కాకా రాయుళ్లు

‘ఏమిటి అలా ఉన్నావ్‌! ఏదన్నా సమస్యా?’ ‘ఏమి చెప్పమంటావు బ్రదర్‌... ఈ ఉన్నతాధికారుల పుణ్యమా అని జీవితంలో శాంతి కరవైంది’‘నాయకుల దయకొద్దీ జీఎస్టీ భారం మనశ్శాంతిని మింగేస్తోందని అంతా మొత్తుకోవడం విన్నాను. నువ్వేమిటీ, కొత్తగా అధికారులను తెరమీదకు తెచ్చావు!’

Published : 27 Sep 2022 01:12 IST

‘ఏమిటి అలా ఉన్నావ్‌! ఏదన్నా సమస్యా?’
‘ఏమి చెప్పమంటావు బ్రదర్‌... ఈ ఉన్నతాధికారుల పుణ్యమా అని జీవితంలో శాంతి కరవైంది’
‘నాయకుల దయకొద్దీ జీఎస్టీ భారం మనశ్శాంతిని మింగేస్తోందని అంతా మొత్తుకోవడం విన్నాను. నువ్వేమిటీ, కొత్తగా అధికారులను తెరమీదకు తెచ్చావు!’
‘మరేం చేయమంటావు... అద్దెకుంటున్న ఇంట్లో కొళాయిలు లీకవుతున్నాయి. కరెంటు ప్లగ్గులు ఊడిపోతున్నాయి. ఓనర్‌కి చెబితే చూద్దాం అంటాడు. మన ఉన్నతాధికారులను చూసైనా ఆయన్ని కాకాపట్టడం నేర్చుకోవాలని మా ఆవిడ ఒకటే పోరు. ఇక నా సుపుత్రుడి ట్యూషన్‌ మాస్టారు వాణ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదట. ఆ సార్‌ని కలిసి నాలుగు పొగడ్తల బిస్కెట్లు వేస్తే విసుక్కోకుండా సబ్జెక్టు సందేహాలు ఎన్నిసార్లు అడిగినా నివృత్తి చేస్తాడట... మన ఆఫీసర్లను చూసి బిస్కెట్లు ఎలా వేయాలో నేర్చుకోమంటాడు వాడు’
‘అదా సంగతి!’
‘అవును మరి. ఈ మధ్య కొందరు ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల భజనలతో చెలరేగిపోతున్నారు కదా. మొన్నటికి మొన్న ఒక జిల్లా ఖాకీ బాసు సభలో అధికార పార్టీ మంత్రికి జయజయ స్తుతి ధ్వానాలు చేశాడు. ఎదుట ఉన్నవాళ్లను బలవంతపెట్టి మరీ జేజేలు కొట్టించాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమనే గుసగుసలు అప్పుడే గాలిలో చక్కర్లు కొడుతున్నాయి’
‘అవునవును... నేనూ చదివాను’
‘నిన్నటికి నిన్న మరో జిల్లా పాలనాధికారి ఏమాత్రం తటపటాయించకుండా నాయక స్తుతిలో తన ప్రతిభనంతా ప్రదర్శించాడు. ఇలాంటి వాళ్లు దేశంలో గుట్టలుగా పెరిగిపోతున్నారు కదా. అసలు ఐఏఎస్‌ అనే మాట క్రమంగా ఉనికి కోల్పోయి, అయ్యా... యస్‌గా పరిణామం చెందుతోందన్నది జగమెరిగిన సత్యం. అలాంటి వాళ్లను చూసైనా కాకాపట్టడం నేర్చుకోవాలట నేను. ఫ్రెండ్‌ని అప్పు అడగడానికి, చెప్పిన సమయానికి దాన్ని తీర్చకుండా ఎగ్గొట్టడానికి, పక్కింటివాళ్ల వైఫైని ఉచితంగా వాడుకోవడానికి, అప్పుడప్పుడూ వాళ్ల కారును ఉపయోగించుకోవడానికి... ఇంకా చాలావాటికి పొగడ్తలు బాగా పనికొస్తాయట... స్తుతులతో ఎదుటివాళ్లను మునగచెట్టు ఎక్కించడంలో నేను వీక్‌ కాబట్టే చాలా విషయాల్లో వెనకబడుతున్నానని ఇంట్లో ఒకటే దెప్పిపొడుపులు. మనస్సాక్షికి, నైతికతకు తిలోదకాలిచ్చి అడ్డదిడ్డంగా అందరికీ తాళాలు కొట్టడం... ఉన్నతాధికారులతో సమానంగా నాకెక్కడ చేతనవుతుందీ’
