రాజధానిలో కాలుష్య రాజకీయం
దిల్లీ వాసులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాలుష్య మేఘాలు హస్తినను కమ్ముకుంటున్నాయి.
దిల్లీ వాసులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాలుష్య మేఘాలు హస్తినను కమ్ముకుంటున్నాయి. అదే సమయంలో ఎన్నికల వేడిలో ఉన్న పార్టీలు పరస్పరం బురద చల్లుకుంటూ కాలుష్యాన్ని తమ రాజకీయాలకు వాడుకొంటున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పొగ వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. ఒక ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాములకు మించి పీఎం 2.5 ధూళికణాలు ఉండకూడదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం. మైక్రోగ్రాము అంటే గ్రాములో పది లక్షలో వంతు. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పీఎం 2.5 ధూళికణాలు ఇటీవల రాత్రిపూట ఏకంగా 440 మైక్రోగ్రాములు ఉంటున్నాయి. ఇక 45 మైక్రోగ్రాములకు మించకూడని పీఎం10 ధూళికణాలు 771కు చేరుకొన్నాయి. ఆనందవిహార్, నొయిడా, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత అత్యధిక స్థాయిలో ఉంది. వాయునాణ్యత తీవ్రంగా పడిపోవడంతో జాతీయ రాజధాని ప్రాంత అధికార యంత్రాంగానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కఠిన మార్గదర్శకాలు జారీచేసింది. నిర్మాణ కార్యకలాపాలు, కూల్చివేతలను నిలువరించాలని ఆదేశించింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిని వెదజల్లడం లాంటి చర్యలు చేపడుతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను దహనం చేయడం, ఆ గాలి దిల్లీ వైపు వీస్తుండటంతో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది దీపావళి సమయంలో గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలో దిల్లీ వాయు కాలుష్యం నమోదవడంతో పర్యావరణవేత్తలు ఎంతో సంతోషించారు. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఆ తరవాతి రోజు నుంచే పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంటవ్యర్థాల దహనం ఊపందుకొంది. రాజధాని ప్రాంతంలో గాలి వేగం తక్కువగా ఉండటం వల్ల ఆ కాలుష్యం ఇక్కడకు చేరి, ఎక్కడిదక్కడే ఎక్కువ కాలం పాటు నిలిచిపోయింది. ప్రస్తుతం చలి పెరగడం, మంచు కురుస్తుండటంతో గాలిలోని కాలుష్యకణాలు ఆ మంచుతో పాటు అక్కడే ఉండిపోతున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాయు నాణ్యత, వాతావరణ మదింపు, పరిశోధనా వ్యవస్థ (సఫర్) చెబుతోంది.
ఒకవైపు రాజధాని వాసులు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మరోవైపు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో విషగాలులపై రాజకీయ పార్టీలు పరస్పరం బురద చల్లుకుంటున్నాయి. ఈ విషయంలో భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుకొన్నాయి. దిల్లీ నగరాన్ని ‘గ్యాస్‌ఛాంబర్’గా మార్చిన ఘనత ఆప్ సర్కారుకే దక్కుతుందని భాజపా అగ్రనేతలు, కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో గతేడాదితో పోలిస్తే పంటవ్యర్థాల దహనాలు 19శాతం పెరిగాయని, దానివల్లే దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో భాజపా అధికారంలో ఉన్న హరియాణాలో పంట వ్యర్థాల దహనాలు గతేడాది కంటే 30శాతం తగ్గాయని ఆయన తెలిపారు. దేశ రాజధానిలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తిందని, వాహన కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు సైతం దిల్లీ సర్కారు తీసుకోలేదని భాజపా అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. కేవలం దిల్లీ, పంజాబ్‌లలోనే కాకుండా ఉత్తర భారతదేశం అంతటా వాయు కాలుష్య సమస్య ఉందని ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని గళమెత్తారు. కాలుష్యం సమస్యను కేంద్రం రాజకీయం చేస్తోంది తప్ప పరిష్కార మార్గాలు చూడట్లేదని కేజ్రీవాల్ విమర్శించారు.
భాజపా, ఆప్‌లు పరస్పర విమర్శలతో సరిపుచ్చకుండా వాయు కాలుష్య నివారణకు తక్షణం సమగ్ర చర్యలు తీసుకోవాలి. వాహనాల రాకపోకలను నియంత్రించడానికి గతంలో అమలుచేసిన సరి-బేసి విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి. విద్యుదుత్పత్తికి బొగ్గు వాడకం తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం అత్యావశ్యకం. ప్రజా రవాణాకూ విద్యుత్ వాహనాలనే ఉపయోగించాలి. పాదచారులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుచేయడం, సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించడం లాంటివీ సత్ఫలితాలనిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే కాలుష్య భూతం మరింతగా కోరలు చాచకుండా నిలువరించడం సాధ్యమవుతుంది.
రఘురామ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్‌బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు