పెచ్చరిల్లుతున్న అసమానతలు

మనుషుల మధ్య అంతరాలు, అసమానతలు అన్నిచోట్లా పెచ్చుమీరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆదాయ అసమానతలు మరింతగా అధికమవుతున్నాయి. దేశార్థికానికి అవి ప్రతిబంధకాలవుతున్నాయి. వాటివల్ల సమాజంలో విపరీత పరిణామాలు ...

Published : 26 Sep 2022 00:58 IST

మనుషుల మధ్య అంతరాలు, అసమానతలు అన్నిచోట్లా పెచ్చుమీరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆదాయ అసమానతలు మరింతగా అధికమవుతున్నాయి. దేశార్థికానికి అవి ప్రతిబంధకాలవుతున్నాయి. వాటివల్ల సమాజంలో విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది.

తం, కులం, పలుకుబడి, ప్రతిష్ఠ, లింగభేదం తదితరాల ఆధారంగా ఆదాయ పంపిణీ జరిగితే, దాన్ని సాంఘిక అసమానతగా చెప్పవచ్చు. విద్య, వారసత్వం, పదవులు వంటి వాటి వల్ల వ్యక్తుల హోదా, ఆదాయం, సంపదలో అసమానతలు సాధారణంగా కనిపిస్తాయి. దానికి భిన్నంగా ధన, వస్తు, వాహన, అధికార దర్ప, అహంకారాలతో స్వతహాగా ఆధిక్యాన్ని ప్రదర్శించడం కుసంస్కారానికి తార్కాణం. సమాజం ఆది నుంచి ఆదాయం, సంపద, స్థాయి తదితర అసమానతలతో రగిలిపోతూనే ఉంది. దేశం స్వాతంత్య్రం సాధించి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా సమాజంలో కుల దుర్విచక్షణ నేటికీ కొనసాగుతోంది. అసమానతలు మనుషుల ప్రవర్తన, నడవడికల్లో విపరీత తత్వానికి దారితీస్తాయి. మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలను ప్రేరేపిస్తాయి. అసమానత అనే దౌర్బల్యం అత్యంత క్లిష్టతరమైనది. అసమానతలు పెరిగే కొద్దీ మనుషుల మధ్య అనుబంధాలు మరింతగా మృగ్యమైపోతాయి.

దేశీయంగా ప్రజల మధ్య ఆదాయం, సంపదల పరంగా అసమానతలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోని శ్రామిక శక్తిలో ఆదినుంచి మహిళా భాగస్వామ్యం తక్కువగా ఉండటం ప్రాథమికంగా అంతరాలను పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధులు, చిరు వ్యాపారాలు దెబ్బతిని భారత్‌లో ఎంతోమంది పేదరికంలోకి జారిపోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళా శ్రామికశక్తిపైనా కొవిడ్‌ ప్రభావం చూపింది. గ్రామీణ జనాభాలో సింహభాగం కనిష్ఠ ఆదాయంతో జీవిస్తున్నారు. ఇండియా అనేక రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించినా, ఆ ఫలితాలు పేదరికాన్ని పారదోలడానికి తోడ్పడలేదన్నది చేదు వాస్తవం. భారత్‌ సేవారంగంలో గణనీయంగా, పారిశ్రామిక రంగంలో స్వల్పంగా పురోగతి సాధించింది. అయితే, సరైన నైపుణ్యం లేని కారణంగా ఎంతోమంది నిలకడైన ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు ఉద్యోగం, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను మప్పడంలో ఇండియా నేటికీ వెనకబడింది. మరోవైపు గ్రామీణంలో వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దాంతో ఎంతోమంది కూలీలు పట్టణాలకు వలస వచ్చి సరైన ఉపాధి లభించక నిరుద్యోగులుగా మిగులుతున్నారు. లేదంటే అరకొర ఆదాయాలతో దుర్భర పరిస్థితుల్లో జీవితాలను వెళ్ళదీస్తున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇనుము, ఉక్కు, వస్త్రాలు, సమాచార సాంకేతికత వంటి కీలక రంగాల్లో ఉద్యోగుల సంఖ్య అంతగా పెరగలేదు. నిరుద్యోగం ఎనిమిది శాతానికి చేరుకుంది. మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆదాయ అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు మరింతగా కృషి చేయాలి. ప్రపంచ అసమానతల నివేదిక-2022 ప్రకారం భారత్‌ పేద దేశంగా మిగిలిపోయింది. దేశీయంగా పౌరుల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది. భారత్‌లో మధ్యతరగతి ప్రజల సగటు సంపద రూ.7.24 లక్షలు. పైస్థాయిలో ఉన్న ఒక్క శాతం సగటు ఆస్తిపాస్తులు రూ.3.24 కోట్లు. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు బహుముఖ పేదరికాన్ని ఎదుర్కొంటున్నట్లు గతంలో నీతి ఆయోగ్‌ వెల్లడించింది.
ప్రజల మధ్య అసమానతలను తొలగించాలంటే పేదల ఆదాయం, సంపద స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు మారేలా పటిష్ఠ ఆర్థిక, ద్రవ్య విధానాలను రూపొందించడం అత్యావశ్యకం. నిరుపేదలు వాడే నిత్యావసర సరకులపై జీఎస్‌టీని తొలగించడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. విద్య, వైద్యం, ఆరోగ్యం పరంగా ప్రభుత్వాలు పేదలకు ఉచిత పథకాలను సమర్థంగా అమలు చేయాలి. వీటిని వదిలిపెట్టి కేవలం డబ్బులు పంచిపెట్టడం వల్ల సరైన ఫలితాలు ఉండవు. అలాగే పాలకపక్షాలు పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టడాన్ని నిలిపి వేయాలి. రైతుబంధు వంటి కర్షక హిత పథకాలను సంపన్నులకు కాకుండా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పటిష్ఠంగా అమలు చేయాలి. అణగారిన, వెనకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పారిశ్రామిక, సేవా రంగాల్లో సొంతంగా సంస్థలను ప్రారంభించడానికి వినూత్న ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమూ ఉంది. అప్పుడే దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల నిజమైన సంక్షేమానికి, అసమానతలను తగ్గించడానికి అవకాశం లభిస్తుంది.

- శ్రీరామ్‌ చేకూరి (ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.