ఇరానీ మహిళల నైతిక విజయం

దాదాపు మూడు నెలలుగా ఇరానీ మహిళలు సాగిస్తున్న ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారి ఆందోళనలకు దిగి వచ్చిన సర్కారు నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. తమపై విధిస్తున్న కఠిన ఆంక్షలతో పాటు, తమ దేశంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు గళమెత్తారు.

Published : 07 Dec 2022 00:44 IST

దాదాపు మూడు నెలలుగా ఇరానీ మహిళలు సాగిస్తున్న ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారి ఆందోళనలకు దిగి వచ్చిన సర్కారు నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది. తమపై విధిస్తున్న కఠిన ఆంక్షలతో పాటు, తమ దేశంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు గళమెత్తారు.

కరడుగట్టిన ఛాందసవాద నిబంధనలకు విరుద్ధంగా ఇరానీ మహిళల నేతృత్వంలో సాగుతున్న ఉద్యమంలో కీలక విజయం లభించింది. అక్కడి నైతిక పోలీసు విభాగాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. న్యాయవ్యవస్థతో నైతిక పోలీసులకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని అక్కడి అటార్నీ జనరల్‌ ప్రకటించారు. మహిళలు హిజాబ్‌ ధరించాలా, అవసరంలేదా అన్న విషయంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థ కలిసి సమాలోచనలు జరుపుతున్నాయని ఆయన తెలిపిన మరునాడే నైతిక పోలీసు విభాగం రద్దయింది. ఇరాన్‌... ఇస్లామిక్‌, రిపబ్లికన్‌ పునాదులు బలంగానే ఉన్నాయని, కానీ రాజ్యాంగాన్ని అమలుచేసే విధానాలలో కొంత వెసులుబాటు ఉంటుందని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రకటించారు.

హిజాబ్‌ను తప్పనిసరి చేస్తూ ఇరాన్‌ 1983లో చట్టం చేసింది. 2013లో హసన్‌ రొహానీ అధ్యక్షుడైన తరవాత దుస్తుల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చారు.  ఇబ్రహీం రైసీ అధికారంలోకి వచ్చిన తరవాత హిజాబ్‌ నిబంధనను అన్ని రాష్ట్రాల్లోనూ కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. వాటిని వద్దనేవారు ఇరాన్‌కు శత్రువులని ఆయన అభివర్ణించారు. హిజాబ్‌ సంస్కృతి గౌరవాన్ని ప్రచారం చేయడానికి 2005లో అతివాద అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదీ నెజాద్‌ ‘గష్తే-ఎర్షాద్‌’ అనే పేరుతో నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం ఏడేళ్లు దాటిన బాలికలు, యువతులు, మహిళలందరూ తమ ముఖంతో పాటు జుట్టు మొత్తాన్ని కప్పి ఉంచేలా హిజాబ్‌ను ధరించడం తప్పనిసరి. అది ఏమాత్రం సరిగ్గా లేకపోయినా వెంటనే అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేస్తారు. జరిమానాలు విధిస్తారు.

మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతి హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని నైతిక పోలీసులు ఈ ఏడాది సెప్టెంబరు 13న అరెస్టు చేశారు. జైల్లో చిత్రహింసలను తట్టుకోలేక అదే నెల 16న అమీనీ మరణించింది. దాంతో సెప్టెంబరు 17 నుంచి ఆమె సొంత రాష్ట్రమైన కుర్దిస్థాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. అవి క్రమంగా తీవ్రరూపం దాల్చి దేశమంతటా వ్యాపించాయి. పలు నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను, బురఖాలను తగలబెట్టారు. అక్కడి పురుషులూ వారికి మద్దతిచ్చారు. ఆ ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఇప్పటిదాకా 448 మందికి పైగా మరణించారని నార్వేలోని ఇరాన్‌ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం మూడు వందల మందే ప్రాణాలు కోల్పోయారని, వారిలో పోలీసులు, సైనికులు, మిలీషియా సభ్యులూ ఉన్నారని చెబుతోంది.

నిజానికి ఇరానీ ప్రజలు తమ దేశంలో నియంతృత్వ పాలనను చాలా కాలం నుంచే నిరసిస్తున్నారు. ఇరాన్‌ షా నిరంకుశత్వాన్ని తట్టుకోలేని ప్రజలు అప్పట్లో ఆయన్ను తరిమేశారు. కానీ, అయతుల్లాలు వచ్చిన తరవాత వాళ్ల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లయింది. అయతుల్లాల పాలనలో ఇస్లామిక్‌ చట్టాలను కఠినంగా అమలుచేయడం మరింతగా పెరిగింది. మహిళల జీవనం దుర్భరంగా మారింది. నైతిక పోలీసులు డేగకళ్లతో అన్నిచోట్లా మహిళలపై నిఘా పెట్టేవారు. అనాగరిక ఆంక్షలతో విసిగిపోయిన ఇరానీ మహిళలు తీవ్రంగా నిరసన గళాలు వినిపించారు. సిస్టన్‌-బలూచిస్థాన్‌ ప్రాంతంలో నల్లటి దుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చి, పెద్దపెట్టున నినాదాలు చేశారు. హిజాబ్‌ ఉన్నా, లేకపోయినా విప్లవం ఆగదన్నది వారి నినాదాల సారాంశం. ఇటీవల ఫిఫా ప్రపంచకప్‌లో తమ జట్టు అమెరికా చేతిలో ఓడిపోయినప్పుడు ఇరాన్‌లో పెద్దయెత్తున సంబరాలు చేసుకున్నారు. తమ జట్టు ఓటమిని వారు ప్రభుత్వ పరాజయంగా భావించారు. ప్రభుత్వం హతమార్చిన 448 మంది నిరసనకారుల్లో 128 మంది బెలూచిస్థాన్‌ ప్రాంతానికి చెందినవారే. ఆ రాష్ట్రంలోని చాబహార్‌ రేవు పట్టణంలో 15 ఏళ్ల బాలికను నైతిక పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్ళి, కస్టడీలో ఆమెపై అత్యాచారం చేశారు. ఇలాంటి ఘటనలు ఇరానియన్లలో మరింతగా ఆగ్రహం పెంచాయి. తమ దేశంలోని నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజు తప్పక వస్తుందని మహిళలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

- పి.కామేశ్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి