సమాన అవకాశాలతోనే సాధికారత

భారత్‌ ఎన్నో రంగాల్లో పురోగమన పథంలో సాగుతోంది. అనేక విజయాలు సాధిస్తోంది. కానీ, దేశీయంగా నేటికీ మహిళలపై దుర్విచక్షణ కొనసాగుతూనే ఉంది.

Published : 08 Dec 2022 01:00 IST

భారత్‌ ఎన్నో రంగాల్లో పురోగమన పథంలో సాగుతోంది. అనేక విజయాలు సాధిస్తోంది. కానీ, దేశీయంగా నేటికీ మహిళలపై దుర్విచక్షణ కొనసాగుతూనే ఉంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాలి.

ప్రపంచం పోనుపోను మరింత నాగరికమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. అదే సమయంలో మహిళలపై దుర్విచక్షణ, లింగ అసమానత్వం నేటికీ కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ లింగసమానత్వం కోసం 2014లో హి ఫర్‌ షి పేరుతో ఉద్యమం ప్రారంభించింది. సాధారణంగా ఆర్థిక, సాంఘిక, ఆరోగ్య, విద్యాపరమైన అంశాలు మహిళల వెనకబాటుతనానికి కారణమవుతాయి. పితృసామ్య సమాజం, మగ పిల్లలకు అధిక ప్రాధాన్యం దక్కడం వంటివి మహిళల పట్ల దుర్విచక్షణకు అంటుకడుతున్నాయి. భారత్‌లోనూ లింగ అసమానత్వం జడలు విప్పుతూనే ఉంది. 

తీవ్ర వెనకబాటు

ఆరేళ్ల క్రితం ప్రపంచ లింగ సమానత్వ సూచీలో భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. 2022లో 146 దేశాల సరసన మరింత దిగజారి 135వ స్థానానికి పరిమితమైంది. తాలిబన్ల ఏలుబడిలో బాలికలకు పాఠశాల విద్యను నిషేధించిన అఫ్గానిస్థాన్‌కన్నా భారత్‌ కేవలం 11 స్థానాలు ఎగువన ఉంది. మన పొరుగు దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, భూటాన్‌, చైనా, శ్రీలంకలు లింగ సమానత్వంలో ఇండియాకన్నా మెరుగ్గా ఉన్నాయి. భారత్‌తోసహా దక్షిణాసియా దేశాలన్నీ లింగ సమానత్వం సాధించడానికి మరో 200 ఏళ్లు పట్టవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యాఖ్యానించింది. పురుషులు, మహిళలు ఒకే అర్హతతో ఒకే స్థాయిలో పనిచేయడం ప్రారంభించినా, ఆర్థిక రంగంలో స్త్రీలు దుర్విచక్షణకు గురవుతున్నారని ఈ ఏడాది ఆక్స్‌ఫాం నివేదిక తేల్చి చెప్పింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-21లో భారత శ్రామిక   శక్తిలో మహిళల వాటా 25.1 శాతం. బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా వంటివాటితో పోలిస్తే, ఇది చాలా తక్కువ. ప్రస్తుతం ఇండియా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నా, శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య నానాటికీ తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మహిళలే అధికంగా ఉపాధిని కోల్పోయారు. మరోవైపు ఇంటి బాధ్యతలు, సామాజిక పరిస్థితుల వల్ల అర్హతలున్నా ఎంతోమంది మహిళలు ఉద్యోగాల్లో చేరడానికి మొగ్గు చూపడం లేదు.

రాజకీయపరంగా చూస్తే, నేటికీ మహిళలు చాలా వెనకబడే ఉన్నారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పరంగా భారత్‌ 2016లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2021నాటికి 51వ స్థానానికి దిగజారింది. చాలా రాష్ట్రాల స్థానిక సంస్థల్లో మహిళలు సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా ఎన్నికవుతున్నారు. కానీ, వారికి బదులుగా భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారు. ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో దేశీయంగా మహిళలు మొదటి నుంచీ వెనకబడే ఉన్నారు. భారత్‌లో గత అయిదేళ్లనుంచి సగటున ప్రతి 1000 మంది మగపిల్లలకు 952 మంది ఆడశిశువులే జన్మిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఈ నిష్పత్తి మరింత తక్కువగా 1000:929గా నమోదైంది. మొత్తం కార్మిక ఆదాయంలో 82శాతం పురుషులకు దక్కుతుండగా, మహిళల వాటా 18 శాతమేనని ఈ ఏడాది ప్రపంచ అసమానతల నివేదిక తెలియజెప్పింది. దీన్ని చక్కదిద్దాలంటే బడ్జెట్లో మహిళల అభ్యున్నతికి తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌లు మొదటి అయిదు స్థానాలను దక్కించుకున్నాయి. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లు అట్టడుగున నిలుస్తున్నాయి. రువాండా చిన్న ఆఫ్రికా దేశం. అక్కడి జనాభాలో 90శాతానికి వ్యవసాయమే జీవనాధారం. దేశ జనాభాలో మూడోవంతు కన్నా ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అయితే, లింగ సమానత్వంలో రువాండా ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచ దేశాల్లో పురుషుల కన్నా ఎక్కువ మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్న దేశం రువాండా!

చట్టాల అమలు

మహిళా సాధికారతకు, సమానత్వానికి వారసత్వ చట్టం, హిందూ వివాహ చట్టం, వరకట్న నిషేధ చట్టం వంటివి రూపొందించినా సరైన ఫలితాలు దక్కడంలేదు. ఆ శాసనాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. మహిళలపై గృహ హింస, హత్యలు, అత్యాచారాల వంటి దాష్టీకాలు పోనుపోను అధికమవుతున్నాయి. వాటిని నివారించడానికి చట్టాలను మరింతగా పదునుతేల్చి సమర్థంగా అమలు చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలను గౌరవించే సంస్కారం ఇంటివద్ద నుంచే మొదలవ్వాలి. వారి ఆకాంక్షలకు మన్నన దక్కే వాతావరణం  పెరగాలి. అన్ని రంగాల్లో వారి సామర్థ్యాన్ని నిరూపించుకొనే అవకాశాలు దక్కాలి. అప్పుడే భారత్‌లో మహిళా సాధికారత పరిఢవిల్లుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.