సంపద సృష్టించే పునర్వినియోగం

దేశంలో పట్టణీకరణ, జనాభా పెరుగుదల, జీవనశైలిలో మార్పుల వంటివి ఆధునిక వస్తు వినియోగాన్ని పెంచేశాయి. ఈ పరిణామాలు వ్యర్థాలు పెరగడానికి దారితీస్తున్నాయి. వస్తు వినియోగానికి అనుగుణంగా వ్యర్థాల పునర్‌ వినియోగంపై దృష్టి సారించడం లేదు.

Published : 28 Sep 2022 00:55 IST

దేశంలో పట్టణీకరణ, జనాభా పెరుగుదల, జీవనశైలిలో మార్పుల వంటివి ఆధునిక వస్తు వినియోగాన్ని పెంచేశాయి. ఈ పరిణామాలు వ్యర్థాలు పెరగడానికి దారితీస్తున్నాయి. వస్తు వినియోగానికి అనుగుణంగా వ్యర్థాల పునర్‌ వినియోగంపై దృష్టి సారించడం లేదు. ఈ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.

దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పురపాలక ఘన వ్యర్థాల ఉత్పత్తి ఏటికేడాది భారీగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో వ్యర్థాల నుంచి ఇతర వనరులను తయారు చేసేందుకు తోడ్పడే విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఘన వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగం, తడి వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ ఎరువు తయారీ ప్రక్రియల ద్వారా పెద్దయెత్తున ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నది అంచనా. పట్టణాల్లో నిర్మాణాల కూల్చివేతలవల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాల నుంచీ ఆదాయాన్ని సముపార్జించుకొనే అవకాశం ఉంది. వ్యర్థాలను శుద్ధి చేసి, పునరుద్ధరించి, పునర్వినియోగించే వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే ఇలాంటి వ్యవస్థను ప్రోత్సహించడానికి వ్యర్థాలను మళ్ళీ వాడుకొనే ప్రక్రియను అభివృద్ధి పరచాలి. సమర్థరీతిలో శుద్ధి పరచడమే అత్యంత కీలకం. నాణ్యతతో కూడిన వస్తువులను తయారు చేయడం అంతకన్నా ముఖ్యం. అందుకోసం తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాల నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణతో పెద్దసంఖ్యలో పనిదినాలను సృష్టించే అవకాశమూ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతటి భారీ ఆర్థిక సామర్థ్యం కలిగిన ప్రక్రియపై ప్రభుత్వ యంత్రాంగాలు మరింతగా దృష్టి సారించాలి. కర్బన ఉద్గారాలూ పెరుగుతున్న క్రమంలో వ్యర్థాలను శాస్త్రీయంగా, సమర్థ రీతిలో శుద్ధిచేయడం ద్వారా ముప్పు తగ్గించుకోవచ్చు. వ్యర్థాల కట్టడికి స్వచ్ఛభారత్‌, అమృత్‌, స్మార్ట్‌ సిటీ వంటి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. తెలంగాణలో వివిధ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టడమే కాకుండా, విద్యుత్‌ తయారీ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యర్థాల నిర్వహణకు పురపాలక సంఘాల్లో ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

అన్ని రంగాల్లో వ్యర్థాలను తగ్గించే ప్రయత్నాన్ని అమలు చేయడంతోపాటు, సమర్థ రీతిలో తిరిగి వాడుకొనే విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఇలాంటి పద్ధతిని ప్రోత్సహించడానికి సమగ్రమైన విధానాన్ని రూపొందించాలి. వ్యర్థాలను ఉత్పత్తి వనరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలి. వాటి శుద్ధి, పునరుద్ధరణ కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, నిర్వహణ చేపట్టే అంకుర సంస్థలను విరివిగా ప్రోత్సహించాలి. పెద్ద నగరాలు, పట్టణాల్లో తప్పనిసరిగా పాత వస్తువుల సేకరణ సదుపాయాల వ్యవస్థను నెలకొల్పాలి. పునశ్శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేసిన వస్తువుల వాడకానికి తగిన విధివిధానాలతోపాటు, వీటిపై ప్రజల్లో అవగాహననూ పెంపొందించాలి. వ్యర్థాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులపై జీఎస్టీ వంటి పన్ను విధింపుల నుంచి మినహాయింపు కల్పించాలి. సమగ్రమైన విధానాల ద్వారా సమస్యను అధిగమించడానికి నీతిఆయోగ్‌ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. పునర్వినియోగ ప్రక్రియలో సరికొత్త వ్యాపార నమూనాల రూపకల్పన కోసం ప్రైవేటు రంగాన్ని విరివిగా ప్రోత్సహించాలి. వ్యర్థాల నిర్వహణలో పాల్గొనే అసంఘటిత రంగం సంక్షేమం కోసం అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. వ్యర్థాల సేకరణ, తిరిగి వాడుకొనే ప్రక్రియపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత విధానంలో వనరుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగానికి సంబంధించిన గణాంకాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరించే విధానాన్ని నెలకొల్పాలి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తరహాలో ఇళ్లవద్దే వ్యర్థాలను వేరుచేసే విధానాన్ని దేశమంతటా అమలు చేయాలి. వ్యర్థాల దహనం, భూమిలో పూడ్చిపెట్టడం, కాలుష్యం వంటి సమస్యలు తలెత్తకుండా, వాటిని మళ్ళీ ఉపయోగించే వనరులుగా తీర్చిదిద్దడం మేలు. వ్యర్థాలను సంపద సృష్టికి ఊతమిచ్చే వనరులుగా మారిస్తేనే ఈ సమస్యను సమర్థంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలకూ అడ్డుకట్ట పడి, సహజ వనరులపై భారం తగ్గి, వాటి పరిరక్షణ సాధ్యమవుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సైతం సత్వరమే సాధించే అవకాశం ఉంటుంది.

-ఎ.శ్యామ్‌ కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.