పరిశుభ్ర భారతమే పరమావధి

నేడు స్వచ్ఛభారత్‌ దినోత్సవం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు 2014 అక్టోబరు రెండో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ పథకం అమలు ప్రస్తుతం రెండోదశలో ఉంది. 2025 నాటికి అన్ని గ్రామాల్లో వ్యర్థాల సమర్థ నిర్వహణ, బహిరంగ మల విసర్జన నిర్మూలనలను సాధించాలని కేంద్రం నిర్దేశించుకొంది.

Published : 02 Oct 2022 00:49 IST

నేడు స్వచ్ఛభారత్‌ దినోత్సవం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు 2014 అక్టోబరు రెండో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ పథకం అమలు ప్రస్తుతం రెండోదశలో ఉంది. 2025 నాటికి అన్ని గ్రామాల్లో వ్యర్థాల సమర్థ నిర్వహణ, బహిరంగ మల విసర్జన నిర్మూలనలను సాధించాలని కేంద్రం నిర్దేశించుకొంది. ఆ లక్ష్యాలను సాధించాలంటే వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ ఎంతో వేగం పుంజుకోవాలి. ప్రజల్లో పెద్దయెత్తున అవగాహన కల్పించాలి.

దేశంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు పారిశుద్ధ్య నిర్వహణ కోసం కృషి చేస్తున్నాయి. అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు అంతంతమాత్రంగానే అమలవుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రత్యక్షమైన కరోనా మహమ్మారి వ్యాప్తితో పరిశుభ్రతకు ప్రాధాన్యం మరింత పెరిగింది. స్వచ్ఛభారత్‌ పథకంతో పారిశుద్ధ్య కార్యక్రమాల వ్యాప్తి వేగం పుంజుకొంది. దేశంలో నేటికీ ఘన, ద్రవ వ్యర్థాల ఏర్పాట్లు రెండూ ఉన్న గ్రామాలు 66వేలేనని స్వచ్ఛభారత్‌ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ సదుపాయాల కల్పనలో వెనకంజలో ఉన్నాయి. కొవిడ్‌ ప్రభావం కూడా బహిరంగ మల విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్‌) కార్యక్రమాల వ్యాప్తికి ఆటంకం కలిగించింది.

పునర్వినియోగం తప్పనిసరి

ఘన వ్యర్థాల నిర్వహణకు ఇంటింటి వ్యర్థాల సేకరణ, డంపింగ్‌ షెడ్‌ నిర్మాణంవంటి వాటిలో తెలంగాణ, తమిళనాడు, గోవా తదితర రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు ఘన వ్యర్థాల నిర్వహణ సదుపాయాల కల్పనలో వెనకబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాల్సి ఉంది. ఇంటివద్దనే వ్యర్థాలను తడి, పొడి రూపాల్లో వేరు చేయడం ద్వారా నిర్వహణ సులభతరమవుతుంది. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యర్థాలను సేకరించే యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలి. తడి వ్యర్థాలతో స్థానిక సంస్థలు కంపోస్ట్‌ను తయారుచేసుకునేలా చూడాలి. ప్లాస్టిక్‌ పునర్వినియోగం ఎంతో కీలకమైంది. ఆ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల హానికర ఉద్గారాలు విడుదలై, క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ తయారీని పూర్తిగా కట్టడిచేసి, ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, పునర్వినియోగానికి కేంద్రాలను నెలకొల్పి, స్థానిక యువతకు ఉపాధిని కల్పించవచ్చు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు వంద ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేశారు. వెదురు, మట్టితో చేసే పర్యావరణ హితకర ఉత్పత్తులను వినియోగంలోకి తేవాలి. ఇప్పటికీ చెప్పులు, టైర్లువంటి కొన్ని రకాల వ్యర్థాల శుద్ధి కోసం తగిన పద్ధతులు అందుబాటులో లేవు. రుతుస్రావ ప్యాడ్లు, పిల్లల డైపర్లు వంటి వ్యర్థాల సమర్థ నిర్వహణ అవసరం. ఇవి పరిమాణంలో చిన్నవే అయినా, వీటివల్ల కలిగే అనర్థాలు ఎక్కువ. సిరంజి, గ్లౌవుజులు, పీపీఈ కిట్లు వంటి వైద్య వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. చరవాణులు, కంప్యూటర్లు, టీవీలు వంటి ఎలెక్ట్రానిక్‌ వస్తువుల వ్యర్థాలు సైతం పర్యావరణ పరిరక్షణకు సవాలుగా మారుతున్నాయి. వీటి సమర్థ నిర్వహణకు సమగ్ర పద్ధతులను అభివృద్ధి చేయాలి. ఇళ్లలో వాడే కీటక నాశనులు, నేలను శుభ్రపరిచే యాసిడ్‌, దోమల మందు, రంగు డబ్బాల వంటి వ్యర్థాలపై కూడా దృష్టి సారించాలి.

ఆదాయ వనరుగా మారితేనే...

ద్రవ వ్యర్థాలు వెలువడిన చోటే వాటిని శుద్ధిచేసి, పునర్వినియోగించే పద్ధతులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇంట్లో వాడిన నీరు అక్కడే భూమిలోకి ఇంకేలా చేయడానికి ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత సౌకర్యవంతమైన విధానం. స్వచ్ఛభారత్‌ రెండోదశ కింద ఇప్పటివరకు దేశంలో 5.6లక్షల ఇంకుడు గుంతలను నిర్మించారు. నీరు నిల్వ లేకపోతే దోమలు, ఈగలు వృద్ధి చెంది, వ్యాధులను కలిగించే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. అది నీటి కొరతను ఎదుర్కొనేందుకూ ఉపయోగపడుతుంది. ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ లోపిస్తే పలునష్టాలను చవిచూడాల్సి వస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. పరిశుభ్ర భారత నిర్మాణం కోసం కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, రాష్ట్రాలు అదనపు కేటాయింపులు జోడించాలి. పట్టణ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, విద్య, వైద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, మహిళాభివృద్ధి తదితర శాఖల మధ్య సమన్వయలేమిని నివారించాలి. వ్యర్థాల నిర్వహణ నిరంతర ప్రక్రియ. దీన్ని సుస్థిరపరచేందుకు పకడ్బందీ చట్టం అవసరం. ప్రజల్లో చైతన్యం నింపి, వారిని కార్యోన్ముఖులను చేయాలి. అందుకు ప్రసార మాధ్యమాలను విరివిగా ఉపయోగించాలి. వ్యర్థాల నిర్వహణ స్థానిక సంస్థలకు ఆదాయ వనరుగా మారితేనే సుస్థిరత సాధ్యమవుతుంది. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వంతో పాటు, అందరూ బాధ్యత వహిస్తేనే పరిశుభ్ర భారతం సాకారమవుతుంది.

- శ్యామ్‌కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.