‘బాగానే ఉంది వరస! అయినా గురువులను ప్రత్యక్షంగా, బంధుమిత్రులను పరోక్షంగా, సేవకులను వారి విధులు పూర్తయ్యాక పొగడాలని పెద్దలు చెబుతారు. ఆయుక్షీణం కాబట్టి పుత్రులను మాత్రం ఎప్పుడూ మెచ్చుకోకూడదట. కానీ, నాయకులను మాత్రం వారి ఎదురుగా, వెనక, వారు తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోయినా మెచ్చుకోవాలి. లేకపోతే ఆఫీసర్లకు కోరుకున్న పోస్టులు దక్కవు... దండిగా ఆమ్యామ్యాలు రాలవు. ‘ఎదుగుదల’ అనే మాటకు అధికారస్వామ్యంలో అర్థం ఇదే!’
‘అంతే కదా మరి. అయినా, అక్కడెక్కడో లాటరీలో బంపర్‌ ధమాకా తగిలిందని కొందరు సంబరపడిపోతుంటారు. కానీ, అదృష్టం అంటే నేతలకు చిడతలుకొట్టే సార్లదే. అసలిప్పుడు ఖద్దరు కట్టి పదవి రాబట్టాలంటే ఎన్నెన్ని కోట్లు ఖర్చుపెట్టాలి. ఎంతెంత పార్టీ ఫండు ధారబోయాలి. అవేమీ లేకుండా రాజమార్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నేరుగా శాసన వ్యవస్థలోకి గెంతడమంటే మాటలా! చక్కగా చదవని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు మట్టికోసం తవ్విన గుంతతో సమానమన్నాడు బద్దెన. మన అధికారులను చూస్తే, నేతలను బాహాటంగా స్తుతించని నోరు, వారి అండదండల కోసం ఆరాటపడని నోరు వృథా అనిపిస్తోంది’
‘నిజమే... దేవుడికి మొక్కితే వరాలు ఇస్తాడో లేదోగానీ, ప్రభుత్వ పెద్దలను స్తుతిస్తూ వారికి అన్నిరకాలుగా సహకరిస్తే బోలెడు లాభాలు...’
‘కానీ, అవినీతిలో పాలక పక్షాలతో అంటకాగి జైలు వాసం అనుభవించిన ఉన్నతాధికారులు చాలామంది ఉన్నారు కదా!’
‘సరేలేవయ్యా... అవసరమైతే నాలుగు రోజులు అత్తవారింటి భోగాలు అనుభవించి మళ్ళీ బయటికొస్తారు... ఏదో ఒక శాఖకు ఎంచక్కా కార్యదర్శులు అయిపోతారు. అయినా, నేరమంటూ రుజువైతే ముందు నాయకులే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించాలి. ఆ తరవాతే అధికారుల వంతు. ఆ కేసులు తేలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది’
‘మరి తాము జీతాలిచ్చి పోషిస్తున్న అధికారస్వామ్యం నిజాయతీకి నీళ్లొదిలి నేతల భజనలో మునిగిపోతే ప్రజలు ఏమనుకుంటారు... వారినెంత ఛీకొడతారు?’
‘ఆ ఇంగితమే అధికారులకు ఉంటే, నీకూ నాకూ ఇంత కంఠశోష ఎందుకుంటుందీ! దొంగలూ దొంగలూ కలిసి ఊళ్లను పంచుకున్నట్లు... నేతలు, అధికారులు కుమ్మక్కై ఆడుతున్న సర్వభక్షక క్రీడ నుంచి దేశాన్ని ప్రజలే కాపాడుకోవాలి. ప్రశ్నించే తత్వం, నీతిమంతులైన నాయకులకు పట్టం కట్టే చైతన్యం ప్రజల్లో పెరిగినప్పుడే అది సాధ్యమవుతుంది!’ 

- వేణుబాబు మన్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.