ఓటు చుట్టూ కోటి కుట్రలు

అయ్యవారి గుర్రానికి అన్నీ అవలక్షణాలే అన్నట్లు, మన ప్రజాస్వామ్యమూ అంతే- అనేకానేక దుర్లక్షణాలతో వర్ధిల్లుతోంది. అవి సరిపోనట్లు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సరికొత్త సిగ్గుమాలిన నిర్వాకాలకు తెరతీస్తోంది.

Updated : 27 Nov 2022 06:33 IST

య్యవారి గుర్రానికి అన్నీ అవలక్షణాలే అన్నట్లు, మన ప్రజాస్వామ్యమూ అంతే- అనేకానేక దుర్లక్షణాలతో వర్ధిల్లుతోంది. అవి సరిపోనట్లు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సరికొత్త సిగ్గుమాలిన నిర్వాకాలకు తెరతీస్తోంది. ముక్కూమొహం తెలియని వాళ్లెవరో వచ్చి, ‘మీ పని ఉచితంగా చేసిపెడతాం’ అంటే- అనుమానిస్తామా లేదా? అందులోనూ సర్కారీ విభాగానికి అలా ఎవరైనా ‘బంపర్‌ ఆఫర్‌’ ప్రకటిస్తే- కచ్చితంగా కీడెంచి మేలెంచాలి కదా! కానీ, బృహత్‌ బెంగళూరు మహాపాలికె (బీబీఎంపీ) అధికారగణానికి ఆమాత్రం స్పృహ సైతం లేకుండా పోయింది. దాంతో ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఎన్నికల ప్రక్రియ పవిత్రతే ప్రశ్నార్థకమయ్యే పెనుప్రమాదమొకటి ముంచుకొచ్చింది. అది పూర్తిగా బీబీఎంపీ తెలివితక్కువతనం ఫలితమేనా... లేదా ‘అధికారం’ అండతో ఎన్నికల కొండను దాటేయవచ్చు అనుకున్న నేతాగణాల మాయావ్యూహమా అన్నదే ఇదమిత్థంగా ఇంకా తెలియదు!    

ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేసేందుకు ‘ఎస్‌వీఈఈపీ’ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) అనే కార్యక్రమాన్ని ఈసీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాము ఉచిత సేవలందిస్తామంటూ ‘చిలుమె’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ కొన్నేళ్ల క్రితం బీబీఎంపీని సంప్రదించింది. ‘వచ్చినవాడు ఫల్గుణుడు’ అనుకున్నారో ఏం పాడో కానీ, అధికారులు అందుకు అనుమతులిచ్చేశారు. ఏకంగా ఓటరు జాబితాల్లో దిద్దుబాట్లు చేయడానికి ‘చిలుమె’ సహకారాన్ని తీసుకునేందుకూ అడ్డంగా తలూపేశారు. ఆ అనుమతుల ముసుగులో ఇంటింటి సర్వే ప్రారంభించిన ఆ సంస్థ- స్థానిక ఓటర్ల వ్యక్తిగత వివరాలను భారీస్థాయిలో సేకరించింది. ఆ సమాచారం అంతటినీ ‘డిజిటల్‌ సమీక్ష’ అనే ఓ అనధికార యాప్‌లోకి ఎక్కించింది. దాదాపు ఏడువేల మంది సిబ్బందిని పనిలోపెట్టుకున్న ఆ సంస్థ... బూత్‌స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) పేరిట వాళ్ల మెడలలో దొంగ గుర్తింపు కార్డులు వేసింది. ప్రభుత్వాధికారుల వేషాల్లో ఇళ్ల మీద పడ్డ ఆ మంద- ఓటర్ల కులం, మతం, చిరునామాలు, ఫోను నంబర్లు, ఓటరు కార్డు- ఆధార్‌ సంఖ్యలతో పాటు ఆయా వ్యక్తుల రాజకీయ ప్రాధాన్యాలనూ ఆరా తీశారు. వాటన్నింటినీ తమ యాప్‌లో పక్కాగా నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో గుట్టుగా సాగిపోయిన ఆ చీకటి బాగోతమంతా ఇటీవలే బట్టబయలైంది. ఇన్నాళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ ‘చిలుమె’ సంస్థ ఇదంతా ఎవరికోసం చేసింది... దానికి సొమ్ములు సమకూర్చిన వాళ్లెవరు, ప్రజలకు సంబంధించిన అతిసున్నిత సమాచారంతో ఆ వ్యక్తులు ఎంతటి అక్రమాలకు పాల్పడ్డారన్న ప్రశ్నలు ఇప్పుడు కర్ణాటకలో గగ్గోలు రేపుతున్నాయి. ఆ సంస్థ నిర్వాహకులకు ఒక పార్టీ నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. గొర్రెల మందకు తోడేలు కాపలా కాసినట్లు, దేశీయంగా ప్రజాస్వామ్యాన్ని నాయకులు ఎలా ‘కాపాడుతున్నారో’ అవే చాటిచెబుతున్నాయి!  

