ఉపాధి వేటలో డిజిటల్‌ సాయం

ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల్లో విహరించడం కొందరికి ఆటవిడుపు. మరికొందరికి వ్యసనం.  ఇంకొంత మందికి నైపుణ్య శిక్షణా వేదికలుగానూ అవి నిలుస్తున్నాయి.  పలు రకాల సామాజిక డిజిటల్‌ వేదికలు అవసరమున్న వారికి ఉపాధినీ అందిస్తూ, అండగా నిలుస్తున్నాయి.

Published : 05 Oct 2022 00:44 IST

ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల్లో విహరించడం కొందరికి ఆటవిడుపు. మరికొందరికి వ్యసనం.  ఇంకొంత మందికి నైపుణ్య శిక్షణా వేదికలుగానూ అవి నిలుస్తున్నాయి.  పలు రకాల సామాజిక డిజిటల్‌ వేదికలు అవసరమున్న వారికి ఉపాధినీ అందిస్తూ, అండగా నిలుస్తున్నాయి. ఆధునిక తరం ఉద్యోగాలు సామాజిక మాధ్యమాల ఆధారంగానే సాగుతున్నాయి.

ఇటీవలి కాలందాకా ఉద్యోగాల వేటకు, కెరీర్‌ నిర్మాణానికే సాయ పడతాయనుకున్న సామాజిక మాధ్యమాల పరిధి ఇప్పుడు మరింతగా విస్తరించింది. ఒక వ్యక్తికి ఉన్న అదనపు నైపుణ్యాన్ని డిజిటల్‌ వేదికల ద్వారా పదిమందికీ పరిచయం చేయడమే కాకుండా, ఆర్థికపరమైన వనరులుగా వాటిని మార్చుకొనే అవకాశం దక్కుతోంది. మార్కెట్‌ వ్యూహ నిపుణులు వినియోగదారులకు చేరువయ్యేందుకు, మెరుగైన సేవల్ని అందజేసేందుకు డిజిటల్‌ వేదికలనే ఆధారంగా చేసుకుంటున్నారు. వాటిద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తూ, విక్రయాలు సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రతిభా సమూహాల సంఖ్య పెరుగుతోంది. ఒకే తరహా కెరీర్‌ ఆసక్తులు కలిగిన వారంతా సమూహంగా ఏర్పడి ఆలోచనలను పంచుకుంటున్నారు. అవకాశాలను పెంచుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో ఏర్పడే ఇలాంటి సమూహాల్లో కొన్ని కంపెనీలు జాబ్‌ అవకాశాల ప్రకటనలనూ ఉంచడం వల్ల ఉద్యోగార్థులకు, యజమానులకూ పని తేలికవుతోంది.

అవకాశాలు అపారం
తాత్కాలిక ఉపాధిని ఆశించే ‘గిగ్‌ వర్కర్ల’కు సైతం విభిన్న రీతుల్లో పనిచేసే యాప్‌ల వంటి డిజిటల్‌ వేదికలు ఊతంగా నిలుస్తున్నాయి. 2020-21లో 77 లక్షలు ఉన్న గిగ్‌ వర్కర్లు 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరవచ్చని నీతి ఆయోగ్‌ అంచనా. పెరిగిపోతున్న ‘గిగ్‌’ శ్రామిక శక్తి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక యువజనాభా, కోట్లసంఖ్యలో శ్రామిక శక్తిని కలిగి, వేగవంతంగా సాగుతున్న పట్టణీకరణ, స్మార్ట్‌ఫోన్‌ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను విస్తృతంగా అందిపుచ్చుకొంటున్న భారత్‌- ఈ ఆర్థిక విప్లవంలో కీలక భూమిక పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇండియాకు సంబంధించిన ప్రశంసనీయ, సానుకూల పరిణామం- మహిళల భాగస్వామ్యం. మహిళలు తమ విద్యాభ్యాసం పూర్తయ్యాక, వివాహాల తరవాత ఇలాంటి వేదికల ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. అధిక నైపుణ్యం కలిగిన వారికి తగిన ఉద్యోగావకాశాలు దక్కుతుండగా, తక్కువ నైపుణ్యం ఉండేవారికి సైతం అవకాశాలు సమృద్ధిగా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

రాబోయే కాలంలో డిజిటల్‌ పరివర్తన అన్ని రంగాలపైనా ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో సరికొత్త పని సంస్కృతి అవసరాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక, సాంకేతికేతర నిపుణులు తమ పనితీరును మెరుగు పరచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. సృజనాత్మక రీతిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను మేళవించి వివిధ అంశాలను వినోదాత్మకంగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఉండే యూట్యూబర్లు, బ్లాగర్లు, కంటెంట్‌ సమన్వయకర్తలకు అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కోట్ల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులతో కళకళలాడే మన దేశ విపణిలో స్థానికతను జోడిస్తూ సృజనాత్మక అంశాలను తీర్చిదిద్దే కంటెంట్‌ సృష్టికర్తలకు అవకాశాలు దండిగా అందివస్తున్నాయి. సుదూరంగా, ఇళ్లలోనే ఉంటూ, అవసరమైన పనులు చేసి పెట్టే నిపుణులకూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఎడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లోని డిజిటల్‌ వేదికలు, అంకురాలు అవకాశాల గనులుగా మారాయి. గణనీయమైన విస్తృతి రేటుతో దేశంలో ప్రజాదరణ కలిగిన డిజిటల్‌ వేదికగా పేరొందిన యూట్యూబ్‌ను ఆసరాగా చేసుకొని ఉపాధి వెదుక్కొంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి వారిలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. పలువురు గృహిణులు తమలో నిగూఢంగా దాగి ఉన్న నైపుణ్యాలకు సానపట్టి, వాటిని యూట్యూబ్‌ ద్వారా సృజనాత్మక రీతిలో ప్రపంచానికి అందిస్తూ, ఉపాధినీ కల్పించుకొంటున్నారు. ఇందులో ప్రాంతీయ, గ్రామీణ ఆహార పదార్థాలు, స్థానిక ముద్రతో కూడిన ప్రత్యేక వంటకాలు, విశేషాలు, ఉత్పత్తుల పరిచయకర్తలు వంటివారెందరో ఉంటున్నారు.

చేయాల్సిందేమిటి?
డిజిటల్‌ వేదికల ద్వారా అపారంగా ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేలా యువతకు, నిరుద్యోగులకు, మహిళలకు, దివ్యాంగులకు వివిధ రంగాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణ అందించాలి. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు, కార్పొరేట్‌ సంస్థలు, సామాజిక మాధ్యమ దిగ్గజాలు ముందుకురావాలి. ఈ రంగంలో చిన్న, మహిళా వ్యాపారులను మరింతగా ప్రోత్సహించాలి. వైకల్యంతో ఇబ్బంది పడేవారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాల్ని నేర్పించాలి. గిగ్‌ వర్కర్ల వంటివారు విధినిర్వహణలో భాగంగా ప్రమాదాలకు లోనైతే బీమా సదుపాయం కల్పించడం, అనిశ్చిత పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా అండగా నిలవడం అవసరం. చెల్లింపుతో కూడిన అనారోగ్య సెలవులు, ఆరోగ్య సంరక్షణ, వృత్తిపరమైన వ్యాధులు, పదవీ విరమణ సంబంధిత ప్రయోజనాలు తదితర అంశాలపై కసరత్తు జరిపి, వారికి పలువిధాల రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సరైన వేతన చెల్లింపులు, ఉద్యోగ భద్రత, సరళమైన పని గంటలు వంటివాటిని అందించే విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలి.

- డి.శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.