సమస్యల ఊబిలో అన్నదాత

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కర్షకులతో పాటు వ్యవసాయ కూలీల బలవన్మరణాలూ ఏటా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో, సాగు రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.

Published : 27 Sep 2022 01:14 IST

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కర్షకులతో పాటు వ్యవసాయ కూలీల బలవన్మరణాలూ ఏటా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో, సాగు రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.

భారతదేశ వ్యవసాయ రంగానికి అన్నదాతల ఆత్మహత్యలు మాయని మచ్చలా మారాయి. రైతుల సంక్షేమానికి, సాగు వృద్ధికి, మద్దతు ధరల కల్పనకు, ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినా, సాగు రంగంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫలితంగా కొందరు రైతులు కాడి వదిలేస్తున్నారు. మరికొందరు అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2021లో వ్యవసాయ రంగానికి చెందిన వారు (రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు) దేశవ్యాప్తంగా 10,881 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవలి నివేదిక తీవ్ర ఆవేదనాత్మక వివరాలు వెల్లడించింది. రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర కర్ణాటక తొలి రెండు స్థానాల్లో, ఏపీ తెలంగాణ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ఏపీలో 359 మంది రైతులు, 503 మంది కౌలు రైతులు, 584 మంది రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణలో 303 మంది రైతులు, 17 మంది కౌలు రైతులు, 99 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారు. 2020తో పోలిస్తే 2021లో ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు 19శాతం పెరిగాయి. తెలంగాణలో 32శాతం తగ్గాయి.

పాలకుల వైఫల్యం
భారత్‌లో దాదాపు 70శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. 2020-21 జీడీపీలో 19.9శాతం సాగు రంగం నుంచే సమకూరింది. చాలా పంటల ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో నిలుస్తోంది. అయినా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రుణభారం, పంటనష్టం, ఉత్పత్తులకు సరైన ధర దక్కకపోవడం, కుటుంబ సమస్యలు వంటివి రైతులను బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయి. ఇండియాలో వ్యయసాయాన్ని రుతుపవనాలతో జూదంగా వ్యవహరిస్తారు. దేశీయంగా అధికశాతం సాగుభూమి వర్షాధారం కాబట్టి, అనావృష్టి పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అతివృష్టీ కర్షకులకు కన్నీరు మిగిలిస్తోంది. రైతులు పంటల సాగుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. పంటలు దెబ్బతినడం, సరైన ఆదాయం రాకపోవడం వల్ల అప్పులు తీర్చలేక మనోవేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భారత్‌లో 85శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే. వారి చిన్న కమతాల్లో అధిక దిగుబడి అసాధ్యం. కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దాంతో వారికి అప్పులు అనివార్యమవుతున్నాయి. రుణభారం వల్లనే అధిక శాతం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇండియాలోని మొత్తం వ్యవసాయ భూమిలో 25శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నట్లు అంచనా. వారి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వారికి బ్యాంకు రుణాలు అందడం గగనమవుతోంది. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలూ దక్కవు. రుణమాఫీ సైతం వర్తించదు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని కౌలు రైతులు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనకు అనర్హులుగా మారుతున్నారు. పలు రాష్ట్రాల్లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నా, వాటి వల్ల ఉపయోగం నామమాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కౌలు రైతుల సంస్కరణలు, వారి హక్కుల గురించి ప్రభుత్వాలు సరిగ్గా దృష్టి సారించకపోవడంతో చాలా మంది సాగు వదిలేసి కూలీలుగా మారుతున్నారు. లేదా నష్టాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 

మారని ఆర్థిక స్థితి
రైతులతో పాటు వ్యవసాయ కూలీలు అధికంగానే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. దేశవ్యాప్తంగా 2021లో 5,563 మంది వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 5121 మంది పురుషులు. రైతులతో పోలిస్తే వ్యవసాయ కూలీల ఆత్మహత్యలే అధికం. వారిని పేదరికం బాగా కుంగదీస్తోంది. మద్యపానం వంటి అలవాట్లతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు డబ్బు తీసుకొని తిరిగి చెల్లించలేక వారు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొంటున్నారు. వారికొచ్చే ఆదాయమూ చాలా తక్కువ. ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా సహాయం చేస్తున్నా, వారి ఆర్థిక స్థాయిని పెంచలేకపోతున్నాయి. సాగు రంగంపై ఆధారపడిన వారిలో గతేడాది రోజూ సగటున 30 మంది ఆత్మహత్యలకు పాల్పడటం ప్రభుత్వాల వైఫల్యాలకు దర్పణంగా నిలుస్తోంది. దీనికి అడ్డుకట్ట పడాలంటే సాగును లాభసాటిగా మార్చాలి. రైతులు విత్తనాలు వేసిన దగ్గరి నుంచి పంటలు పండించి, వాటిని మార్కెట్లో విక్రయించేదాకా ఏ స్థాయిలో నష్టం తలెత్తినా భర్తీ చేసేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీల సంక్షేమానికీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అప్పుడే సాగు రంగంలో బలవన్మరణాల నివారణ సాధ్యమవుతుంది.

- దేవవరపు బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.