రాబోయే ఎన్నికల్లో లబ్ధి కలిగేలా తమకు గిట్టనివాళ్లను ఓటరు జాబితాల నుంచి తొలగించేందుకే అధికార పక్షం ‘చిలుమె’ సాయం తీసుకుందని కర్ణాటక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెంగళూరు నగరంలో ఇప్పటికే ఆ మేరకు లక్షల  సంఖ్యలో పేర్లను తొలగించేశారని అవి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. పాత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాములోనే ‘చిలుమె’కు అనుమతులు మంజూరయ్యాయని పాలకపక్షమైన భాజపా ఆ వాదనలను తిప్పికొడుతోంది. అధికారుల్లా ఏమారుస్తూ ప్రైవేటు వ్యక్తులెవరో ఓటర్ల వివరాలను నిరాటంకంగా సేకరిస్తుంటే- ఏలినవారి దృష్టికి రాకపోవడమే అనేక సందేహాలకు ఊపిరిపోస్తోంది. ఏతావతా తీరిగ్గా స్పందించిన ఎన్నికల సంఘం- శివాజీనగర్‌, చిక్కపేటె, మహాదేవపుర నియోజకవర్గాల ఓటరు జాబితాల్లో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి జరిగిన మార్పుచేర్పులపై విచారణకు ఆదేశించింది. బీబీఎంపీకి చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఓటర్ల సమాచార తస్కరణపై కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 2013 నుంచి విచారించాలని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ఉత్తర్వులిచ్చారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంలో ఆరితేరిపోయిన నేతాస్వామ్యంలో నిజాలు ఎన్నటికైనా బయటికొస్తాయా? జనం ఓటుహక్కుతో చెలగాటమాడిన అసలు నేరగాళ్ల ముసుగులను అధికారిక విచారణలు నిగ్గు తేలుస్తాయా? ఓటరు జాబితాల్లో అడ్డగోలు సవరణలకు అంటుకడుతున్న అవ్యవస్థను రూపుమాపడంలో ఈసీ వైఫల్యానికి ఎవరిని నిందించాలి? మేడిపండు భారత ప్రజాస్వామ్యంలో జవాబులు దుర్లభమైన బేతాళప్రశ్నలివి!  

ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ప్రాణంపోసే ప్రత్యక్ష ఎన్నికలకు మూలాధారం... ఓటరు జాబితాలే. కాబట్టి, వాటిని వంకపెట్టలేని విధంగా అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని డాక్టర్‌ బి.ఆర్‌.అంబ్కేడర్‌ ఏనాడో హెచ్చరించారు. ఆ గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో ఎన్నికల సంఘం సదా చేతులెత్తేస్తూనే ఉంది. దానికి బండగుర్తుగా- రాజ్యాంగబద్ధమైన తమ ఓటుహక్కుకు సామాన్యులెందరో దూరమవుతున్నారు. పాలకులను ఎంచుకునే ప్రజాస్వామ్య పండగలో ప్రజలు పాలుపంచుకోలేకపోవడం దేశానికి సిగ్గుచేటు కాదా? ఓటరు జాబితాలకోసం ఎన్నికల సంఘం స్థానిక అధికారులనే నమ్ముకుంటోంది. మరోవైపు... పాలకపక్షాల మోచేతినీళ్లకు లొట్టలేసే సిబ్బంది దేశవ్యాప్తంగా కోకొల్లలు. చట్టాలకంటే కూడా తమకు ఎంగిలి మెతుకులు విదిలించే నేతలకే వాళ్లు విశ్వాసబద్ధులు. అటువంటి విధేయ సేవకగణం పుణ్యమా అని అధికార పార్టీల ఇష్టాయిష్టాల్లోంచి ఓటరు జాబితాలు రూపుదిద్దుకొంటున్నాయన్న ఆరోపణలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం!

ఒక్క ఓటుతో జాతకాలు మారిపోయే ఎన్నికల వాతావరణంలో పడగవిప్పుతున్న దుర్రాజకీయాలు- పార్టీల వారీగా ఓటర్లను విభజించి పాలిస్తున్నాయి. వైరిపక్షం వారి ఓట్లను గంపగుత్తగా పట్టికల్లోంచి తొలగించే పెడపోకడలకు అవి నారూనీరుపోస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా లెక్కకుమిక్కిలి దొంగ పేర్లను జాబితాలో కలిపేసే పన్నాగాలూ నిక్షేపంగా కొనసాగుతున్నాయి. చట్టబద్ధమైన పాలనాదర్శాలను దిగమింగేస్తున్న బోగస్‌ ఓటింగ్‌పై ఉక్కుపాదం మోపాలని న్యాయపాలిక గతంలోనే నిర్దేశించింది. ఓటరు జాబితాల సంస్కరణకు పార్లమెంటు లేదా ఎన్నికల సంఘం ఒక మార్గాన్ని అన్వేషించాలని మద్రాసు హైకోర్టు నిరుడు సూచించింది. సంబంధిత వ్యక్తి వాదన వినకుండా జాబితాలోంచి ఎవరి ఓటునూ తొలగించకూడదని కేరళ ఉన్నత న్యాయస్థానం మూడేళ్ల నాడే స్పష్టీకరించింది. అయినా ఓటిపట్టికలు తయారవుతున్నాయంటే లోపమెక్కడ ఉంది? కొత్త ఓటర్లను జాబితాలో చేర్పించడం, నకిలీలుగా భావించిన వాటిని తొలగింపజేయడంలో సహజంగా పార్టీల స్థానిక అభ్యర్థులు, నాయకులే ప్రధానపాత్ర పోషిస్తుంటారు. నిర్దేశిత శాతంకన్నా ఎక్కువగా ఓటరు జాబితాల్లో సవరణలు చోటుచేసుకుంటే- వాటికి ఆయా నేతలనే బాధ్యులను చేయడం వంటి విధానాల అమలుపై ఆలోచించాలి. సంబంధిత అధికారులనూ అందుకు జవాబుదారీ చేయాలి. ఓటరు జాబితాల్లోని లోటుపాట్లను సత్వరం ప్రక్షాళించాలి. అది జరగనంత కాలం- ఎన్నికల నాటకాలతో ప్రజాస్వామ్య భారతి నవ్వులపాలవుతూనే ఉంటుంది!

- శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.