ఏ చీకట్లకీ ప్రస్థానం?

కలలో కనిపించిన లంకె బిందెలకోసం తెల్లారి ఊరంతా వెతికే తెలివిమంతులకు దేశంలో లోటులేదు. అజ్ఞానం, అయోమయం, అనుమానాలూ భయాలతో- ‘భవిష్యత్తు’కు మంచిదని ఎవరేది చెబితే అది గుడ్డిగా చేసేవారి సంఖ్య సైతం తక్కువేమీ కాదు.

Published : 02 Oct 2022 00:49 IST

లలో కనిపించిన లంకె బిందెలకోసం తెల్లారి ఊరంతా వెతికే తెలివిమంతులకు దేశంలో లోటులేదు. అజ్ఞానం, అయోమయం, అనుమానాలూ భయాలతో- ‘భవిష్యత్తు’కు మంచిదని ఎవరేది చెబితే అది గుడ్డిగా చేసేవారి సంఖ్య సైతం తక్కువేమీ కాదు. మానవాతీత శక్తులపై నమ్మకాలతో విలువైన సమయం, డబ్బు, కుటుంబ బంధాలు, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే అటువంటి వ్యక్తుల్లో శాస్త్రీయ స్ఫూర్తిని పెంచాల్సింది సర్కారీ యంత్రాంగమే. మరి చదవేస్తే ఉన్న మతి పోయినట్లు అధికారగణం బుద్ధి కూడా ఆ బురదలోనే మునిగితేలుతుంటే సమాజం గతేమవుతుంది? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కారాగారం బాధ్యుల అతితెలివిని గమనిస్తే- అదే ప్రశ్న ఉదయిస్తోంది.

‘మీ దగ్గర కొన్ని గంటల పాటు ఖైదీలుగా గడిపి వెళ్తాం’ అంటూ ఈమధ్య హల్ద్వానీ జైలుకు జనం తెగ వస్తున్నారట. ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించుకుని మరీ వాళ్లు కారాగారానికి విచ్చేస్తున్నారట. ఎందుకో ఏమిటోనని సిబ్బంది ఆరాతీస్తే- ‘మీ జాతకంలో జైలుయోగం ఉంది... కొద్దిసేపు కారాగారంలో ఉండి రండి... ఆ దోషం పోతుంది’ అని స్థానిక జ్యోతిష్కులు సెలవిస్తున్నారట. పాపం... తు.చ.తప్పకుండా వీళ్లు ఆచరిస్తున్నారు! ఆయా వ్యక్తులకు ధైర్యం చెప్పి సరైన మార్గంలో పెట్టాల్సిన అధికారులేమో ఆ పని మానేసి, తమ జైలులోని పాడుపడ్డ ఒక భాగానికి అత్యవసరంగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఎందుకో తెలుసా... జ్యోతిష్కుల సలహాల ప్రకారమో లేదా ‘జైలు అనుభవం’ కోసమో తమ దగ్గరికి వచ్చేవారి నుంచి అయిదు వందల రూపాయల వంతున వసూలుచేసి, ఒక రాత్రి అక్కడ వాళ్లకు విడిది కల్పిస్తారట మహానుభావులు! కారాగారాలన్నీ విచారణ ఖైదీలతో కిక్కిరి పోతున్నాయి మహాప్రభూ... లోపల మూలుగుతున్న బక్కప్రాణులకు గాలి కూడా ఆడటం లేదంటే పట్టించుకునే నాథుడు లేడు. కానీ, తగుదునమ్మా అంటూ జైలు గదులను అద్దెకిస్తామంటున్న పెద్దమనుషులను ఏమనాలి? విశ్వాసం వేరు... మౌఢ్యం వేరు. ఆ విషయం చెప్పకుండా జనంలోని ఛాందస ఆలోచనలను మరింతగా ఎగదోస్తూ, తమ ఓట్ల రాజకీయాలకు వాటినే పునాదులుగా చేసుకుంటున్న నేతాశ్రీలకు నేడు కొరతేమీ లేదు కదా! అధికార యంత్రాంగమూ ప్రజల అజ్ఞానంతో వ్యాపారం చేస్తే- దానికి మించిన దగుల్బాజీతనం మరొకటి ఉంటుందా?
‘మీ మూఢనమ్మకాలను ముందు వదిలించుకోండి... ధైర్యంగా ఉండండి... సత్యాన్ని తెలుసుకోండి, దాన్నే ఆచరించండి’ అని వివేకానందుడు ప్రబోధించారు. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవాతా వాదాన్ని, తెలుసుకోవాలనే తపనను పెంచుకుంటూ; సంస్కరణాసక్తితో మెలగడం భారతీయుల ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్దేశించింది. కానీ, ఏం లాభం? వాస్తవాలను కప్పెడుతూ లేనిపోని భ్రమలను సృష్టించడం, ప్రజలను వాటిలో ముంచి తమ పబ్బం గడుపుకోవడం కొందరికి అనాదిగా అలవాటైపోయింది. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల ఉద్ధృతితో అటువంటి వారి తలతిక్క ‘తరుణోపాయాల’కు ఇప్పుడు అడ్డూఅదుపూ ఉండటం లేదు. ‘ఏడు యాలకులను పసుపు గుడ్డలో చుట్టి, దిండు కింద పెట్టి పడుకోండి... మీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని యూట్యూబ్‌లో ఒకరు ప్రవచిస్తారు! ఆ మాత్రం యాలకులకు కరవొచ్చే కాబోలు- బ్యాంకుల పుట్టిముంచి మరీ విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ లాంటి వాళ్లు దేశం దాటి పారిపోయారు! ‘రాత్రి పూట రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో పట్టుకుని అయిదు నిమిషాలు నిలుచోండి... తెల్లారే సరికి శ్రీమంతులైపోతారు’ అని ఇంకొకరు సలహా దయచేస్తారు! ఉత్తి ఉప్పులోంచి కాసులు రాలితే- ఇక ఉద్యోగాలెందుకు, వ్యాపారాలెందుకు? అన్నీ మానేసి అందరూ అర్ధరాత్రి పూట లవణధారులైతే సరిపోతుంది కదా? ప్రభుత్వాధినేతలూ అదే పని చేస్తే- ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితరాల దగ్గర చెయ్యిచాచే తిప్పలూ తప్పుతాయి. జిల్లేడు చెట్టుకు బల్లితోకను కడితే ఎంతటి లాభం కలుగుతుంది, కలలో కుక్క కనిపిస్తే ఏమవుతుంది... ఇవిగో ఇలాంటివి ప్రబోధించే బోలెడు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటికి వీక్షణలూ భారీగానే ఉంటున్నాయి. మేకలు మడకలు దున్నుతాయి... ఎద్దులను వెళ్లగొట్టండని ప్రచారం చేసే స్వయంప్రకటిత మేధావులు పోనుపోను ఎక్కువ అవుతున్నారు. మాంసాహారం తినేవాళ్లు మనుషులు కారనే పిదపబుద్ధుల పెద్దమనుషులూ పోగుపడ్డారు. వాళ్ల చచ్చుపుచ్చు మాటలకు తలాడించే మనుషులూ పెరుగుతున్న కొద్దీ- దేశం మూఢాంధకార మధ్యయుగాల్లోకి మరలిపోతోంది. తమ మీద తమకు నమ్మకం లేక అదృష్టం మీద ఆధారపడే వాళ్లు జీవితంలో ఎదగలేరు. ప్రశ్నించడం, సమాధానాల అన్వేషణలో భాగంగా సరికొత్త జ్ఞానాన్ని అలవరచుకోవడం, అసంబద్ధ అంశాలను విడిచిపెట్టడం, పిల్లలకూ అవే విలువలను నేర్పడం- ఇదీ బతుకులను బాగుచేసుకునే మార్గం. దానివైపు కన్నెత్తి చూడకుండా, 5జీ రోజుల్లోనూ పైత్యకారుల పిచ్చి సలహాలకు పక్కతాళం వేస్తే ఏమొస్తుంది... మిగిలిన దేశాల ముందు నవ్వులపాలు కావడం తప్ప!

