పత్తి రైతుల నష్టాల సేద్యం

ప్రపంచవ్యాప్తంగా భారత్‌ మూడో అతిపెద్ద పత్తి ఎగుమతిదారు. వస్త్రాల ఎగుమతిలో రెండో స్థానంలో నిలుస్తోంది. అయితే పత్తిని సాగుచేస్తున్న రైతులు మాత్రం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నారు. పోనుపోను పత్తి దిగుబడులు తెగ్గోసుకుపోతుండటం వారి పాలిట పిడుగుపాటులా మారింది.

Published : 30 Nov 2022 00:43 IST

ప్రపంచవ్యాప్తంగా భారత్‌ మూడో అతిపెద్ద పత్తి ఎగుమతిదారు. వస్త్రాల ఎగుమతిలో రెండో స్థానంలో నిలుస్తోంది. అయితే పత్తిని సాగుచేస్తున్న రైతులు మాత్రం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నారు. పోనుపోను పత్తి దిగుబడులు తెగ్గోసుకుపోతుండటం వారి పాలిట పిడుగుపాటులా మారింది.

పత్తి కొరత వల్ల దేశంలోని సగం స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడతాయని కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో 2022-23 (అక్టోబరు- సెప్టెంబరు) పత్తి సంవత్సరంలో ఉత్పత్తి 15శాతం మేర పెరుగుతుందనే అంచనా ఊరట కలిగిస్తోంది. పత్తి పంటకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడమే దీనికి కారణం. పత్తి ఉత్పత్తి 2022-23లో 15శాతం పెరిగి 360 లక్షల బేళ్లకు చేరుకుంటుందని (ఒక బేల్‌ 170 కిలోలు) కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వెల్లడించింది. మరోవైపు దేశంలో పత్తి ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి.

తెగుళ్ల బెడద

నిరుడు దేశీయంగా పత్తి విస్తీర్ణం 120.55 లక్షల హెక్టార్లు. ఈ సంవత్సరం అది 128 లక్షల హెక్టార్లకు చేరింది. కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఏఐ) సైతం ఈ ఏడాది 350 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. రాబోయే నెలల్లో వాతావరణం అనుకూలిస్తే దేశంలో పత్తి ఉత్పత్తి 370-375 లక్షల బేళ్లకు పెరగవచ్చని తెలిపింది. వాతావరణం అనుకూలించకపోతే 325-330 లక్షల బేళ్లకు పరిమితమవుతుందని అంచనా వేసింది. మరోవైపు వస్త్ర పరిశ్రమ సైతం నిరాశలో ఉందని, ఎగుమతులు క్షీణించాయని వెల్లడించింది. ఇక అంతర్జాతీయ ఏజెన్సీలు 2022-23లో ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని తెలిపాయి. పాకిస్థాన్‌లో ఇటీవలి వరదల వల్ల అయిదు-పది లక్షల బేళ్ల దాకా పత్తి ఉత్పత్తి తగ్గవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం వెల్లడించింది. అంతర్జాతీయ పత్తి వ్యాపారంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా బలమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం భారత్‌ ప్రణాళికలు రచించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.

భారత్‌లో 2002లో బీటీ పత్తిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మొత్తం పత్తి విస్తీర్ణంలో 90శాతం అదే సాగవుతోంది. 2020-21లో రూ.17,753 కోట్ల విలువైన 77.59 లక్షల బేళ్ల పత్తిని భారత్‌ ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్‌, చైనా, వియత్నామ్‌లు ఇండియా నుంచి అధికంగా పత్తిని దిగుమతి చేసుకున్నాయి. కొంత కాలంగా బీటీ పత్తి ఉత్పాదకతలో పెరుగుదల నిలిచిపోయింది. పురుగుమందులను ఎక్కువగా వాడాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం అధికమైందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. 2002-03 నుంచి మొదటి అయిదు సంవత్సరాల్లో బీటీ పత్తి దిగుబడిలో స్థిరమైన పెరుగుదల ఉండేది. ఆ తరవాత అది తగ్గిపోయింది. 2002-03లో హెక్టారుకు 191 కేజీలు ఉన్న పత్తి దిగుబడి, 2007-08 నాటికి 467 కేజీలకు పెరిగింది. ఆ తరవాత దిగుబడి హెచ్చుతగ్గులకు లోనైంది. 2016-17లో 511 కేజీలకు పెరిగి 2019-20లో 456 కేజీలకు పడిపోయినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. మరోవైపు బీటీ పత్తి విస్తీర్ణం మాత్రం స్థిరంగా పెరుగుతూ పోతోంది. ఏళ్లు గడిచేకొద్దీ బీటీ పత్తికి తెగుళ్లతో పోరాడే సామర్థ్యం క్షీణించింది. గులాబీరంగు, కాయతొలిచే పురుగులను అరికట్టడంలో బీటీ పత్తి విఫలమైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దిగుబడులు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. భారత్‌లో రైతుల ఆత్మహత్యల్లో 70శాతం పత్తిని సాగుచేసే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు అంచనా.

తగ్గిన దిగుబడులు

దేశీయంగా గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా పత్తి దిగుబడులు తగ్గిపోయాయి. అధిక వర్షాలు, తెగుళ్ల బెడద, గులాబీ రంగు పురుగు ఉద్ధృతి వల్ల పంట నష్టం అధికంగా ఉంటోంది. దాంతో అన్నదాతలకు వేదన తప్పడం లేదు. నకిలీ విత్తనాలూ రైతులను దెబ్బతీస్తున్నాయి. పత్తి సాగుకు నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. ఇండియాలో ఇతర నేలల్లోనూ దాన్ని సాగు చేస్తున్నారు. ఫలితంగా దిగుబడులపై ప్రభావం పడుతోంది. అంతేకాక ఇండియాలో నూతన, సమర్థ వ్యవసాయ సాంకేతికతలను వినియోగించకపోవడం వల్లా పత్తి ఉత్పాదకత పెరగడం లేదు. పత్తి ఉత్పాదకత పరంగా చైనా, బ్రెజిల్‌, అమెరికా కంటే భారత్‌ చాలా వెనకబడి ఉంది. మరోవైపు వస్త్ర పరిశ్రమ నుంచి పత్తికి గిరాకీ పెరుగుతోంది. 2026 నాటికి వస్త్ర పరిశ్రమకు 4.5 కోట్ల బేళ్ల పత్తి అవసరం అవుతుందని అంచనా. ప్రస్తుతం ఏటా ఉత్పత్తి 3.2 నుంచి 3.5 కోట్ల బేళ్ల మధ్యనే ఉంటోంది. గిరాకీకి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలంటే పత్తి పంట సాగులో విప్లవాత్మక మార్పులు రావాలి. నూతన వంగడాలను రూపొందించాలి. అందుకోసం ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

- సతీష్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.