చిరుధాన్యాలతో ఆహార భద్రత

పర్యావరణ మార్పులు, అధికమవుతున్న ఉష్ణోగ్రతలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయి. చిరుధాన్యాల సాగును దానికి మంచి పరిష్కారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి సాగువల్ల పర్యావరణానికీ ఇబ్బంది ఉండదని విశ్లేషిస్తున్నారు...

Published : 07 Oct 2022 01:26 IST

పర్యావరణ మార్పులు, అధికమవుతున్న ఉష్ణోగ్రతలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయి. చిరుధాన్యాల సాగును దానికి మంచి పరిష్కారంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి సాగువల్ల పర్యావరణానికీ ఇబ్బంది ఉండదని విశ్లేషిస్తున్నారు.

వాతావరణ మార్పులు అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరవుల వల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. భారత వ్యవసాయ రంగమూ వాతావరణ సంక్షోభ తీవ్రతను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో చిరు ధాన్యాల సాగును విస్తృతంగా చేపట్టడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభాకు పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం చిరు ధాన్యాల సాగును భారీగా చేపట్టాలని చెబుతున్నారు. దానివల్ల రైతులు మంచి ఆదాయం పొందడానికి అవకాశం లభిస్తుంది. మిగతా పంటలతో పోలిస్తే చిరుధాన్యాలకు పెట్టుబడి వ్యయం తక్కువ. వర్షాభావ ప్రాంతాల్లోనూ అవి పండుతాయి. ఆహార భద్రతతోపాటు పోషకాల పరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న చిరుధాన్యాల సాగును పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం 2018ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగెలు, ఊదలు, అరికెలు వంటివి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల్లో రైతులకు ప్రధానమైన పంటలు. అవి అధిక స్థాయిలో కాల్షియం, ఇనుము, జింక్‌, పొటాషియం తదితర పోషకాలను కలిగి ఉంటాయి. వాటివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటివి అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

హరిత విప్లవం తరవాత వరి, గోధుమ, పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న వంటివి భారత్‌లో ముఖ్య పంటలుగా మారాయి. అయిదు దశాబ్దాలుగా దేశీయంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వరి, గోధుమలతో పోలిస్తే అతి తక్కువ నీటితోనే తృణధాన్యాలను పండించవచ్చు. భారత్‌లో దాదాపు సగం వ్యవసాయ భూములు వర్షాధారమే. అవి తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలం. పర్యావరణానికీ చిరుధాన్యాల సాగు చాలా అనుకూలం. వరి వల్ల మీథేన్‌ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. ఫలితంగా భూతాపం పెరుగుతోంది. తృణధాన్యాలు ఆ సమస్యకు పరిష్కారంగా నిలుస్తాయి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు అందుబాటులోకి రావడం వల్ల చిరుధాన్యాల వినియోగం తగ్గింది. ఇటీవలి కాలంలో తృణధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఫలితంగా వాటికి గిరాకీ ఇనుమడిస్తోంది. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలకూ డిమాండు క్రమంగా అధికమవుతోంది. ఆహార భద్రతకు చిరుధాన్యాల సాగును స్థిరమైన పరిష్కారంగా గుర్తించి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆహార భద్రత, పోషకాల పరంగా చిరుధాన్యాల ప్రాధాన్యంపై అవగాహన పెంచాలని, వాటిపై పరిశోధనలను ప్రోత్సహించాలని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నిర్ణయించింది. ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలోని భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) సైతం అధిక దిగుబడినిచ్చే జొన్న సహా వివిధ రకాల వంగడాలను అభివృద్ధి చేసింది.

ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలను భారత్‌ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో 20శాతం, ఆసియాలో 80శాతం వాటాను ఇండియా కలిగి ఉంది. అంతర్జాతీయంగా చిరుధాన్యాలకు డిమాండ్‌ పెరుగుతున్నందువల్ల ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన ఉత్పత్తులు, వాటికి విలువజోడింపు, మార్కెటింగ్‌ వంటివాటిని బలోపేతం చేయాలి. ముఖ్యంగా రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాలను పెంచడం తప్పనిసరి. మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వాలే అన్నదాతల నుంచి తృణధాన్యాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ చిరుధాన్యాలను చేర్చాలి. అంగన్‌వాడీల్లో, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వాటిని విధిగా చేర్చాలి. దానివల్ల చిన్నారులకు పోషకాహారం లభిస్తుంది. దేశానికి ఆహార భద్రతతోపాటు పర్యావరణ పరిరక్షణా ముఖ్యమే. ఆ రెండింటి మధ్యా సమతౌల్యం అవసరం. దానికి అనుగుణంగా మన ప్రాధాన్యం మార్చుకొని చిరుధాన్యాల సాగును మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది.

- సతీష్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.