‘పీఎం శ్రీ’తో ప్రయోజనమెంత?

దేశీయంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్రం పీఎం శ్రీ పథకాన్ని ప్రకటించింది. తద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేలిమి విద్యను అందిస్తామంటున్నారు. అయితే, ప్రభుత్వ బడులను అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్యలపై కేంద్రం ముందుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

Published : 03 Oct 2022 00:48 IST

దేశీయంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్రం పీఎం శ్రీ పథకాన్ని ప్రకటించింది. తద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేలిమి విద్యను అందిస్తామంటున్నారు. అయితే, ప్రభుత్వ బడులను అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్యలపై కేంద్రం ముందుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ప్రభుత్వ బడులను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ‘అభివృద్ధి చెందుతున్న భారత్‌ కోసం ప్రధాన మంత్రి పాఠశాలలు’ (పీఎం శ్రీ) పథకాన్ని ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 14,500 పాఠశాలలను ఆధునికీకరించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి వాటి ద్వారా అత్యుత్తమ విద్యను అందించనున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ పథకానికి అయిదేళ్లలో రూ.27,360 కోట్లు కేటాయించనున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి సీనియర్‌ సెకండరీ విద్య దాకా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థల నిర్వహణలోని బడులను ఈ పథకానికి ఎంపిక చేస్తారు. దాదాపు 18 లక్షల మంది పిల్లలు పీఎం శ్రీ ద్వారా ప్రయోజనం పొందుతారంటున్నారు. ఈ పథకానికి ఎంపిక చేసిన బడుల్లో ప్రయోగశాలలు, స్మార్ట్‌ క్లాస్‌రూములు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటివి జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యను కేంద్రం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో పీఎం శ్రీ పథకం ఎంత వరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సమస్యల మేట
దేశీయంగా ప్రభుత్వ పాఠశాల విద్యను ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కొరత, సరిపడా ఉపాధ్యాయుల లేమి, డ్రాపౌట్లు, చదువులో సరైన ప్రమాణాలు లోపించడం వంటి వాటిపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పది లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రెండేళ్ల క్రితం కేంద్రం చెప్పింది. ప్రైవేటు బడులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైనదానికన్నా సగం మంది ఉపాధ్యాయులే పనిచేస్తున్నట్లు ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యుడైస్‌ ప్లస్‌) నివేదిక సైతం వెల్లడిస్తోంది. సరిపడా టీచర్ల లేకపోవడం పిల్లల అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసర్‌ నివేదిక ప్రకారం అయిదో తరగతి పిల్లల్లో 44శాతం కనీసం రెండో తరగతి పాఠ్యపుస్తకాలు చదివే స్థితిలో లేరు. ఎంతోమంది విద్యార్థులు చిన్నచిన్న లెక్కలనూ చేయలేకపోతున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకమూ సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో నాసిరకం మధ్యాహ్న భోజనంవల్ల దేశవ్యాప్తంగా 979 మంది పిల్లలు అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో పిల్లల భోజనం కోసం ప్రభుత్వం అందించే అరకొర నిధులు ఏమాత్రం చాలవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలను అన్వేషించకుండా కొత్తగా పీఎం శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం ఆరు దశాబ్దాల క్రితం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దేశీయంగా పనిచేస్తున్న 1247 కేంద్రీయ విద్యాలయాల్లో పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు కేంద్రం గతంలో వెల్లడించింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చెబుతున్న పాఠశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పీఎం శ్రీ ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

అసమానతలకు అవకాశం
దేశంలోని ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సమస్యలతో కునారిల్లుతున్న సమయంలో కేవలం కొన్ని బడుల కోసం పీఎం శ్రీ తేవడం ఎంతవరకు సబబని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశీయంగా పది లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం చర్యలను బట్టి చూస్తే వాటన్నింటినీ ఆధునికీకరించడానికి మరో వందేళ్లు పడుతుందని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో విద్యావ్యవస్థ ఆన్‌లైన్‌కు మళ్ళింది. ఆ విధానంపై చాలామంది ఉపాధ్యాయులకు అవగాహన లేక పిల్లలకు సరిగ్గా పాఠాలు బోధించలేకపోయారు. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు పిల్లలకు సరైన బోధన కొనసాగేలా ఉపాధ్యాయులకు డిజిటల్‌ తరగతులపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశీయంగా ప్రతి పిల్లవాడికి ఉత్తమ విద్య అందినప్పుడే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. దాన్ని విస్మరించి కేవలం కొన్ని బడులతో కొందరు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం అంతిమంగా విద్య విషయంలో తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. కేంద్రం ఈ విషయాన్ని గుర్తించి దేశీయంగా పాఠశాల విద్య సంస్కరణలకు నడుం కట్టాలి. దశాబ్దాలుగా ప్రభుత్వ బడులను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టాలి.

- దివ్యాన్షశ్రీ

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts