చైనాలో మళ్ళీ కొవిడ్‌ పంజా

మొన్నటిదాకా ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మళ్ళీ జడలు విప్పుతోంది. దానికి పుట్టినిల్లుగా భావించే చైనాలో దాదాపు ఆరు నెలల విరామానంతరం మళ్ళీ మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు జీరో కొవిడ్‌ విధానం పేరుతో డ్రాగన్‌ దేశం విధిస్తున్న కఠిన ఆంక్షలపై అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Published : 30 Nov 2022 00:43 IST

మొన్నటిదాకా ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మళ్ళీ జడలు విప్పుతోంది. దానికి పుట్టినిల్లుగా భావించే చైనాలో దాదాపు ఆరు నెలల విరామానంతరం మళ్ళీ మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు జీరో కొవిడ్‌ విధానం పేరుతో డ్రాగన్‌ దేశం విధిస్తున్న కఠిన ఆంక్షలపై అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

చైనాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో జిన్‌పింగ్‌ సర్కారు మళ్ళీ కఠిన లాక్‌డౌన్లు అమలు చేస్తోంది. అందులో భాగంగా జనం బయటకు రాకుండా అపార్టుమెంట్లకు బయటి నుంచి తాళాలు వేయడం లాంటి చర్యలు తీసుకుంటుండటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. రాజధాని బీజింగ్‌ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. పాఠశాలలు, దుకాణాలు, హోటళ్లు అన్నీ మూతపడ్డాయి. బీజింగ్‌లోకి రాకపోకలనూ కఠినతరం చేశారు. ఎవరైనా అక్కడకు వెళ్ళాలంటే మూడు రోజులు వరసగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్లు విధించారు. చైనాలో రోజువారీ కేసుల సంఖ్య 32 వేలను దాటింది. ఇది ఏప్రిల్‌ నెల మధ్యలో అత్యధికంగా వచ్చినప్పటి సంఖ్యకు దాదాపు సమానం. దాదాపు రెండుకోట్ల జనాభా ఉండే గువాంగ్‌జౌ ప్రాంతంలో అయిదు రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఇతర సాధారణ వ్యాపారాలతో పాటు నైట్‌ క్లబ్బులు, థియేటర్లనూ మూసివేశారు.  
మరోవైపు చైనా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఇటీవలే మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టిన షి జిన్‌పింగ్‌ దిగిపోవాలని, లాక్‌డౌన్లకు ముగింపు పలకాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు. అయితే, అత్యంత కఠినమైన ఆంక్షలతోనే కొవిడ్‌ను సమర్థంగా నియంత్రించగలమని చైనా సర్కారు గట్టిగా నమ్ముతోంది. 2020 జనవరి 23న వుహాన్‌ సహా హూబెయ్‌లోని పలు నగరాల్లో తొలిసారిగా చైనా లాక్‌డౌన్‌ విధించింది. అప్పటినుంచి నేటివరకు ప్రపంచంలో మరెక్కడా లేనంత కఠినమైన కొవిడ్‌ ఆంక్షలను అది అమలు చేస్తోంది. గతేడాది వాటిని భరించలేని ప్రజలు అపార్టుమెంట్ల బాల్కనీల్లోకి వచ్చి కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు. ఇప్పుడు ఏకంగా జిన్‌పింగ్‌ దిగిపోవాలంటూ గళమెత్తుతున్నారు.

కొవిడ్‌ కేసులు మరోసారి ఇంత అధిక స్థాయిలో వస్తాయని జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఏమాత్రం ఊహించలేదు. పెద్దవయసు వారిలో ఎక్కువ మంది టీకాలు తీసుకోకపోవడం, అప్పటికే కొన్నిరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు ఉండటంతో మరణాలు సైతం నమోదవుతున్నాయి. వీటన్నింటికీ తోడు చైనాలో సగటు వయసు సైతం అధికమే. మరోవైపు ప్రధాన నగరాల్లో తప్ప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ ఏమంత పటిష్ఠంగా లేదు. హాంకాంగ్‌లోనూ దాదాపు మూడు నెలల తరవాత మళ్ళీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజూ దాదాపు తొమ్మిది వేల కేసులు వస్తుండటంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. శీతాకాలం కావడంతో వృద్ధుల ఆరోగ్యం గురించి మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో వయోధికులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తారని, దానికి తోడు కొవిడ్‌ కేసులూ పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోతాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్‌లో కేసుల సంఖ్యతో పాటు మరణాలూ పెరుగుతున్నాయి.

చైనా, హాంకాంగ్‌ మాత్రమే కాకుండా ఐరోపాలోనూ కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరోవైపు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) సైతం త్వరలో కొవిడ్‌ మరో దశ ప్రారంభం అవుతుందన్న హెచ్చరికలు జారీ చేశాయి. దాదాపు ఏడాది పాటు నెమ్మదించిన కొవిడ్‌ ఇప్పుడిప్పుడే మళ్ళీ తన ఉనికి చూపిస్తోంది. ఏడాది క్రితం నాటి పరిస్థితి ప్రస్తుతం లేకపోయినా, కొవిడ్‌ మహమ్మారి ఇంకా అంతం కాలేదన్న విషయం అర్థమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐరోపాలోనే వారం వ్యవధిలో కేసుల సంఖ్య ఎనిమిది శాతం పెరిగింది. టీకాలు తీసుకోవడంలో ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొంత ఊగిసలాట నెలకొంది. ముఖ్యంగా బూస్టర్‌ డోసులు తీసుకున్న జనాభా చాలా తక్కువగా ఉంది. ఐరోపా ఖండం మొత్తమ్మీద చూసుకుంటే టీకాలు ఒక్కసారీ తీసుకోని జనాభా లక్షల్లో ఉంటుందని ఈసీడీసీ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లూ, కొవిడ్‌ టీకాలు రెండూ తీసుకోవడం శ్రేయస్కరమన్నది అక్కడి వైద్య వర్గాల సూచన. ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఆ రెండు టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

- కామేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.