మానవాళికి జలగండం

ప్రపంచవ్యాప్తంగా గతేడాది సంభవించిన ప్రకృతి విపత్తుల్లో అధికశాతం నీటి కారణంగానే చోటుచేసుకున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వార్షిక ప్రపంచ నీటి స్థితిగతుల నివేదిక (స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ వాటర్‌ రిసోర్సెస్‌)లో వెల్లడించింది.

Published : 08 Dec 2022 01:00 IST

ప్రపంచవ్యాప్తంగా గతేడాది సంభవించిన ప్రకృతి విపత్తుల్లో అధికశాతం నీటి కారణంగానే చోటుచేసుకున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వార్షిక ప్రపంచ నీటి స్థితిగతుల నివేదిక (స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ వాటర్‌ రిసోర్సెస్‌)లో వెల్లడించింది. భూమ్మీద ఉన్న మంచినీటి వనరులపై వాతావరణం, సామాజిక మార్పుల ప్రభావాలను అంచనా వేసేందుకు ఆ సంస్థ తొలిసారి ఈ నివేదికను ప్రచురించింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి డిమాండ్‌, సరఫరాలో పరిమితుల దృష్ట్యా- మంచినీటి వనరుల పర్యవేక్షణ, నిర్వహణకు ప్రపంచ దేశాలన్నీ పెద్దపీట వేయాలని సూచించింది.

భూమిపై ఉన్న మొత్తం జలవనరుల్లో 94 నుంచి 97 శాతం సముద్రాల్లో ఉండగా- మిగతా మూడు నుంచి ఆరు  శాతం మంచినీటి వనరులే తాగడానికి, సాగుకు ఉపకరిస్తున్నాయి. వాతావరణ మార్పులు అధికంగా జలాధార ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయని, ఈ క్రమంలో తలెత్తుతున్న తీవ్ర కరవులు, వరదలు, హిమనదాల కరుగుదల, రుతుపవనాల్లో మార్పులకు సమాజంలోని ప్రతి జీవీ ప్రభావితమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్‌ఓ) అధిపతి ప్రొఫెసర్‌ పెటేరి టాలస్‌ హెచ్చరించారు. 2021లో అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు కల్లోలితమైనట్లు ఆ సంస్థ నివేదించింది. ఇప్పటికే 360 కోట్ల జనాభా, సంవత్సరంలో కనీసం నెలపాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని, 2050 నాటికి ఈ సంఖ్య 500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2001 మొదలుకుని 2018 వరకు సంభవించిన మొత్తం ప్రకృతి విపత్తుల్లో 74 శాతం నీటికి సంబంధించినవేనన్నది ఐరాస అధ్యయనాల సారాంశం.

డబ్ల్యూఎమ్‌ఓ ఏకీకృత సమాచార విధానం (యూనిఫైడ్‌ డేటా పాలసీ) ద్వారా వివిధ ఖండాల్లోని నదీ ప్రవాహాలు మూడు దశాబ్దాలుగా ఎలా ఉన్నాయన్నది విశ్లేషిస్తే- 2021లోనే భూమిపై ఎక్కువ ప్రాంతాలు సాధారణం కంటే పొడిగా ఉన్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా నేడు మూడింట ఒక వంతు భూభాగంలో అనావృష్టి నెలకొంది. కొలరాడో, మిస్సోరి, మిస్సిసిపీ నదీ పరీవాహక ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. ఇథియోపియా, కెన్యా, సోమాలియాల్లో ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి నెలకొంది. ఆఫ్రికాలోని నైజర్‌, వోల్టా, నైలు, కాంగో నదుల్లో నీటి మట్టాలు మునుపెన్నడూ లేనంత దిగువకు పడిపోయాయి. మరోవైపు- పశ్చిమ ఐరోపా నదులు, చైనాలోని అముర్‌ నదీ పరివాహక ప్రాంతం, హిమాలయ నదులైన గంగ, సింధు నదీ పరీవాహక ప్రాంతాల్లో రికార్డుస్థాయి వరదలు సంభవించాయి. యూఎస్‌ పశ్చిమ తీరంలో, దక్షిణ అమెరికా, పాటగోనియా, ఉత్తర ఆఫ్రికా, మధ్యఆసియా, మడగాస్కర్‌లలో భూగర్భ జలాలు 2020-2022 మధ్య సంవత్సరాల సగటుతో పోలిస్తే గతేడాది సాధారణం కంటే దిగువకు పడిపోయాయని నివేదిక తెలిపింది. నీటి ప్రభావ ప్రకృతి విపత్తులు వాటిల్లజేసే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు కరవు, వరదలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించింది.

ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి వనరులైన హిమనదాలతో కూడిన పర్వతాలను మంచినీటి గోపురాలుగా అభివర్ణిస్తారు. భూమ్మీద మంచినీటిలో దాదాపు 69 శాతం హిమనదాలు, ధ్రువప్రాంతాల్లో దాగి ఉండగా, మరో 30 శాతం భూగర్భజలాల రూపంలో ఉంది. భూ వ్యవస్థలో ఘనీభవించిన నీటి వనరులైన (క్రయోస్ఫియర్‌) పలు నదులు, కోట్లమంది జీవనానికి ఆధారం. ఈ జలవనరుల్లో మార్పుల వల్ల ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ సమగ్రత, నిర్వహణ దెబ్బతింటున్నాయి. విశ్వవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వేసవి కాలం పెరుగుతుండటంతో ఏడాదిలో కొన్ని నెలలపాటు మంచు అధికంగా కరిగి నదుల్లో గరిష్ఠ ప్రవాహాలు కొనసాగుతున్నాయని, తరవాత నీటి ప్రవాహాలు దారుణంగా పడిపోతున్నాయని డబ్ల్యూఎంఓ వివరించింది.

సమయాన్ని ఇక ఏమాత్రం వృథా కానీయక, మానవాళి మనుగడకు ఆధారమైన జలవనరుల పరిరక్షణకు నడుం బిగించాలంటూ ఇటీవల ఐరాస వాతావరణ సదస్సు (కాప్‌27)లో నిపుణులు చేసిన హెచ్చరిక- ప్రభుత్వాలకు మేలుకొలుపు. రాబోయే దశాబ్దాలలో నీటి కొరత నుంచి జీవజాలాన్ని కాపాడే బాధ్యత నేటి పాలకులదే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా సమగ్ర నీటి నిర్వహణ విధానాలను చిత్తశుద్ధితో చేపట్టాలి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలను సమర్థంగా కట్టడి చేయాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలి.

 గుణధీర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.