ఇంట్లో హింస... బయట అభద్రత

ఆడవాళ్లంటే అణిగిమణిగి ఉండాలనే సంకుచిత పితృస్వామ్య భావన భారత్‌లో మహిళల ప్రగతికి అవరోధంగా నిలుస్తోంది. దానివల్ల చదువులు, ఉద్యోగాలంటూ ఆయా రంగాల్లో దూసుకెళ్తున్న స్త్రీలు భద్రతలేని సమాజంలో జీవిస్తున్నారు.

Published : 25 Jan 2023 00:04 IST

ఆడవాళ్లంటే అణిగిమణిగి ఉండాలనే సంకుచిత పితృస్వామ్య భావన భారత్‌లో మహిళల ప్రగతికి అవరోధంగా నిలుస్తోంది. దానివల్ల చదువులు, ఉద్యోగాలంటూ ఆయా రంగాల్లో దూసుకెళ్తున్న స్త్రీలు భద్రతలేని సమాజంలో జీవిస్తున్నారు. ఇళ్లలోనూ చాలామంది మహిళలు తీవ్ర పీడనను ఎదుర్కొంటున్నారు.

భారతీయ మహిళలు భద్రమైన గౌరవప్రదమైన జీవనం గడపగలిగే పరిస్థితులను కల్పించడమే తమ ఆశయమని ప్రభుత్వాలు తరచూ ఊదరగొడుతుంటాయి. అందుకోసమంటూ ఎన్నో చట్టాలూ చేస్తుంటాయి. వాటిని పక్కాగా అమలు చేయడంలో మాత్రం తీవ్ర అలక్ష్యం నెలకొంటోంది. ఫలితంగా ఇంటా బయటా మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మహిళలపై దాష్టీకాలకు సంబంధించి నిరుడు జాతీయ మహిళా కమిషన్‌కు దాదాపు ముప్ఫై ఒక్క వేల ఫిర్యాదులు అందాయి. వాటిలో 23శాతం గృహహింసకు సంబంధించినవే. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా స్త్రీలపై అకృత్యాలకు సంబంధించి 4.28 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే అవి 15శాతం అధికం. వాటిలో వివాహితపై భర్త, అతడి బంధువుల క్రూరత్వానికి సంబంధించి ఐపీసీలోని సెక్షన్‌ 498(ఏ) కింద నమోదైనవే 1.36 లక్షలకు పైగా ఉన్నాయి. పశ్చిమ్‌ బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, అస్సాం, మహారాష్ట్రల్లో గృహ హింస కేసులు అధికంగా నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 2021లో ఇలాంటి కేసులు 16 వేలకు పైగా దాఖలయ్యాయి.

పిల్లలపైనా ప్రభావం

గృహ హింస ఘటనలు  2001-2018 మధ్య కాలంలో 53శాతం అధికమైనట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో వరకట్నాన్ని ఆరు దశాబ్దాల క్రితమే నిషేధించినా ఇప్పటికీ ఆ దురాచారానికి అడ్డుకట్ట పడలేదు. 2021లో వరకట్న నిషేధ చట్టం కింద దేశంలో పదమూడున్నర వేలకు పైగా కేసులు దాఖలయ్యాయి. ఆ ఏడాది ఆరున్నర వేల మంది మహిళల ప్రాణాలను కట్న పిశాచి బలి తీసుకుంది. వాస్తవానికి ఇళ్లలో మహిళలపై జరుగుతున్న మానసిక, భౌతిక, లైంగిక దాడులకు సంబంధించి అన్ని ఘటనలూ వెలుగులోకి రావడంలేదు. పద్దెనిమిదేళ్ల నుంచి 49 ఏళ్లలోపు భారతీయ మహిళల్లో దాదాపు ముప్ఫై శాతం తమ జీవిత సహచరుల చేతుల్లో హింసకు గురవుతున్నారని అయిదో కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది. ఆయా బాధితుల్లో మూడొంతుల మంది తమ వెతలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తమపై జరుగుతున్న హింసను మౌనంగానే భరిస్తున్నారు. 

గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు పదిహేడేళ్ల క్రితం ప్రత్యేక చట్టాన్ని రూపొందించినా పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. దీనిపై ‘వి ది ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ పద్నాలుగు నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు- దేశవ్యాప్తంగా గృహహింస చట్టం కింద నమోదైన కేసుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా)కు సూచించింది. కొద్ది నెలల క్రితమే నల్సా తన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. దాని ప్రకారం గృహ హింస చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దాని కింద 11.93 లక్షల కేసులు దాఖలయ్యాయి. 2022 ఆగస్టు నాటికి వాటిలో 4.71 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. దీన్నిబట్టి ఎంతోమంది బాధిత మహిళలకు సకాలంలో న్యాయం అందడంలేదని అర్థమవుతోంది. గృహహింస కోరల్లో చిక్కుకొనే స్త్రీల మానసిక, శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దానివల్ల వారికి జన్మించే పిల్లలు సైతం ఎదుగుదల లోపాల బారిన పడాల్సి వస్తోందని పరిశీలనలు తెలియజెబుతున్నాయి. గృహ హింస బాధితులైన మహిళల్లో తల్లిపాలు సైతం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఇండియా, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాలలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇంట్లో నిత్యం వేధింపుల కారణంగా మహిళలు సరైన ఆహారాన్ని తీసుకోవడంలేదు. తమ ఆరోగ్యంపైనా వారు సరైన దృష్టి సారించలేకపోతున్నారు. ఆ ప్రభావం వారికి జన్మించే చిన్నారులపై పడుతోంది. 

సామాజిక చైతన్యం అవసరం

మహిళలను రాచి రంపాన పెట్టే పురుషాధిక్య ధోరణులకు ముగింపు పలకడం కేవలం చట్టాల ద్వారానే సాధ్యపడదు. స్త్రీ పురుష సమానత్వంపై సామాజిక చైతన్యాన్ని పెంచాలి. ఆ మేరకు పాఠశాల దశనుంచే నైతిక విద్యను బోధించాలి. సంస్కృతి సంప్రదాయాల పేరిట పితృస్వామ్య భావజాలాన్ని రుద్దే పెడ పోకడలను విడిచిపెట్టాల్సిన అవసరాన్ని అందరికీ తెలియజెప్పాలి. దృశ్య మాధ్యమాల్లో మహిళల పట్ల ఛాందస భావాల ప్రచారం జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. గృహహింస బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేసే వాతావరణాన్ని కల్పించాలి. కౌన్సెలింగ్‌ కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి బాధిత మహిళలకు అండదండలు అందించాలి. కేసుల విచారణను వేగవంతం చేసి దోషులకు సరైన శిక్షలు పడేలా చూడటమూ తప్పనిసరి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం కలిసికట్టుగా కృషిచేస్తేనే- గృహ హింస నుంచి మహిళలు విముక్తులవుతారు.

పద్మ వడ్డె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు