పండుటాకులకు దక్కని భరోసా

వయసుడిగిన తల్లిదండ్రులను కొందరు పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆస్తుల కోసం వారిని వేధింపులకూ గురిచేస్తున్నారు. అలాంటి అసహాయుల సంక్షేమం కోసం కేంద్రం తెచ్చిన చట్టం సరిగ్గా అమలుకు నోచుకోవడంలేదు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.

Published : 01 Oct 2022 00:36 IST

వయసుడిగిన తల్లిదండ్రులను కొందరు పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆస్తుల కోసం వారిని వేధింపులకూ గురిచేస్తున్నారు. అలాంటి అసహాయుల సంక్షేమం కోసం కేంద్రం తెచ్చిన చట్టం సరిగ్గా అమలుకు నోచుకోవడంలేదు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.

ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, కన్నబిడ్డల స్వార్థం, మానవ విలువలు లోపించడం వంటివి ప్రస్తుతం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారాయి. కన్నబిడ్డలు కలల కొలువుల కోసం రెక్కలు కట్టుకొని ఎగిరెళ్ళిపోతే ఎందరో తల్లిదండ్రులు ఒంటరిగా జీవితాలు వెళ్ళదీస్తున్నారు. కొందరు పిల్లలు వేరింటి కాపురాలతో కన్నవారిని విస్మరిస్తున్నారు. ఆస్తులు పంచి ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం’ తెచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి సంక్షేమ నియమావళిని రూపొందించాయి. 2019లో ఈ చట్టానికి కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేసినా, అవి ఇంకా అమలులోకి రాలేదు. అధికారులు, పాలకుల అలక్ష్యం కారణంగా ఈ చట్టం సరైన ఫలితాలను అందించడం లేదు.

తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం ప్రతి రెవిన్యూ డివిజన్‌లో సబ్‌ కలెక్టర్‌/ఆర్‌డీఓ చైర్మన్‌గా, జిల్లా వికలాంగులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కన్వీనర్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు సభ్యులుగా ట్రైబ్యునల్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది బాధిత వృద్ధుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుంది. విచారణ జరిపి, మూడు నెలల్లో తీర్పు వెలువరిస్తుంది. దాని అమలు, తల్లిదండ్రుల ఆస్తులు, ప్రాణ రక్షణ బాధ్యతను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌, రెవిన్యూ అధికారులకు అప్పగిస్తుంది. ప్రతివాది తగిన కారణం లేకుండా రెండు మూడు వాయిదాలకు రాకుంటే ఏకపక్షంగా తీర్పును ఇవ్వవచ్చు. తీర్పుపై అసంతృప్తి ఉంటే ఆ తరవాతి అంచెలో ఉండే ట్రైబ్యునల్‌ కమిటీలో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ట్రైబ్యునల్‌ కమిటీ తీర్పులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అయిదు వేల రూపాయల జరిమానా, లేదా మూడు నెలల జైలు, లేదా రెండూ విధించవచ్చు. వయసుడిగిన తల్లిదండ్రులకు అతి దగ్గరలో, పైసా ఖర్చులేకుండా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చారు. ఇక్కడ న్యాయవాదులు ఉండరు. ఎవరికి వారే తమ వాదనలు వినిపించుకోవచ్చు. నిజానిజాలపై ట్రైబ్యునల్‌ కమిటీ విచారణ జరుపుతుంది. ఒక సివిల్‌ కోర్టుకు ఉండే అధికారం దానికి దఖలు పడింది.

పని ఒత్తిడి కారణంగా అధికారులు ఈ ట్రైబ్యునల్‌ కమిటీలపై సరిగ్గా దృష్టి సారించడంలేదు. ఫిర్యాదులపై ఆలస్యంగా విచారణలు జరుగుతున్నాయి. వాయిదా ఇచ్చిన ఫిర్యాదుల గురించి ఆ తరవాత సరిగ్గా పట్టించుకోవడంలేదు. తీర్పు అమలుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమూ బాధితుల్లో నిరాశ నింపుతోంది. వయోవృద్ధుల సంక్షేమ సంఘాలు ఈ విషయాన్ని నేతలు, అధికారులకు తెలియజేస్తున్నా పరిస్థితి మారడంలేదు. ట్రైబ్యునల్‌ కమిటీల్లో కేసుల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. వాటి నిర్వహణకు నిధులను విడుదల చేయడంతోపాటు సత్వరం తీర్పులు వెలువడేలా చూడాలి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అసిస్టెంట్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ సమక్షంలో కమిటీలు వేసి, తీర్పుల అమలుపై పర్యవేక్షణాధికారం కల్పించాలి. బాధిత వృద్ధులకు అవసరమైతే వైద్యసేవలు చేయించడంతోపాటు, ట్రైబ్యునల్‌ కమిటీల వద్దకు రాలేని వారి కేసులను సుమోటోగా స్వీకరించి ఇంటివద్దనే విచారణ జరిపాలి. విచారణ సమయంలో అధిక సమయం వేచి ఉండే వయోధికులకు ఆహారం, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరమూ ఉంది.

తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వయసుడిగిన సమయంలో ఆస్తుల కోసమో, చాదస్తం అంటూనో ఇంటి నుంచి వారిని గెంటివేయడం లేదా నిరాదరించడం దారుణం. రేపు తమ పిల్లలూ అలాంటి పరిస్థితే కల్పిస్తే ఎలా ఉంటుందో ఇప్పటి బిడ్డలు ఆలోచించాలి. తల్లిదండ్రుల జీవితాలు కడదాకా ప్రశాంతంగా సాగాలంటే వారి పేరిట ఉన్న స్థిర చరాస్తులను తమ ఆధీనంలోనే ఉంచుకోవాలి. ఒకవేళ పిల్లలకు ఆస్తులను రాసిచ్చినా, తమను సరిగ్గా పట్టించుకోని సందర్భంలో వాటిని తిరిగి స్వాధీనం చేసుకొనేలా నిబంధన విధించాలి. అలాగే తల్లిదండ్రులు సైతం పిల్లలపై పెత్తనం చలాయించడం, కోడళ్లపై దురుసుగా ప్రవర్తించడం వంటివి మానుకోవాలి. ఓర్పు, నేర్పుతో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ లౌక్యంగా వ్యవహరిస్తే చాలావరకు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

- మేళం దుర్గాప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.