ఉద్గారాల పేరిట సేద్యంపై దాడి!

శతాబ్దాల నుంచి కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్న సంపన్న దేశాలు తమ భూభాగాల్లో వాటిని అరికట్టాల్సిందే.

Published : 28 Nov 2022 00:14 IST

శతాబ్దాల నుంచి కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్న సంపన్న దేశాలు తమ భూభాగాల్లో వాటిని అరికట్టాల్సిందే. ఆ అంశాన్ని విస్మరించి వర్ధమాన దేశాల్లో వ్యవసాయ భూముల నుంచి వెలువడుతున్న ఉద్గారాలను తగ్గించాలంటూ కాప్‌27 ప్రతిపాదించింది.దానిపై భారత్‌ మండిపడింది.

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల నిరోధక ఒప్పందం కింద పర్యావరణ మార్పులను అరికట్టడంలో వ్యవసాయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఈజిప్టులో జరిగిన కాప్‌-27 సదస్సు ముసాయిదా ఒప్పంద ప్రతి ప్రతిపాదించింది. ఇది వర్ధమాన దేశాల ఆహార భద్రతకు ముప్పు కలిగించేదే. దీన్ని కరొనివియా సంయుక్త కార్యాచరణగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నిరోధించడం ఈ కార్యాచరణ ముఖ్యోద్దేశం. భూసారం, సేద్యానికి సూక్ష్మ పోషకాల వినియోగం, నీరు, పాడిపశువులు, సామాజిక-ఆర్థిక అంశాలు, ఆహార భద్రత సాధన యత్నాలు సైతం కర్బన ఉద్గారాలను వెదజల్లి వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయని సంపన్న దేశాలు సెలవిస్తున్నాయి. కరొనివియా ముసాయిదా ఒప్పంద ప్రతిపాదన వర్ధమాన దేశాల్లో వ్యవసాయంపై ఆధారపడిన చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుంది. పేదల కడుపు కొడుతుంది. వ్యవసాయం నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను అరికట్టాలనడం ద్వారా సంపన్న పారిశ్రామిక దేశాలు వర్ధమాన దేశాల్లో కోట్లమందికి జీవనాధారమైన భూములు, సముద్రాలను తాము చెప్పినట్లు వినియోగించాలని ఆదేశించే సాహసం చేస్తున్నాయి. ప్రతి వాతావరణ మార్పుల నిరోధ సభలో సంపన్న దేశాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.

విచ్చలవిడిగా వినియోగం

సంపన్న దేశాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ పేద దేశాలను త్యాగాలు చేయమంటున్నాయి. భూగోళ ఉష్ణోగ్రత పెరగడానికి సంపన్న దేశాలు బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడటమే కారణం. కానీ, దానికి మూల్యం చెల్లించాల్సింది వర్ధమాన దేశాలే అని అవి అంటున్నాయి. అందుకే ప్రతి వాతావరణ సభలో లక్ష్యాలను మార్చేస్తున్నాయి. ఇలాంటి అంశాలన్నింటినీ విస్మరించి వర్ధమాన దేశాలు వ్యవసాయ ఉద్గారాలను తగ్గించుకోవాలంటూ సంపన్న దేశాలు సూచనలు చేయడం విచారకరం. ఐరోపాలో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి భూతాపాన్ని పెంచే కర్బన ఉద్గారాలూ పెచ్చరిల్లాయి. పారిశ్రామిక విప్లవంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించిన ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి జనిస్తున్న ఉద్గారాలు ఇప్పటికీ చాలా తక్కువ. పారిశ్రామిక విప్లవం నుంచి 2019 వరకు దక్షిణాసియా దేశాల్లో వెలువడిన ఉద్గారాలు మొత్తం ప్రపంచ ఉద్గారాలలో కేవలం నాలుగు శాతమని వాతావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ సంఘం లెక్కగట్టింది. భారతదేశ వార్షిక తలసరి కర్బన ఉద్గారాలు ఈనాటికీ 2.4 టన్నుల బొగ్గుపులుసు వాయు ఉద్గారాలకు మించవు. అదే అమెరికాలో తలసరి ఉద్గారాల విలువ 14 టన్నులు. రష్యాలో అవి 13 టన్నులు, చైనాలో 9.7, బ్రెజిల్‌లో 7.5 టన్నులు. మిగతా ప్రపంచమంతా తనలా 2.4 టన్నుల తలసరి ఉద్గారాలను వెలువరిస్తే ప్రపంచానికి వాతావరణ సంక్షోభమే ఉండదని భారత్‌ ఉద్ఘాటించింది.

నెరవేరని వాగ్దానం

సంపన్న దేశాల్లో విలాసాల కారణంగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. పేద దేశాల విషయంలో మాత్రం భుక్తి కోసం వ్యవసాయ భూములను ఉపయోగించడం వల్ల ఉద్గారాలు జనిస్తున్నాయి. అయితే, పేద దేశాల సేద్య ఉద్గారాలు సంపన్న దేశాల ఉద్గారాలకన్నా చాలా తక్కువే. విద్యుదుత్పాదన, రవాణా రంగాల వల్ల సేద్యంకన్నా చాలా ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయి. వ్యవసాయంలో మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ రూపంలో ఉద్గారాలు వెలువడతాయి. సాగు వల్ల జనించే కర్బన ఉద్గారాల్లో 65శాతానికి సహజ, రసాయన ఎరువుల వాడకమే మూలం. వరి సాగు, పంట వ్యర్థాల దహనం, వ్యవసాయంలో ఇంధన వినియోగం వల్లా ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇంతాచేసి 2011లో ప్రపంచమంతటా వెలువడిన ఉద్గారాల్లో వ్యవసాయ క్షేత్రాల వాటా కేవలం 13శాతమే. బతకడానికి వెలువరించే ఉద్గారాలు, విలాసాల వల్ల ఉత్పన్నమయ్యే ఉద్గారాలను ఒకే గాటన కట్టడం దారుణమంటూ భారత్‌ అభ్యంతరపెడుతోంది. వర్ధమాన దేశాలు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న నష్టాలను అధిగమించాలన్నా, ప్రత్యామ్నాయ ఇంధనాల ద్వారా ఉద్గారాలను తగ్గించాలన్నా, వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అవలంబించాలన్నా అపార ధనం ఖర్చవుతుంది. దీనికోసం 13 ఏళ్ల క్రితం సంపన్న దేశాలు చేసిన నిధుల వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదు. మొదట తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తరవాతే ధనిక దేశాలు ఇతరులకు నీతులు బోధించాలి.

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు