అలవిమాలిన ఆదర్శం

‘జనం ఎవరిని చూసి నేర్చుకొంటారు?’ ‘ఇంకెవరిని... తమను నడిపించే నేతలను, పాలించే ఏలికలను చూసే!’ ‘అలాంటప్పుడు ప్రతి విషయంలోనూ నేతల నడత, నడవడిక నలుగురూ మెచ్చేలా ఉండాలి కదా?’‘నలుగురేం ఖర్మ... నేత నడిస్తే, నలభై లోకాలే నమో అంటాయి. ఇప్పుడు ఎందుకీ ధర్మసందేహం?’

Published : 28 Sep 2022 00:55 IST

‘జనం ఎవరిని చూసి నేర్చుకొంటారు?’
‘ఇంకెవరిని... తమను నడిపించే నేతలను, పాలించే ఏలికలను చూసే!’

‘అలాంటప్పుడు ప్రతి విషయంలోనూ నేతల నడత, నడవడిక నలుగురూ మెచ్చేలా ఉండాలి కదా?’
‘నలుగురేం ఖర్మ... నేత నడిస్తే, నలభై లోకాలే నమో అంటాయి. ఇప్పుడు ఎందుకీ ధర్మసందేహం?’

‘పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మహాశయులు మద్యసేవన అనంతరం విమానం అధిరోహించగా ఆ ఉదంతమంతా రచ్చగా మారినట్లు- వార్తలు కోడై కూశాయి కదా! అలాంటి ముఖ్యస్థానంలో కూర్చొని- ఇలాంటి ప్రవర్తనకు పాల్పడి, ఎలాంటి సందేశాన్ని సమాజానికి అందించాలనుకున్నారు?  జనాన్ని ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు?!’

‘అంతటి ఆవేశం అక్కర్లేదు. అన్నివైపులా ఆలోచించి చూడాలి. ఇప్పుడసలే సర్కారులన్నీ కాసులకు కటకటలాడుతున్నాయి. సర్కారు ఖాతాల్లో అధికాదాయాన్ని అప్పనంగా నింపే ఉదార దానహృదయులు, మద్యపాన ప్రియులే! అందుకే మరింత ఉత్సాహాన్ని ఇనుమడింపజేసేందుకే అలా పూనుకొన్నారేమో!’

‘నేతల అడుగుల వెనక అంత లోతైన ఆలోచనలు ఉంటాయా!?’
‘కుడిచేత్తో చేసేది, ఎడమ చేతికి తెలియనివ్వని పనితనం మన నేతలది. ఏ పనయినా మూడోకంటికి తెలియకుండా ముగించగల నిపుణులు. చేతికి మట్టి అంటకుండా, తెల్లచొక్కాకు మరకలేకుండా మెరిసిపోయే నిష్కళంకులు. ముఖ్యమాత్యులే పూనుకొని, పూనకం తెచ్చుకుని ఊగారంటే, ఆదర్శప్రాయ అడుగుజాడలేవో ఉండే ఉంటాయి. ఊరకరారు మహానుభావులన్నట్లు... ఉత్తినే ఏదీ చేయరు నేతాగ్రేసరులు!’

‘అదేంటో మన నేతలు చెయ్యకూడనివి చేసినా సమర్థింపే, చెప్పినవేవీ చెయ్యకున్నా ఆదరించడమే! ఎలాంటి స్థితిలోనూ అభిమానం మాత్రం తగ్గదు... ఏమిటో ఈ అంతుపట్టని విచిత్రం! ఎంతైనా నేతలు కారణజన్ములు!’

‘ఎందుకంటే, నాయకులపై పడే నిందలేవీ నికార్సుగా నిలబడి పోయినట్లు చరిత్రలోనే లేదు. కాలం కరిగేకొద్దీ ఆరోపణలన్నీ సిగ్గుతో చచ్చి, అసత్యాలుగా మారిపోతాయి. నిందలన్నీ నేత ముందు నిజాయతీగా నిలబడలేక లెంపలేసుకుని పలాయనం చిత్తగిస్తాయి. ఆ తరవాతెప్పుడో- అప్పట్లో ఫలానా పుణ్య కారణం కోసమే అలాంటి పరమకృత్యానికి ఒడిగట్టినట్లు మనమే తెలుసుకుంటాం. అందుకని, రేపెప్పుడో సత్యం బోధపడి తత్వం అర్థం చేసుకునే బదులు, ముందుగానే అనవసర అనుమానాల్ని ఆపేస్తే మంచిది. ప్రశాంతంగా ప్రజాసేవ చేసుకుంటారు!’

‘అలాగైతే, నేతల చేతలన్నీ జనాల సేవలో భాగమే అనుకోవాలా? చూసి నేర్చుకొంటే అద్భుతం, పాటిస్తే పరమాద్భుతం అంటావంతేకదా!’

‘అంతేమరి... జనం కోసం ప్రాజెక్టో, రోడ్డో, వంతెనో విదిలిస్తారు. కాంట్రాక్టరు ఉడతా భక్తిగా సమర్పణ చేసుకుంటూ మొహమాట పెడితే, కాదనలేక స్వీకరించే బహుమతిని పాపపు సొమ్ముగా భావించి చేతితో తాకలేక, సహాయకులో బంధుగణమో అనుచరగణమో మరెవరి చేతిలోనో పెట్టివెళ్ళమంటారు. సేవ పెద్దదైతే బహుమతి ఎకరాల్లోకి, భవనాల్లోకి, సూట్‌కేసుల్లోకి పెరుగుతుంది. వాటిని బినామీలనే ముద్దుపేరుతో డ్రైవర్లు, పనిమనుషుల పేరిటో రాసిపెడతారు. ఇదంతా ఓ ఉదాత్త ప్రక్రియ. సర్కారీ సార్లూ దీనినే అనుసరిస్తున్నారు. జనం చెల్లింపుల్ని ప్యూనుకో, జిరాక్సు దుకాణంలోనో, టీకొట్టులోనో ఇచ్చి వెళ్ళమని చెబుతుంటారు. పెద్దసార్లకూ బామ్మర్దులనే బినామీలు సహజమే కదా! ఇలాంటి జ్ఞాననైపుణ్యాలన్నీ నేతలు నేర్పేవే కదా! ఇవేకాదు, నేతలనగానే ముందూవెనకా కార్ల బార్లు, భారీ బంగళాలు, అనుచరులు, రోడ్లు ఖాళీ చేయడం, జనాల్ని ఆపేయడం, అటూఇటూ తెల్లసున్నం... ఇంత హల్‌చల్‌ అప్పట్లో రాజులకూ ఉండేది కాదేమో!’  

‘అప్పట్లో ఆంగ్లేయులు రోగాలకు భయపడి రోడ్లకు తెల్ల పొడి పోసుకునేవాళ్లు... ఇప్పటి నాయకులకేం రోగం?’
‘అదో ఖద్దరు డాబు, తెల్లచొక్కాల దర్పం! మేము సామాన్యులం కాదని చెప్పే సింబాలిజం! జనం కూడా ప్రతి కార్యానికీ రోడ్లపైనే టెంట్లు వేసి, రోడ్లు మూసేసి, అనుమతులే అక్కర్లేని వీఐపీ హోదాను అనుభవించెయ్యడం లేదా... ఇదంతా నేతల ప్రేరణా పుణ్యఫలమే కదా!’

‘నాయకులంటే ఏదో వాళ్ల పొట్టకూటి కోసం నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి నానా గడ్డి కరుస్తుంటారు. ఓట్లకు నోట్లుగా జనానికి పంచిపెట్టడానికే కదా ఆ అడ్డమైన గడ్డీ తినేది! అవన్నీ నేర్చుకొంటామంటే ఎలా?’

‘నేర్చుకోవాలేగాని, నేతలు నేర్పలేని విద్య ఉంటుందా! నేతలు స్కాములు చేస్తే, జనాలు స్కీములు చేస్తున్నారు. డొల్ల కంపెనీలు, మనీలాండరింగ్‌లు నాయకులవైతే, కాగితాల్లోనే కనిపించే కాలేజీలు విద్యావ్యాపారులవి! ఉద్యోగాల పేరిట నాయకులు టోకరా వేస్తే, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి ముంచేపని దళారులు చేస్తున్నారు. అరచేతిలో ప్రాజెక్టులు చూపి, అందినంత దోచుకోవడం నాయకుల నైజం. అభివృద్ధి ఆశ చూపి అక్కరకురాని స్థలాలు అంటగట్టడం స్థిరాస్తి వ్యాపారం. ఇలాంటివన్నీ నాయకుల నుంచి స్ఫూర్తిపొంది చేసేవే. అబద్ధాలు, మోసాలు, నయవంచన, మాట తప్పడం, ఎగవేతలు, దౌర్జన్యం, భయపెట్టడం, దాడులు చేయడం... ఇలాంటివన్నీ నిత్యకృత్యాలు కావడానికి కారణం- నేతల ఆదర్శనీయ అడుగుజాడలే!’

- శ్రీనివాస్‌ దరెగోని

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts