టి పటిష్ఠమైన బాలభారతం నిర్మాణంలో మధ్యాహ్న భోజనం ప్రాధాన్యాన్ని పాలకులు గుర్తించాలి. అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 6-59 నెలల పిల్లల్లో 57శాతం రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతకు ముందు సర్వేతో పోలిస్తే ఇది ఏడు శాతం అధికం. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులు మేఘాలయ, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌లలో జాతీయ సగటు 36శాతం కన్నా అధికంగా ఉన్నారు. తెలంగాణలో 33శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 31శాతం, తమిళనాడులో 25శాతం చిన్నారులు గిడసబారిపోయారు. కొవిడ్‌ శరాఘాతాలు, ద్రవ్యోల్బణం పేదవర్గాలను కుదిపేస్తున్నాయి. వారి పోషకాహార వినియోగంపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఈ తరుణంలో బాలలను బలమైన పౌరులుగా తీర్చిదిద్దాలంటే సమధిక నిధులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వాలు మెరుగ్గా అమలు చేయాలి. బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ భోజనం మెనూ సరిగ్గా అమలయ్యేలా చూడాలి. వీలునుబట్టి ఉదయం అల్పాహారాన్ని అందించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేయాలి.

- ఎం.అక్షర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.