ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

వన్యప్రాణులు ఆవరణ వ్యవస్థలో కీలకమైన భాగం. జీవవైవిధ్య నిర్వహణలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి సమతౌల్యాన్ని, స్థిరత్వాన్ని కల్పిస్తాయి. అలాంటి జంతువులను సంరక్షించడంలో ప్రభుత్వాల తడబాట్లు... వాటి ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల...

Published : 07 Oct 2022 01:26 IST

వన్యప్రాణులు ఆవరణ వ్యవస్థలో కీలకమైన భాగం. జీవవైవిధ్య నిర్వహణలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి సమతౌల్యాన్ని, స్థిరత్వాన్ని కల్పిస్తాయి. అలాంటి జంతువులను సంరక్షించడంలో ప్రభుత్వాల తడబాట్లు... వాటి ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా అడవుల్లో జంతుజాల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

ప్రపంచంలోకెల్లా అధిక జీవజాతులను కలిగిన బ్రెజిల్‌ జీవవైవిధ్యంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. ఏనుగు, సింహం, పెద్దపులి, ఖడ్గమృగం వంటి జంతువులకు ఆవాసంగా భారత్‌ తొమ్మిదోస్థానంలో ఉంది. ఎన్నో పక్షి, సరీసృప జాతులు సైతం ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. సింహం, పెద్దపులి రెండు జాతులూ ఉన్న ఏకైకదేశం భారత్‌. 19వ శతాబ్దం తొలినాళ్లవరకు దేశంలో పరిఢవిల్లిన వన్యప్రాణి జాతుల జనాభా ఆ తరవాతి కాలంలో ప్రమాదకర స్థాయిలో క్షీణించింది. వన్యప్రాణుల ఆవాసాలైన అడవులు ధ్వంసం కావడం, జంతువులు వేటకు గురికావడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. కలప, ఇతర అవసరాల కోసం చెట్లు నరికివేస్తున్నారు. వన్యప్రాణి ఆవాసాల్లో చేపట్టే రోడ్లు, మైనింగ్‌, భారీజలాశయాల వంటి అభివృద్ధి కార్యక్రమాలూ వాటి పాలిట శాపాలుగా పరిణమించాయి.

మితిమీరిన మానవ చర్యలు

ఆహారంకోసం, అక్రమ వ్యాపారాలకోసం వన్యప్రాణులను విచక్షణారహితంగా వధిస్తున్నారు. వాటి జనాభా క్షీణించడానికి, కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు. పులి, చిరుతవంటి మాంసాహార జంతువుల జనాభా క్షీణతవల్ల దుప్పులు, అడవిపందులు వంటి జాతుల జనాభా పెరుగుతోంది. అవి పంటలపై దాడిచేసి నష్టం కలిగిస్తున్నాయి. మరోవైపు వేటగాళ్లు శాకాహార జంతువులను వేటాడటంవల్ల- గడ్డి ఇతర వృక్ష జాతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, కార్చిచ్చుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దావానలాలు అడవులు, వన్యప్రాణులను హరించివేస్తాయి. దానివల్ల జంతువులకు  ఆహార కొరత ఏర్పడుతుంది. దాంతో అవి ఆహారం కోసం అడవులకు సమీపంలోని మానవ ఆవాసాలపై దాడి చేస్తున్నాయి. వివిధ కారణాలతో క్షీణిస్తున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం 1936లోనే జాతీయపార్కుల ఏర్పాటు ప్రారంభమైంది. మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న పెద్దపులి, ఏనుగు, ఖడ్గమృగం వంటి జాతుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్‌ టైగర్‌, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ వంటివి ఏర్పాటయ్యాయి. వన్యప్రాణుల సాంద్రత అధికంగా ఉన్న అటవీప్రాంతాలను గుర్తించి అభయారణ్యాలు, టైగర్‌ రిజర్వ్‌లు ఏర్పాటు చేశారు. పెద్దపులి సంరక్షణలో కార్బెట్‌, కాన్హా, తడోబా, బందీపూర్‌ జాతీయపార్కులు/ టైగర్‌ రిజర్వులు; ఖడ్గమృగాలకు అస్సామ్‌లోని కజిరంగ ప్రముఖమైనవి. మైసూరు, నీలగిరి, కజిరంగ కార్బి ప్రాంతాలు అత్యధికంగా ఏనుగులను కలిగి ఉన్నాయి. గుజరాత్‌లోని వెల్వడార్‌ సాంక్చువరీ కృష్ణ జింకల కోసం, రాన్‌ ఆఫ్‌ కచ్‌ సాంక్చువరీ అడవిగాడిదలకోసం, ఆంధ్రప్రదేశ్‌లోని రోళ్లపాడు సాంక్చువరీ బట్టమేక పక్షులకోసం, తెలంగాణలోని శివారం సాంక్చువరీ మొసళ్ల సంరక్షణ కోసం ఏర్పాటయ్యాయి.

వన్యప్రాణి చట్టం-1972 ప్రకారం అడవి జంతువుల వేటను నిషేధించారు. పులి, ఏనుగు, నెమలి, కొండగొర్రె, కృష్ణ జింక, అడవి గాడిద, కొండ చిలువ, మొసళ్లు, రాబందులు తదితరాలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. మాను పిల్లి, పునుగు పిల్లి, ఉడుములు, నక్కలు, అడవి పిల్లులు, ఎలుగు బంటి, తాచుపాము, రక్త పింజర, ముంగీస, అడవి కోడి, వంటివాటికీ మెరుగైన రక్షణ కల్పించారు. వాటిని వధించినా, హాని కలిగించినా నిందితులకు వెంటనే బెయిలు లభించదు. తప్పనిసరిగా జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. నేర నిరూపణ అనంతరం నిందితుడికి కనీసం రూ.5,000 జరిమానాతో కలిపి కనిష్ఠంగా ఒక సంవత్సరం, గరిష్ఠంగా ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ‘జాతీయ వన్యప్రాణి బోర్డు’ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షులు. రక్షిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇచ్చే అనుమతుల విషయంలో ఈ బోర్డులు కీలక భూమిక పోషిస్తాయి. భారత వన్యప్రాణి సంస్థ, జాతీయ పులి సంరక్షణ ప్రాధికార సంస్థ, వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో, కేంద్ర జంతు ప్రదర్శనశాల ప్రాధికార సంస్థ వంటివి ఏర్పాటయ్యాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో జీవ వైవిధ్య బోర్డులను నెలకొల్పారు. భారతదేశం అంతర్జాతీయంగా జీవవైవిధ్య ఒప్పందం, రాంసర్‌ ఒప్పందాల్లో సభ్యత్వాన్ని కలిగి ఉంది. వన్యప్రాణుల సంరక్షణ చర్యల ఫలితంగా పెద్దపులి, ఖడ్గమృగం వంటి జంతువుల జనాభాలు ఈ మధ్య కాలంలో కొద్దిగా పెరిగాయి. గడచిన రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ పర్యావరణ పర్యాటక రంగం మూడు రెట్లు పెరిగిందని ఒక అంచనా. కానీ, కొన్ని జాతుల జనాభాలు ప్రమాదకరంగా తగ్గిపోతున్నాయి.

మనుగడ ప్రమాదం

బట్టమేకపక్షి, నీలగిరి థార్‌, మంచు చిరుతపులి, అడవి గుడ్లగూబ, గంగా షార్కు, వివిధ సాలెపురుగులు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. 2019 జులైలో లోక్‌సభలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం- భారతదేశంలో కొన్ని శతాబ్దాల కాలంలో నాలుగు జంతుజాతులు, 18 వృక్షజాతులు అంతరించాయి. హిమాలయన్‌ పూరేడు పిట్ట చివరిసారిగా 1876 సంవత్సరంలో కనిపించగా, గులాబీ రంగు తల బాతు 1950లో అంతరించింది. వన్యప్రాణుల సంరక్షణకు వాటి ఆవాసాల పునరుద్ధరణకు ప్రభుత్వాలు కృషి చేయాలి. రక్షితప్రాంతాల సంఖ్యను, విస్తీర్ణాన్ని పెంచాలి. ఇప్పటికే చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అటవీ, వన్యప్రాణి  చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి. మనుగడ ప్రమాదంలోఉన్న లేదా జనాభా క్షీణించిన జాతులను గుర్తించి తక్షణమే సంరక్షణ చర్యలు ప్రారంభించాలి. అప్పుడే వన్యప్రాణుల మనుగడ, జీవవైవిధ్యం పరిఢవిల్లుతాయి.

- ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.