Indian Citizenship: దేశాన్ని ఎందుకు వీడుతున్నారు?

ప్రపంచ శక్తిగా భారత్‌ ఎదుగుతున్న కీలక సమయమిది. ఆర్థికంగా, రాజకీయంగా విశ్వవేదికలపై మన మాట సైతం చెల్లుబాటు అవుతోంది. ఇటువంటి తరుణంలో భారతీయులు పెద్దసంఖ్యలో తమ పౌరసత్వాలను స్వచ్ఛందంగా వదులుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది...

Updated : 10 Nov 2022 07:12 IST

ప్రపంచ శక్తిగా భారత్‌ ఎదుగుతున్న కీలక సమయమిది. ఆర్థికంగా, రాజకీయంగా విశ్వవేదికలపై మన మాట సైతం చెల్లుబాటు అవుతోంది. ఇటువంటి తరుణంలో భారతీయులు పెద్దసంఖ్యలో తమ పౌరసత్వాలను స్వచ్ఛందంగా వదులుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.  

నిరుడు 1.63లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వలస వెళ్ళారు. అందులో 78వేల మందికి పైగా అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. మిగిలిన వారు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌, ఇటలీల్లో స్థిరపడ్డారు. 2020తో పోలిస్తే- ఇండియా పౌరసత్వాన్ని త్యజించినవారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. మొత్తమ్మీద గడచిన అయిదేళ్లలో 6.70 లక్షల మంది దేశాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయారు. గత జులై నెలలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రమే ఈ సమాచారాన్ని వెల్లడించింది. విదేశీ బాటపడుతున్న వాళ్లలో సంపన్నులు, విభిన్న రంగాల్లో నిపుణులే అత్యధికంగా ఉంటున్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ- దేశం నుంచి వెలుపలికి అత్యధిక సంఖ్యలో వలసలు ఎందుకు సాగుతున్నాయన్నదే ప్రధానప్రశ్న!
లండన్‌కి చెందిన గ్లోబల్‌ సిటిజన్‌ అండ్‌ రెసిడెన్స్‌ అడ్వైజర్‌ సంస్థకు అనుబంధమైన ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌’ అధ్యయనం ప్రకారం- అత్యధిక సంపద కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ) సుమారు ఎనిమిదివేల మంది ఈ ఏడాదిలో భారతదేశ పౌరసత్వం వదులుకోనున్నారు. తరవాతి స్థానంలో మేధావులు, వృత్తి నిపుణులు ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య పరిస్థితులు, వ్యాపారవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం, ప్రజాస్వామ్య వ్యవస్థ, అంతర్జాతీయంగా ఇనుమడిస్తున్న భారత ప్రతిష్ఠ... దేశీయంగా కనిపించే ఈ సానుకూలతలన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే! కొరవడిన జీవన ప్రమాణాలు, రోజురోజుకీ పెచ్చరిల్లుతున్న కాలుష్యం, అవినీతి వేళ్లూనుకుపోవడం, తీవ్రవాద భయం, తరచూ చోటుచేసుకునే సామాజిక అస్థిరతలు అత్యధికులను దేశం దాటేలా చేస్తున్నాయని అధ్యయనకర్తలు కఠోర వాస్తవాలను చెబుతున్నారు. కొవిడ్‌ తరవాత పెద్దయెత్తున కొలువుల కోతతో వృత్తి నిపుణుల్లో ఉద్యోగ భరోసా కొరవడిందనే వాదనా వినిపిస్తోంది. ఒకవైపు అంతర్గత ప్రతికూలతలు వలసలకు ప్రేరేపిస్తుంటే- మరోవైపు విదేశాల్లోని మెరుగైన జీవన పరిస్థితులు అక్కడి అవకాశాలు స్థితిమంతులను రారమ్మంటూ ఊరిస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌లాంటి కొన్ని దేశాల్లో పన్నుల భారం తక్కువే. దాంతో కొంతమంది సంపన్నులు ఆ దేశాలను తమ శాశ్వత నివాస ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు, కాలుష్యం తక్కువగా ఉండటం, ఉగ్రవాద భయం అంతగా లేకపోవడం... పశ్చిమ దేశాలవైపు భారతీయులు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అమెరికావంటి దేశాల్లో హెచ్‌1బీ వీసాల నిబంధనల సడలింపు సైతం వలసలను ప్రోత్సహిస్తోంది. దీనికితోడు ఇటీవలి కాలంలో నల్లధనం చలామణీపై దేశీయంగా నిఘా పెరగడం, పన్ను ఎగవేత మార్గాలను అరికడుతుండటం, బహుళ పౌరసత్వంపై నిషేధం వంటి చర్యలు కొంతమందికి అంతగా రుచించడం లేదు. వలసలకు అది కూడాఒక కారణం కావచ్చు.

అంతకంతకూ పెరిగిపోతున్న విదేశీ వలసలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమాజం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలిగే  ధనికులు, మేధావులు భారతీయ పౌరసత్వం వదులుకోవడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని ఒక వర్గం వాదిస్తోంది. ఇది దాదాభాయ్‌ నౌరోజీ ప్రవచించిన ‘సంపద తరలింపు సిద్ధాంతం’ మాదిరిగానే పని చేస్తుందంటున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతంలో కొన్ని లక్షలమంది వెళ్ళిపోయినంత మాత్రాన దేశానికి ఒనగూడే నష్టమేమీ ఉండదన్నది ఇంకొందరి వాదన. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ, స్వేచ్ఛా వాణిజ్య విధానాల కారణంగా ఆర్థిక ఫలాలను చేజిక్కించుకొని అత్యంత ధనవంతులుగా ఎదిగిన వ్యక్తులు- ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు, దేశాన్ని వదిలిపోవడమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను కొండెక్కించేసి... విదేశీయులుగా మారిపోవడం వాళ్ల నైతికలేమికి అద్దం పడుతోందని వాదిస్తున్న వర్గాలూ ఉన్నాయి. అమెరికా పౌరసత్వం కోసం అక్కడి రాయబార కార్యాలయాలకు ఈ ఒక్క ఏడాదిలోనే 4.21లక్షల భారతీయ దరఖాస్తులు వచ్చాయనే చేదు వాస్తవాన్ని భారతీయ అమెరికన్‌ నాయకుడు అజయ్‌ జైన్‌ భుటోరియా ఈమధ్యే వెల్లడించారు. ప్రాబల్య వర్గాలైన ధనికులు, మేధావులు ఇక్కడి పరిస్థితులతో పొసగలేక విదేశాలవైపు చూస్తున్నారు. జీవన ప్రమాణాల్లో దశాబ్దాలుగా మెరుగుదలకు నోచుకోని దిగువ మధ్యతరగతి, పేదవర్గాల ప్రజలు ఈసురోమంటూ తమ జీవితాలను వెళ్ళదీస్తున్నారు. ‘అమృత’ భారతావని వాస్తవ స్థితిగతులకు అద్దంపట్టే దురదృష్టకర పరిస్థితి ఇది!

- శ్రీనివాస్‌ బాలె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.