ప్రకృతి వింతలకు పరలోకాల్లో కారణాలు వెతకడం- ఆదిమ మానవుల అమాయకత్వం. ఆ యుగాలను దాటి వచ్చిన మానవజాతి నేడు కడలి లోతుల్లోకి తొంగిచూస్తోంది. ఖగోళ రహస్యాల ఛేదనలోనూ మున్ముందుకు దూసుకుపోతోంది. కానీ, ‘విశ్వగురువు’గా నిలవాలని తపిస్తున్న భారతదేశంలో ఏం జరుగుతోంది? చేతబడి, బాణామతి, చిల్లంగుల పేరిట నోరూవాయి లేని వారిని నిలువునా తగలబెడుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని మరచిపోయి, క్షుద్రవిద్యలతో తమకు అపకారం తలపెట్టారంటూ మనుషులను దారుణంగా కొట్టి చంపుతున్నారు. 2001-2014 నడుమ దేశవ్యాప్తంగా 2290 జీవితాలు అలా బలైపోయాయి. జాతీయ నేరగణాంక సంస్థ లెక్కల ప్రకారం 2017-2021 మధ్యకాలంలో 394 నిండు ప్రాణాలను మూఢనమ్మకాలు పొట్టనపెట్టుకున్నాయి. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, బిహార్‌ తదితరాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి హత్యలు చోటుచేసుకుంటున్నాయి. చేతబడి చేసిందని కన్నతల్లిని చంపే కొడుకు, అదృష్టం కలిసి వస్తుందని కడుపున పుట్టిన బిడ్డలను ఘోరంగా హతమార్చే తల్లిదండ్రులు, మోక్షం వస్తుందని ఆత్మహత్యలకు ఒడిగట్టే మనుషుల కథనాలు, ఉన్నత విద్యావంతుల్లోనూ పొంగిపొర్లుతున్న అంధ విశ్వాసాలు... రోజురోజుకు మన సమాజం ఎంత వెనక్కి నడుస్తోందో చాటి చెబుతున్నాయి. మనుషుల మెదళ్లలో పేరుకుంటున్న చెత్తను వదిలించడం- కలకత్తా హైకోర్టు గతంలో వ్యాఖ్యానించినట్లు, చట్టాలూ శిక్షలతోనే సాధ్యపడదు. హేతుబద్ధమైన విద్య, విజ్ఞానశాస్త్ర వెలుగుల పరివ్యాప్తితోనే ఆ చీకట్లు చెదిరిపోతాయి. దేశం భవిత కోసమైనా ప్రభుత్వాలు అందుకు నడుంకడతాయా?

- శైలేష్‌ నిమ్మగడ్డ

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని