గాడి తప్పుతున్న భావి పౌరులు

ఆకర్షణలు పిల్లల్ని పెడదోవ పట్టించి, వారిలో నేర స్వభావాన్ని పెంచుతున్నాయి. కట్టుతప్పిన చిన్నారులు అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలకు పాల్పడుతుండటం న్యాయస్థానాలనే నివ్వెరపరుస్తోంది.

Published : 09 Dec 2022 00:20 IST

ఆకర్షణలు పిల్లల్ని పెడదోవ పట్టించి, వారిలో నేర స్వభావాన్ని పెంచుతున్నాయి. కట్టుతప్పిన చిన్నారులు అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలకు పాల్పడుతుండటం న్యాయస్థానాలనే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు- నేటి బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తక్షణావసరాన్ని  గుర్తుచేస్తున్నాయి.

ప్పొప్పులను తెలియజెప్పి సన్మార్గంచూపే పెద్దలకు, ఆటపాటలకు దూరంగా చిన్నారుల భవిష్యత్తు నాలుగు గోడల మధ్యే రూపొందుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు రోజంతా నిమగ్నం కావడంతో పిల్లలు అధిక సమయం స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ సాధనాలకు అతుక్కుపోతున్నారు. అడ్డూఅదుపూ లేని సామాజిక మాధ్యమాల వినియోగంతో వారిలో దుడుకుతనం, వక్ర ఆలోచనలు, విపరీత ధోరణులు పెరిగి, పరిస్థితి అవాంఛనీయ నిర్ణయాలకు దారితీస్తోంది. కొందరిలో వయసుతో పాటే హింసాత్మక ప్రవృత్తి పెరుగుతోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల సంచుల్లో సిగరెట్లు, లైటర్లు, మత్తు కలిగించే వైట్‌నర్లు, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు లభించడం కలకలం రేపింది.

చిన్నపాటి కారణాలకే పిల్లలు తల్లిదండ్రులపై దాడులకు దిగడం, ఇతరులను లైంగికంగా, మానసికంగా వేధించడం, హత్యలు, అత్యాచారాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బాలలపై 2018లో 31,591, 2019లో 32,269, 2020లో 29,768, 2021లో 31,170 కేసులు నమోదైనట్లు జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ గేమ్‌షోలు, అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారడంవల్లే యుక్తవయస్కులు అకృత్యాలకు పాల్పడుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తొమ్మిది నుంచి పదిహేడు సంవత్సరాల బాలల్లో ఎక్కువమంది స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నట్లు లోకల్‌ సర్కిల్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 13-17 ఏళ్ల వయసు పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలైనట్లు 44 శాతం తల్లిదండ్రులు వాపోయారని, పట్టణాల్లో ప్రతి పది మంది బాలల్లో నలుగురు ఫోన్లకే అధిక సమయం వెచ్చిస్తున్నారని ఈ సర్వే కళ్లకుకట్టింది.

హైదరాబాద్‌లో ఇటీవల నలుగురు విద్యార్థులు తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడం అందరినీ నిర్ఘాంతపరచింది. స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలను చూసే వారీ అఘాయిత్యానికి పాల్పడటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వెలుగుచూసిన రెండు, మూడు రోజులకే మహారాష్ట్రలోనూ ఇలాంటి దారుణం చోటుచేసుకొంది. ముంబయిలో నలుగురు విద్యార్థులు సహచర విద్యార్థినిపై తరగతి గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డారు. నేరస్వభావాన్ని అలవరచుకుంటున్న పిల్లలు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపైనా అఘాయిత్యాలకు ఒడిగడుతుండటం మరో విషాదకోణం! చదువుల్లో వెనకబడిపోయారని తల్లిదండ్రులకు చెప్పిన పాపానికి అస్సాంలోని కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయినిపై సామూహికంగా దాడి చేశారు. అయిదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా 10, 11వ తరగతులకు చెందిన 22 మంది విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసిన వైస్‌ ప్రిన్సిపల్‌నూ బెదిరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో 12వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఏకంగా తమ ఉపాధ్యాయినినే ర్యాగింగ్‌ చేశారు. ఆ దృశ్యాలను వీడియో తీసి మరీ వేధించారు. బాలలు తీవ్ర నేరాలకు పాల్పడుతుండటంతో ‘బాలల సంరక్షణ చట్టం-2015’ తన లక్ష్యాన్ని చేరుతోందా అన్న అనుమానాన్ని సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో బాల నేరస్థులను పెద్దల మాదిరే విచారించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడింది.

దారితప్పుతున్న పిల్లలను గాడిలో పెట్టాల్సిన ప్రధాన బాధ్యత తల్లిదండ్రులదే. ఇంట్లో ఖాళీ సమయంలో వారు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. డిజిటల్‌ ఉపకరణాల వినియోగాన్ని నియంత్రించాలి. అశ్లీల చిత్రాలు చూడకుండా, పెడదోవ పట్టించే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడకుండా జాగ్రత్తపడాలి. విజ్ఞానం, వినోదం పంచే, సృజనాత్మకతను పెంచే అప్లికేషన్లు, ఆటపాటలపైకి వారి దృష్టిని మళ్ళించాలి.  చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. పాఠ్యాంశాలతోపాటే నైతిక విలువలనూ బోధించాలి. నేరస్థులుగా మారితే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయన్నది తెలియజెప్పాలి. పిల్లల మానసిక ఆరోగ్య పర్యవేక్షణకు విద్యాసంస్థల్లో సైకాలజిస్టులను నియమించాలి. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించినట్లు- బాలికలు, ఉపాధ్యాయుల రక్షణకు బడుల్లో భద్రతా బృందాల ఏర్పాటుకు అన్ని రాష్ట్రాలూ చర్యలు తీసుకోవాలి.

ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.