నేతిబీర రాజకీయం

‘రండి... నేడే చూడండి... ఆలసించిన ఆశాభంగం... గొప్ప సస్పెన్స్‌ థ్రిల్లర్‌...’ ‘ఏమిట్రా... పండగ పూట పొద్దున్నే పొలికేకలు పెడుతున్నావు?’ ‘నీకు తెలియనిదా బాబాయ్‌... పురాతన పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించే నా గోలంతా... గొప్ప సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లాగా రూపొందుతోంది! అది పండగపూట....

Updated : 04 Oct 2022 01:31 IST

‘రండి... నేడే చూడండి... ఆలసించిన ఆశాభంగం... గొప్ప సస్పెన్స్‌ థ్రిల్లర్‌...’
‘ఏమిట్రా... పండగ పూట పొద్దున్నే పొలికేకలు పెడుతున్నావు?’
‘నీకు తెలియనిదా బాబాయ్‌... పురాతన పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించే నా గోలంతా... గొప్ప సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లాగా రూపొందుతోంది! అది పండగపూట రిలీజయ్యే సినిమాలను మించి ప్రేక్షకుల ఆదరణ సాధిస్తుందని నా నమ్మకం’
‘అదే మీతో వచ్చిన కష్టం! ఊహల్లోనుంచి బయటికి రారు. వందిమాగధులు, బాజా బజంత్రీలు, తాన తందానాలూ-  ఇలా అందరూ తమచుట్టే తిరుగుతున్నారన్న భ్రమలోంచి రాజ కుటుంబం బయటికి రాలేకపోతోంది. నువ్వు చెప్పే ఎన్నికల భారతం ఇక్కడ ఎవరికి తెలియదని, వచ్చి చూడండహో అంటూ అంతలా అరుస్తున్నావు? అయినా, కట్టేసిన గేదెకు కాపలాగా ఎవరొస్తారు?’
‘దేశంలో అంతర్గత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యాన్నిచ్చే ఏకైక పార్టీగా, అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తోంటే- అదేమిటి బాబాయ్‌ అంత మాటనేశావు? జీవితకాల అధ్యక్షులను ఎన్నుకొనే పార్టీలకంటే... సొంత ఆస్తుల్లాగా తరతరాలకు పార్టీ అధికారాలను అప్పగించే పార్టీలకంటే... ఇది ఎంతో నయం కదా!’
‘అవునులేరా... ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు అంతా కలిసి, అధికారమంతా అధిష్ఠానానికి కట్టబెడుతూ చేసే ఏకవాక్య తీర్మానాలూ, సీల్డ్‌ కవర్‌ రాజకీయాలూ- ఇవేకదా అన్ని పార్టీల్లోనూ అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనాలు! అలాంటి ఏకవాక్య తీర్మానం చేయించలేకే చతికిల పడ్డాడు ముఖ్యమంత్రి అశోక్‌ సారు. రాజకీయాలంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కాదుకదా మూన్‌లైటింగ్‌ చేయడానికి! ఒక మనిషికి ఒక పదవి రావడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో అవ్వా బువ్వా రెండూ కావాలనుకోవడం అత్యాశ కాక మరేమిటి? అసలా అధ్యక్ష పదవి నామినేషన్‌ పత్రాలు, ఎన్నికల్లో ఓటువేసే ఓటర్ల జాబితా... సప్తసముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలక మాదిరిగా... ఎవరికీ అందని విధంగా ఉంచి, దాన్నే గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ అని గొప్పలు పోతుంటే- చూసేవాళ్లు వినేవాళ్లు వెర్రివాళ్లా?’
‘ఏమి చెప్పమంటావులే బాబాయ్‌ ఆ గెహ్లోత్‌ గురించి... వెనకటికొకడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటే... మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడట! గెహ్లోత్‌ కూడా అలాగే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామంటే, ఫలానా మనిషికి సీఎం పదవి ఇవ్వవద్దని అంటూ, ఆయన చికాకుపడి అందరినీ చికాకుపరచి, చివరికొచ్చేసరికి రాజమాత దర్శనం సైతం దొరక్క, ఉన్న పరువు పోగొట్టుకొని తన స్వరాష్ట్రానికి తిరిగి వెళ్ళేసరికి అసలుకే ఎసరు వచ్చేలా ఉంది’
‘అయినా నాకు తెలియక అడుగుతాను... అధికారమంతా రాజకుటుంబం చేతిలో కేంద్రీకృతమైనప్పుడు ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరైతే ఏముంది! మునుపు మౌన ప్రధాని ఉన్నప్పుడు, తనకు నచ్చని ఆర్డినెన్స్‌ను ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ చింపిపారేశారు కదా యువరాజు రాహుల్‌. పార్టీలో నాయకులపై ఎంత ప్రగాఢమైన నమ్మకం లేకపోతే, రాజకుటుంబం మొత్తం ఎన్నికల బరిలోకి దిగకుండా మిన్నకుండిపోతుందంటావ్‌? యువరాజావారు ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటున్నారు... కలలో పాలు తాగడానికి గ్లాసు కంచుదైతేనేమి, బంగారంతో చేసినదైతేనేమి!’
‘అదే కదా బాబాయ్‌ పురాతన పార్టీ ఖర్మ. అకటా, వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారం అన్నట్టు ఆ కుటుంబానికి సలహాలు ఇచ్చేవాళ్లు సాంతంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. గెలవనిచోట్ల ఎలానూ విజయం దక్కడంలేదనుకో... గెలిచినచోట్లా గోవాలో జరిగినట్టుగా బొమ్మ తిరగబడుతోంది! అధికారం రాకపోయేసరికి, ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసేలా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. మహారాష్ట్రలో తిరుగుబాటు చేసి పోయినవాళ్లు అంతటితో ఊరుకోక... తమదే అసలు పార్టీ, దాని గుర్తూ ఆఫీసులూ ఆస్తులూ తమకే చెందాలని పట్టుపడుతున్నారు. ఏతావతా తేలేదేమిటంటే, తరాలపాటు పార్టీని ఒకే కుటుంబం గుప్పిట్లోనే ఉంచుకోవాలనుకోవడం, నీళ్ల మూట నెత్తిన మోయడమే’
‘బాగా చెప్పావురా అబ్బాయ్‌... మన పొరుగు రాష్ట్రంలో అమ్మ పెట్టిన రెండాకుల పార్టీ పరిస్థితి ఏమైంది? వారసులులేక ఆకులు విడిపోతోంటే, వాటిని కలిపి కుడదామని పిన్నమ్మ ప్రయత్నిస్తోంది... ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఇంతే మన దేశంలో. అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ, అబ్బాయిలు బాబాయిలు-  ఇలా బంధువుల మధ్యే బంతాట ఆడుకుంటుంది అధికారం. మన పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం నేతి బీరలో నెయ్యి చందం! అంచేత నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆయాసం తెచ్చుకోకు... ఇంటికి వచ్చిన చుట్టాలతో కలిసి పండగ చేసుకో... అది నీకూ మన ప్రజాస్వామ్యానికీ మంచిది!’

- శారద

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని