భారత్‌-ఇటలీ స్నేహబంధం

ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జోర్జియా మెలోనీ చరిత్ర సృష్టించనున్నారు. కొవిడ్‌ విజృంభణ, ఉక్రెయిన్‌ సంక్షోభంవల్ల చతికిలపడిన దేశార్థికాన్ని తిరిగి గాడిన పెట్టడం ఆమె ముందున్న సవాలు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెలోనీ ఎలా ముందుకు తీసుకెళ్తారన్న

Published : 30 Sep 2022 00:40 IST

ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జోర్జియా మెలోనీ చరిత్ర సృష్టించనున్నారు. కొవిడ్‌ విజృంభణ, ఉక్రెయిన్‌ సంక్షోభంవల్ల చతికిలపడిన దేశార్థికాన్ని తిరిగి గాడిన పెట్టడం ఆమె ముందున్న సవాలు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెలోనీ ఎలా ముందుకు తీసుకెళ్తారన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది.

ఇటలీలో రెండో ప్రపంచయుద్ధం తరవాత తొలిసారిగా తీవ్ర అతివాద ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ అధినాయకురాలు జోర్జియా మెలోనీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. యుక్త వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెలోనీ, వడివడిగా ఎదిగారు. మరికొందరు నేతలతో కలిసి 2012లో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీని స్థాపించారు. 2008లో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన శాఖ బాధ్యతలు స్వీకరించి, ఇటలీలో పిన్న వయసులో (31 ఏళ్లకే) మంత్రి పదవిని దక్కించుకున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. 2018లో కేవలం 4.3శాతం ఓట్లకు పరిమితమైన మెలోనీ పార్టీ, ఇప్పుడు ఏకంగా పాలనాపగ్గాలు దక్కించుకుంది. కొవిడ్‌, ఆపై ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రభావంతో ఇటలీ ఆర్థిక వృద్ధి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు- ఇటలీ తీవ్ర రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ అప్పుల భారం ప్రస్తుతం దాదాపు 2.9 లక్షల కోట్ల డాలర్లు. ఆర్థిక వ్యవస్థను తిరిగి చక్కదిద్దేందుకు ఇటలీలో వ్యాపారానుకూల వాతావరణం సృష్టిస్తామని మెలోనీ పార్టీ ప్రకటించింది. పన్నుల్లో కోత విధించడం ద్వారా ఉపశమనాలు కల్పిస్తామని, దివ్యాంగులు, పిల్లలు, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అవే విజయానికి బాటలు పరచాయి.

మెలోనీ నేతృత్వంలో ఏర్పడనున్న సంకీర్ణ సర్కారులో సిల్వియో బెర్లుస్కోని, మాటెయో సాల్వీనీలకు చెందిన పార్టీలూ భాగస్వామ్య పక్షాలుగా ఉండనున్నాయి. బెర్లుస్కోని, సాల్వీనీలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. వారిద్దరి ఒత్తిడి, ఇంధన కొరత దృష్ట్యా రష్యాపై ఆంక్షలను మెలోనీ బేఖాతరు చేస్తారేమోనని ఈయూ శంకిస్తోంది. ఈయూలోని వేరే సంపన్న దేశాలు రోమ్‌ను తొక్కేస్తున్నాయంటూ ఎన్నికల ప్రచారంలో మెలోనీ పలుమార్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. కాబట్టి సమస్యాత్మక సభ్య దేశాలుగా ఈయూ భావించే హంగేరీ, పోలాండ్‌లతో కలిసి ఇకపై రోమ్‌ పనిచేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం పాత పరిణామాల ఆధారంగా మెలోనీ భవిష్యత్తు కార్యాచరణను అంచనా వేయలేం! ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా చేసిన ఓ ట్వీట్‌కు ఆమె స్పందిస్తూ- కీవ్‌కు మద్దతును పునరుద్ఘాటించారు. విదేశాంగ విధానాల్లో ఆమె నిర్ణయాలను ప్రభావితం చేయగల స్థాయిలో మిత్రపక్షాలకు బలం లేదు. ఐరోపా దేశాలు, అమెరికా మధ్య సైనిక సహకారం కొనసాగాలన్న విధానానికి (అట్లాంటిసిజం) ఆమె కట్టుబడే అవకాశముంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఈయూ సహకారం అత్యావశ్యకమన్న సంగతి మెలోనీకి తెలియనిది కాదు.

చైనా దురాక్రమణ వైఖరిని మెలోనీ తీవ్రంగా ఎండగడుతుంటారు. జిన్‌పింగ్‌ సర్కారు చేపట్టిన బీఆర్‌ఐ ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షంగా చేరేందుకు 2019లో ఇటలీ అంగీకరించినప్పుడు ఆమె విమర్శలు గుప్పించారు. తాను అధికార పీఠమెక్కితే ఆ ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని తేల్చిచెప్పారు. తైవాన్‌ విషయంలో డ్రాగన్‌ దూకుడును పలుమార్లు ఆమె ఖండించారు. ఇండియాతో పటిష్ఠ సంబంధాలకు మెలోనీ ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ప్రధానిగా ఆమె ఎన్నిక ఖరారు కాగానే మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామంటూ పిలుపిచ్చారు. అందుకు మెలోనీ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత్‌కు ఈయూలోని అయిదు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఇటలీ ఒకటి. ఆ దేశ దిగుమతుల్లో ఇండియా వాటా 1.2శాతం. 2000-2020 మధ్య భారత్‌కు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సమకూర్చిన దేశాల జాబితాలో ఇటలీది 18వ స్థానం. ఇన్నాళ్లూ ఇటలీ ప్రధానిగా ఉన్న మారియో డ్రాగీ దిల్లీతో సంబంధాలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. మెలోనీ సైతం ఆయన బాటలో సాగితే ఉభయదేశాలకూ లబ్ధి చేకూరుతుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి రూపొందించుకొన్న 2020-2025 కార్యాచరణ ప్రణాళికకు ఇరుదేశాలు కట్టుబడి ఉండాలి. తద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, అంకుర పరిశ్రమలు-నవకల్పనలు, మౌలిక వసతులు, శుద్ధ ఇంధనం, సాంస్కృతికం వంటి రంగాల్లో పరస్పర సహకారం మరింత మెరుగు పడుతుంది.

- నవీన్‌ కుమార్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts