అసలైన దసరా!

‘విజయీభవ... దిగ్విజయీభవ’ ‘ఏమిటీ... పండగ పూట విజయ వచనాలు వల్లిస్తున్నావు?’ ‘దసరా అంటేనే గెలుపునకు ప్రతీక కదా... మన నాయకుల పుణ్యమా అని చుట్టుముట్టిన ఇక్కట్లపై విజయం సాధించాలని ఆ దుర్గమ్మను తలచుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొంటున్నా’...‘సొంతడబ్బాలు డబడబలాడించడంలో జీవితకాల నైపుణ్యం ఒంటపట్టించుకున్న

Published : 05 Oct 2022 00:44 IST

‘విజయీభవ... దిగ్విజయీభవ’
‘ఏమిటీ... పండగ పూట విజయ వచనాలు వల్లిస్తున్నావు?’

‘దసరా అంటేనే గెలుపునకు ప్రతీక కదా... మన నాయకుల పుణ్యమా అని చుట్టుముట్టిన ఇక్కట్లపై విజయం సాధించాలని ఆ దుర్గమ్మను తలచుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొంటున్నా’

‘సొంతడబ్బాలు డబడబలాడించడంలో జీవితకాల నైపుణ్యం ఒంటపట్టించుకున్న మన నాయకులు, జనాలను వారి ఖర్మానికి వదిలేసి, ఆఖరికి ఎవరి వెన్ను వారు తట్టుకొని బతుకుపోరు సాగించే పరిస్థితి తెచ్చారు... నేతలు ఎంతకైనా సమర్థులే!’  
‘అదికాదు... ఒకరిది భారత్‌ను జోడించే కృషి... ఇంకొకరిది కొత్త పొత్తుల పొద్దుపొడుపు... అధికార పక్షాలది పక్కపార్టీల వాళ్లను భయపెట్టో, బుజ్జగించో ఆకర్షించే లక్ష్యం! ఎవరి ఆశయాలు వారివి... ఎవరి ఆరాటాలు వారివి... ఒకరిది అస్తిత్వపు పోరు... ఒకరిది విస్తరణ జోరు... కానీ ప్రజల ఇక్కట్లే ఎవరికీ సరిగ్గా పట్టడంలేదు... పట్టించుకుంటున్నట్లు నటిస్తున్నారంతే!’

‘మన సూపర్‌ హీరోలు, యాక్టింగ్‌లో కాకలు తీరిన సినీ తారలు... రాజకీయ నేతల నట చాతుర్యం ముందు దూదిపింజలతో సమానమని అందుకే కదా నేను కితాబిస్తుంటాను!’

‘అప్పట్లో మహిషాసురాది రాక్షసులకు ఏ వరం దక్కినా... నేరుగా స్వర్గాధిపతి దేవేంద్రుడిపైనే గురి! ఇక మన నాయకులకు అధికారం వచ్చింది మొదలు ఓటేసి నెత్తిపై పెట్టుకున్నారన్న కృతజ్ఞత అయినా లేకుండా అడ్డగోలు పన్నులు, ధరల దరువులతో సామాన్యులను పీడించడమే పని! ఎప్పుడూ దోపిడిలో ఆకాశానికి ఎగబాకే ఆలోచనే. వాళ్లకు మన అధికారులూ తోడు. దేవేంద్రుడిదీ, ఓటర్లదీ ఒకటే బాధ. కాకపోతే సురపతి మొర వినడానికి త్రిమూర్తులున్నారు. మరి ప్రజాస్వామ్యాధిపతులైన జనాలకు భూలోకంలో దిక్కెవరు?’

‘ఇంకెవరూ... ఆ భగవంతుడే దిక్కు. తన శాఖలో అవినీతికి అర్రులు చాస్తున్న అధికారులను దొంగలతో పోల్చారు కదా బిహార్‌ తాజా మాజీ వ్యవసాయ మంత్రి! తనను ఆ బృందానికి నాయకుడిగానూ అభివర్ణించుకున్నారు. ఆయనపైనా గుట్టలుగా చోర సర్దార్లు పోగుపడ్డారన్నారు. వారి బారినుంచి జనాలు తప్పించుకోవడం సాధ్యమేనా?’

‘నీకొక విషయం తెలుసా... రాత్రిళ్లు ప్రతి స్టేషన్‌లో ఆగుతూ, గమ్యస్థానం ఎప్పుడు చేరుతుందో తెలియకుండా జనాల్ని విసిగించి, దొంగలు దోచుకోవడానికి బోలెడు అవకాశం కల్పించే ప్యాసింజర్‌ రైలును అప్పట్లో దొంగలబండి అనేవారు. ఇప్పుడు మన దేశం పరిస్థితీ అంతే! పేరుకేమో భారీగా కనిపించే రైలులా ఇండియాది అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ... పైకి అంతా అద్భుతంగానే ఉంటుంది... లోపలే ఈసురోమనే జనాలు, చేతివాటం ప్రదర్శించే నేతలు, అధికారులు...’

‘సరిగ్గా చెప్పావు... ఎన్నికలు వస్తున్నాయంటే చాలు... మీరు దొంగలంటే మీరు దొంగలని అధికార ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడతారు కదా... అక్కడే అర్థం కావడంలేదా దేశం దుస్థితి ఎలా ఉందో! అన్నట్టూ, అరిషడ్వర్గాలను జయించడమే విజయదశమి పరమార్థమట. మన నేతలు కష్టపడి మరీ కొన్నింటిపై మనం విజయం సాధించేలా చేస్తున్నారు... కొన్నింటిని వారే పెంచి పోషిస్తున్నారు’

‘అదెలా?’
‘చుక్కలను తాకుతున్న ధరల వల్ల నచ్చింది కొనలేక, తినలేక ప్రజలు కోరికలు చంపేసుకుంటున్నారా! పాలకుల పనితీరును ప్రశ్నిస్తే కేసులు, జైళ్లు అంటూ అన్యాయాలపై ప్రజల ఆవేశాన్ని ఆదిలోనే అంతం చేసేస్తున్నారా! అంతర్జాతీయ ర్యాంకులన్నింటిలో భారతావని నేల చూపులు చూస్తుంటే... నిజమైన అభివృద్ధి ఎక్కడుందీ... మనం గర్వపడటానికి ఏముందీ! ఇక ప్రజలను కులాలు మతాల పేరుతో విభజించి వారిమధ్య ద్వేషాలకు ఆజ్యం పోస్తూ మాత్సర్యాన్ని మాత్రం బాగా పెంచి పోషిస్తున్నారు మన నాయకులు!’

‘అంతా రాజకీయ స్వార్థమే తప్ప... ప్రజాప్రయోజనం ఏమీ లేదు! ‘దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్ద మనుషుల నుంచి... పెద్ద పులుల నుంచి... నీతుల రెండు నాలుకలు సాచే నిర్హేతుక కృపా సర్పాల నుంచి...’ అన్నారు ప్రసిద్ధ కవి దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌. ఆ మాటలు దేశంలో సార్వకాలికాలు అయిపోయాయి’

‘అంతే కదా మరి! కానీ, ఈ నాయకుల ఆగడాలను సహిస్తూ, వ్యవస్థ దుస్థితిని చూసి విలపిస్తూ ఇలా భారంగా రోజులు నెట్టుకుపోవాల్సిందేనా?’

‘అసురులకు వరాలిచ్చిన దేవతలే పరిస్థితి చేయిదాటినప్పుడు నిర్దాక్షిణ్యంగా వారిని నిర్జించారు. నాయకులకు ఓట్లేసి అందలాలు ఎక్కిస్తున్న జనావళికి... స్వార్థం తలకెక్కిన  నేతలను గద్దెపై నుంచి లాగి పడేయగల శక్తీ ఉంది. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే జనస్వామ్యానికి అసలైన దసరా... ఏమంటావు?’

- వేణుబాబు మన్నం

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts