సినిమా పాటల తోటరాముడు

అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి నేడు. విజయనగరంలో ఇల్లిల్లూ తిరిగి మధుకర వృత్తితో పొట్ట నింపుకొన్న ఆయన... నీ గొంతు సినిమాకు పనికిరాదు పొమ్మని తిరస్కరణకు గురైన ఘంటసాల... అనంతర కాలంలో ఒక తరానికి సొంత ఇంటిమనిషిగా మారిపోయారు.

Updated : 04 Dec 2022 04:29 IST

అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి నేడు. విజయనగరంలో ఇల్లిల్లూ తిరిగి మధుకర వృత్తితో పొట్ట నింపుకొన్న ఆయన... నీ గొంతు సినిమాకు పనికిరాదు పొమ్మని తిరస్కరణకు గురైన ఘంటసాల... అనంతర కాలంలో ఒక తరానికి సొంత ఇంటిమనిషిగా మారిపోయారు. వర్షంలో తడవనివారు, ఆయన అమృత గళం విని పరవశించని తెలుగువారు లేరన్న స్థాయికి ఎదిగారు.

వందేళ్లక్రితం ఇదేరోజున గంధర్వలోకాలనుంచి భూమ్మీదకు దిగివచ్చారు ఘంటసాల. నేటికి ఓ ఏభై అరవై ఏళ్లు దాటిన ముందు తరాల వారి బాల్యాన్ని ఘంటసాల పాట లాలించింది. ప్రాయంలో అభిరుచులు పెంచింది. ఇప్పుడు తీపి గుర్తులు మిగిల్చింది. నేటికీ సజీవంగా నిలిచింది. రోజూ వినిపిస్తూనే ఉంది. ‘నాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో... ఆమె వాత్సల్యపూరిత భిక్ష- నాకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించింది’ అని జీవితాంతం చెప్పుకొన్నారు ఘంటసాల. తొలిదశలో తనకు సంగీత విద్యను ప్రసాదించిన గురువు పట్రాయని సీతారామశాస్త్రిని ఆయన కడవరకూ స్మరిస్తూనే వచ్చారు. గురువుగారి అబ్బాయి సంగీతరావును చివరిదాకా తనకు తోడుగా ఉంచుకొని ఆదరించారు. కుల మత భేదాలు, చాదస్తాలు విశేషంగా అమలవుతున్న రోజుల్లో హిందుస్థానీ సంగీత మహా విద్వాంసులు ఉస్తాద్‌ బడేగులాం అలీ బృందానికి నెలల తరబడి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి సహపంక్తి భోజనం చేశారు. ఘంటసాల ఉన్నత వ్యక్తిత్వానికి ఇవి కొన్ని మచ్చుతునకలు.

గాయకుడిగా స్వరముద్రణకు సిద్ధమయ్యేసరికి ఘంటసాలలోని గంధర్వ అంశ పురివిప్పుకొనేది. సంగీతరావు మాటల్లో చెప్పాలంటే... ‘ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. అందులో మంద్ర మధ్యమ తార స్థాయులు అలవోకగా పలికేవి. ఆయనతో పనిచేసేవారూ ఆ ప్రతిభను చూసి అప్రతిభులు అయ్యేవారు. ‘కృష్ణా ముకుందా మురారీ’ పాట స్వరముద్రణ జరుగుతున్నప్పుడు నేను వాహినీ రికార్డింగ్‌ థియేటర్‌లో ఉన్నాను. వాద్యబృందం, సాంకేతిక నిపుణులు- ఘంటసాల ఆ పాట పాడుతున్న తీరుకు మంత్రముగ్ధులు అవుతున్నారు. వారిలో సన్నాయి వాయించే సత్యం ఒకరు. ఘంటసాల పాడిన ఎన్నో పాటలకు సత్యం పనిచేశారు. పాట చివర ‘హే కృష్ణా! ముకుందా! మురారీ’ అంటూ సాకీ తారస్థాయికి చేరే ఘట్టంలో ఘంటసాల కంఠంలోని సామర్థ్యం, స్థాయి, దానిలోంచి వ్యక్తమవుతున్న దైవత్వం చూసి- సన్నాయి సత్యం ఉద్వేగంతో కన్నీళ్లపర్యంతం కావడం నాకు గుర్తుంది’ అన్నారు సంగీతరావు. శ్యామలాదండకం రికార్డవుతున్నప్పుడు సంగీత నిర్దేశకులు పెండ్యాల నాగేశ్వరరావు అనుభవమూ అదే. కల్యాణితో ఆరంభమై కేదరగౌళ శంకరాభరణం దర్బారీకానడ పంతువరాళి రాగాలమీదుగా చివరకు మధ్యమావతితో ముగిసే ఆ దండకాన్ని- రాగాలవారీగా విడివిడిగా స్వరముద్రణ చేద్దామని పెండ్యాల అన్నారు. అలా వద్దని, ఏకధాటిగా ఆ సుదీర్ఘమైన గీతాన్ని ఒకేసారి గంభీర స్వరంతో పాడుతూ ఉంటే- ఘంటసాల కంఠంలోని గానగాంధర్వానికి, రసనిర్భరతకు తట్టుకోలేక, ఉద్వేగ భరితుడనయ్యానని పెండ్యాల ఒక ముఖాముఖిలో వెల్లడించారు. ఘంటసాల గాత్ర ధర్మాన్ని ఆ రోజుల్లో కొన్ని వేలమంది అనుకరించేవారంటే అతిశయోక్తి కాదు.

ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆవిర్భవించాయి. లవకుశ చిత్రం ఒక్కటీ చాలు- స్వరకల్పనలో ఘంటసాల ప్రతిభ గురించి చెప్పడానికి! ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ గ్రంథంలో వేటూరి సుందరరామమూర్తి ఒక అపురూపమైన విషయాన్ని ప్రస్తావించారు. సంగీత మాంత్రికుడు ఇళయరాజా ఒకసారి ఎక్కడో దూరప్రాంతంలో పాటలకు బాణీలు కట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయనతో వెళ్ళిన వేటూరి హార్మోనియం ముందు తపోముద్రలో కూర్చున్న ఇళయరాజానే చూస్తూ ఉండిపోయారు. ఓ ఇరవై నిమిషాల తరవాత రాజా కళ్లు తెరచి వేటూరితో అన్నారట. ‘ఈ క్షణంలో నాకొక మహాపురుషుడు దర్శనం ఇస్తున్నాడు... సినిమాకు చేసే సంగీతం జనం కోసమే తప్ప- మన ప్రతిభా పాటవాల ప్రదర్శనకు కాదని నిరూపించి నాకు ఒక దారి చూపించిన గురువు ఒక్కరే! ఒకే చిత్రంలోని పాటలన్నింటినీ దాదాపుగా ఒకేరాగంలో చేసి, వాటన్నింటినీ గొప్పగా హిట్‌ చేశారాయన...’ అని చెబుతూ, ఆ చిత్రం పాతాళభైరవిలోని పాటల పల్లవులు తనకు గుర్తున్నంతవరకూ హార్మోనియంపై వినిపించి, ‘ఆ మహానుభావుడు ఘంటసాల’ అంటూ చేతులు జోడించారని వేటూరి రాశారు.

తెలుగువారి సాంస్కృతిక ద్రవ్యం- తెలుగు పద్యానికి చలనచిత్రాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన మహాగాయకుడు ఘంటసాల. ‘బందిపోటు’ చిత్రంలో ‘ఊహలు గుసగుసలాడే’ గీతాన్ని సౌదామిని అనే ఒక విశేషరాగంలో కూర్చి- అమోఘ రాగ సంలీన వైఖరిని ప్రదర్శించిన ప్రయోగశీలి ఘంటసాల. చిన్నా పెద్దా అందరినీ ‘బాబూ’ అని ఆప్యాయంగా పలకరిస్తూ- పరిశ్రమ ప్రముఖులందరిచేతా ‘మాస్టారూ’ అన్న గౌరవం అందుకొన్నారాయన. ఘంటసాల- తెలుగువారి ఆస్తి... తెలుగు పాటకు ప్రశస్తి...ఆయన కంఠం- కంచు గంట... సినిమా పాటల తోటలో విరబూసిన పసిడి పంట ఘంటసాల. గీతను ఇంటింటి గీతంగా మార్చిన ఘంటసాల శత జయంతి నాడే- ఈ ఏడాది గీతా జయంతి రావడం యాదృచ్ఛికం కాదేమో!

వై.శ్రీలక్ష్మి

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు