‘పేద’యాత్ర

‘గురూ... ఈ యాత్రలనేవి ఎందుకు చేస్తారు?’‘గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి’‘అంటే మళ్ళీ కొత్త పాపాలు చెయ్యవచ్చన్న మాట’‘అదేరా నీతో వచ్చిన చిక్కు... అడ్డదిడ్డంగా మాట్లాడతావ్‌’‘అది కాదు గురూ... యాత్రలని మన రాహుల్‌ గాంధీ

Published : 29 Sep 2022 01:05 IST

‘గురూ... ఈ యాత్రలనేవి ఎందుకు చేస్తారు?’

‘గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి’

‘అంటే మళ్ళీ కొత్త పాపాలు చెయ్యవచ్చన్న మాట’

‘అదేరా నీతో వచ్చిన చిక్కు... అడ్డదిడ్డంగా మాట్లాడతావ్‌’

‘అది కాదు గురూ... యాత్రలని మన రాహుల్‌ గాంధీ ఊళ్లమీద పడి తిరుగుతూ ‘భారత్‌ ఛోడో’ అంటున్నాడు కదా... అందులో ఏదో మతలబు ఉందని నా అనుమానం’

‘అది మామూలు యాత్ర కాదురా... పాదయాత్ర! ఆయన అంటున్నది ‘భారత్‌ జోడో’... అంటే భారత్‌ను కలపమని!’

‘మనమిప్పుడు కలిసే ఉన్నాం కదా... మళ్ళీ కొత్తగా కలిపేదేమిటి?’

‘పాపం... ఆయన అమాయకుడురా! నీలాగే చాలామంది రాహుల్‌ను అపార్థం చేసుకునేవారే. గతంలో ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ అంటే ప్రభుత్వ అధికారులు దిల్లీ శివార్లలో ఉన్న గుడిసెలన్నీ పీకేసి, వాటిలోని జనాలను తరిమివేశారు. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా... రాహుల్‌కేమో అకస్మాత్తుగా పేద జనం గుర్తుకు వచ్చారు. అందుకే ఈ పేదయాత్ర... ఛ..ఛ... పాదయాత్ర’

‘పాదయాత్ర చేస్తే పేదరికం పోతుందా?’

‘పిచ్చివాడా... పేదరికమనేది కేవలం మన భావన మాత్రమేనని గతంలో రాహుల్‌గాంధీ ఉపదేశించాడు. మళ్ళీ ఆయనే దేశంలో పేదలు పెరిగారని ఆవేదన చెందాడు’

‘ఆయన మనోగతం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే గురూ!’

‘మన నాయకులు మాటలతో కోటలు కడుతూ ఉంటారు. ఎవరికీ దేశంలోని సమస్యలేమిటో, వాటిని ఎలా పరిష్కరించాలో స్పష్టంగా తెలియదు. అన్నింటినీ గత ప్రభుత్వాలపై తోసేస్తారు. మాకు పాలించే అవకాశం ఇస్తే ఇది ఫ్రీ... అది ఫ్రీ అని వాగ్దానాలు గుప్పిస్తుంటారు. వాళ్లు మళ్ళీ పేదరికాన్నే ఫ్రీగా ఇస్తారు. అలా వంతులవారీగా సామాన్యజనాన్ని దోచుకుంటూనే పబ్బం గడిపేస్తుంటారు. దేశంలో అభివృద్ధి జరుగుతున్న మాట నిజమే అయితే, అది నాయకుల అభివృద్ధే!’

‘మరైతే మన పేదరికాన్ని ఏ నాయకుడు నిర్మూలిస్తాడు?’

‘మళ్ళీ అదే అమాయకత్వం... పేదరికం లేకపోతే ఈ రాజకీయ పార్టీలు, వాటిని నమ్ముకున్నవాళ్లూ బతికేదెలా? పేదరికం, కులం, మతం, ప్రాంతీయ భేదాలు లాంటి సమస్యలే ఎలక్షన్లకు పెట్టుబడి...’

‘చక్కగా సెలవిచ్చావు గురూ... కానీ, ఈ పాదయాత్రలన్నీ ఎన్నికలకు ముందే ఎందుకు మొదలుపెడుతున్నారు... అప్పటిదాకా నాయకులకు ప్రజలు గుర్తుకు రారా?’

‘మళ్ళీ ప్రజలంటావ్‌! అసలీ నేతలకు ప్రజల గురించి ఆలోచించే తీరికెక్కడిది? ఇంతకుముందు ఎలక్షన్లకు పెట్టిన ఖర్చంతా రాబట్టుకోవాలా... ఆ తరవాత మరో పది తరాలకు సరిపడా పోగెయ్యాలా... అది వదిలిపెట్టి ‘అలో లక్ష్మణా’ అని ఆకలి కేకలు పెట్టే జనం వారికి ముఖ్యమా? ఒంటినిండా కప్పుకోవడానికి దుస్తులు లేని పేదలు మన దేశంలో లక్షల్లో ఉన్నారని,  గాంధీజీ చొక్కా తొడుక్కోవడం మానేశారు. కానీ మన రాహుల్‌ గాంధీని చూడు... ఆయన టీషర్టు ఖరీదు నలభై వేల రూపాయలు’

‘అలా అనవద్దు గురూ... దుస్తుల విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల్లో ఎవరి మోజు వారిది. మన ప్రధాని దుస్తులకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతుందట. అయినా, మనం ‘రిచ్‌’గా కనిపిస్తేనే కదా, విదేశీ నాయకులు భారీగా రుణాలిస్తారు. ఈ బడా నాయకులు అన్నీ బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లు కళకళలాడుతూ కనిపించాలి. బాగా అభివృద్ధి చెందాలి. నాయకులు అభివృద్ధి చెందితేనే ప్రజలూ అభివృద్ధి చెందుతారు. అందుకే కదా... ‘యథారాజా తథా ప్రజా’ అని పెద్దలన్నారు’

‘ఇప్పుడు దార్లోకి వచ్చావురా... ఇంతకుముందు ప్రజలు ప్రజలని గగ్గోలు పెట్టావు. ఇప్పుడేమో ప్లేటు ఫిరాయించేశావు. అదే రాజకీయ మాయ! అన్నట్టూ... రాహుల్‌ యాత్రలో ఏదో మతలబు ఉందని ఇందాక అన్నావు కదా... ప్రతిదానికీ ఓ ధర్మసూక్ష్మం ఉంటుంది. ఏ నాయకుడైనా ధన సంపాదనలో పడి, ఆరోగ్యం గురించి పట్టించుకోక, లావైపోయి జబ్బుల పాలయ్యాడనుకో... అప్పుడు వాళ్ల డాక్టరు- ‘నువ్వు డైటింగ్‌ చేయాలి. రోజూ వాకింగ్‌ చెయ్యాలి’ అని గట్టిగా హెచ్చరిస్తాడు. ఉత్తినే వాకింగ్‌ చేస్తే ఏం లాభం? అందుకే పాదయాత్ర మొదలుపెడతారు. పనిలో పనిగా పిల్లల్ని ఎత్తుకుంటూ వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తారు. భోజనాల సమయానికి ఏ బడుగుల ఇంట్లోనో దూరిపోయి, వాళ్లతో పాటు అంతకుముందే ఏర్పాటు చేసిన ఖరీదైన భోజనం చేస్తారు. ఒళ్లు వంచి ఎక్సర్‌సైజ్‌ చేసినట్లు ఉంటుందని స్కూలు పిల్లల మేజోళ్లూ సరిచేస్తారు. ఇలా ప్రతిదానికీ ఒక పరమార్థం ఉంటుంది. అదే రాజకీయమంటే... ఆ విషయం గ్రహించలేని నీలాంటి అమాయకులు దేశంలో దండిగా ఉన్నారు కాబట్టే... నాయకులు ఆడే డ్రామాలన్నీ బాగా రక్తి కడుతున్నాయి’

‘ఇప్పుడు నాకు పూర్తిగా జ్ఞానోదయం అయింది గురూ... వస్తా!’

- బి.కె.ఈశ్వర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.