సామాజిక నియంతలు

అవినీతికి చొక్కా ప్యాంటూ వేసినట్టుండే జగత్‌ కంత్రీ నేతలను ఎవరూ ‘బాయ్‌కాట్‌’ చేయరు. లంచాల గుట్టల మీద మంచాలేసుకుని పడుకునే అధికారులను విధుల్లోంచి బహిష్కరించమంటూ వీధుల్లోకి ఎవరూ రారు.

Published : 29 Jan 2023 00:09 IST

వినీతికి చొక్కా ప్యాంటూ వేసినట్టుండే జగత్‌ కంత్రీ నేతలను ఎవరూ ‘బాయ్‌కాట్‌’ చేయరు. లంచాల గుట్టల మీద మంచాలేసుకుని పడుకునే అధికారులను విధుల్లోంచి బహిష్కరించమంటూ వీధుల్లోకి ఎవరూ రారు. నింగిలో చుక్కలెన్ని ఉన్నాయో అన్ని వాగ్దానాలిచ్చేసి ఆపై అన్నింటినీ తూనాబొడ్డు అనేసే పార్టీలను అధికారంలోంచి వెలేస్తారా లేదా అని నిలదీయరెవరూ! తమ కళ్ల ముందే తోటి మనిషికి అన్యాయం జరుగుతున్నా సరే, ముఖం తిప్పుకొని పోయేవారే తప్ప దాన్ని అడ్డుకొనే వారెక్కువగా కనిపించరు. కానీ, ఫలానా సినిమాలో ఫలానా ఆర్టిస్టు బట్టలు బాగాలేవంటూ మహోద్యమానికి పిలుపిచ్చే పనిలేని పెదరాయుళ్లు మాత్రం దేశంలో చాలామందే పోగయ్యారు! తమకు నచ్చని దర్శకనిర్మాతలు, నటీనటుల కొత్త సినిమా వస్తే చాలు... వాళ్లందరూ కలిసి విద్వేష విషాన్ని విరజిమ్ముతున్నారు. ఆవకాయకు, ఆనపకాయకు తేడా తెలియని అటువంటి మూర్ఖపు మూకల వీరంగాలు ఈమధ్యకాలంలో మరీ శ్రుతిమించుతున్నాయి. వాటి ‘బాయ్‌కాట్‌’ హ్యాష్‌టాగ్‌లు, రోత బూతుల వాంతులతో సామాజిక మాధ్యమాలిప్పుడు మురుగు కంపు కొడుతున్నాయి. నేడు భారతీయ చలనచిత్రాలు విదేశాల్లోనూ మంచి గుర్తింపు పొందుతున్నాయి. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాఖ్యానించినట్లు- ఆ సానుకూల వాతావరణం మొత్తాన్నీ బాయ్‌కాట్‌ సంస్కృతి చెడగొట్టేస్తోంది. బయటివారికి తప్పుడు సందేశాలను పంపుతూ దేశం పరువుతీస్తోంది!

‘మంచి పుస్తకాన్ని చంపడమంటే మనిషిని హత్య చేయడంతో సమానం... అంతకంటే ఘోరమైన పాపం కూడా... చాలామంది మనుషులు భూమికి భారం... కానీ, మంచి పుస్తకం అలా కాదు’ అని అంటారు ప్రఖ్యాత ఆంగ్ల కవి జాన్‌ మిల్టన్‌. పుస్తక ప్రచురణ స్వేచ్ఛకు సంకెళ్లు బిగించిన ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌కు తన నిరసనను తెలియజేస్తూ ఆయన పలికిన మహితోక్తులవి. అయితే- ఏది మంచో ఏది చెడో ఎవరు నిర్ణయిస్తారు? చదువరులే ఆ విషయం తేల్చుకుంటారు. ఉత్తమ రచనలను చరిత్రలో నిలుపుతారు. పనికిమాలిన రాతలను చెత్తబుట్టలోకి విసిరికొడతారు. సినిమాలకూ అదే సూత్రం వర్తిస్తుంది కదా. సినిమా బాగుంటే నాలుగు రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. లేకపోతే అటునుంచి అటే డబ్బాలు వెనక్కి వచ్చేస్తాయి. కానీ, ఆ చిత్రంలో ఫలనా సన్నివేశమో... మాటో... పాటో తమకు నచ్చలేదు కాబట్టి మొత్తం ఆ సినిమానే నిషేధించాలని రంకెలు వేయడమేమిటి? షారుఖ్‌ఖాన్‌ నటించిన హిందీ చిత్రం ‘పఠాన్‌’పై కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో అటువంటి రచ్చే జరుగుతోంది. అందులో ఒక పాటలో కథానాయిక దీపికా పదుకోణ్‌ ధరించిన దుస్తులపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తంచేశారు. నచ్చనిదాన్ని నచ్చలేదని చెప్పడంలో తప్పేమీ లేదు. విమర్శ హద్దుమీరి విద్వేషంగా మారితేనే సమస్య మొదలవుతుంది. ‘పఠాన్‌’ మీద అయితే అది ఏకంగా ఉన్మత్త స్థాయికి చేరింది. ఆ సినిమాను ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లలో విధ్వంసకాండలకూ అది కారణభూతమైంది. ఇదెక్కడి అసహనం? సినిమాలు, డాక్యుమెంటరీలు... ఏవైనా కావచ్చు- నచ్చినవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు మానేస్తారు. మధ్యలో ప్రజాస్వామ్య విలువల గురించి పట్టింపు లేని మందల ఇష్టాయిష్టాలేమిటి... సృజనాత్మక, భావప్రకటనా స్వేచ్ఛలపై వాటి మూకదాడులేమిటి?

కళ ఏదైనా సరే- అది కొన్ని ఆలోచనలు, ఊహలు, భావాలు, కలల సమాహారం. ఆయా కళాకారుల సృజన అందరినీ మెప్పించాలని ఏమీలేదు. అలాగని ‘నువ్వు ఆ కళాసృష్టి జోలికే పోవద్దు’ అనే హక్కు ఇతరులకు లేనేలేదు. ఆ మేరకు కళాకారుడికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఏనాడో తీర్పిచ్చింది. సంబంధిత కళాసృజనతో విభేదించేవారు దాని జోలికి పోకపోతే సరిపోతుందని అది సూచించింది. పుస్తకాలు, నాటకాలు, చలనచిత్రాలు తదితరాల ద్వారా ఒక సృజనకారుడు తన ఆలోచనలను ప్రజలతో పంచుకోవడాన్ని నిరోధించే ఆదేశాల జారీలో కోర్టులు అత్యంత నెమ్మదిగా వ్యవహరించాలనీ సర్వోన్నత న్యాయస్థానం అయిదేళ్ల క్రితం ఉద్ఘాటించింది. ‘సినిమాలో ఏం ఉండాలన్నది నిర్మాతకు, రచయితకు ఎవరూ నిర్దేశించలేరు’ అని బాంబే హైకోర్టు సైతం స్పష్టంచేసింది. సినిమాల్లో చట్టవ్యతిరేక అంశాలేమైనా ఉంటే- వాటిని పరిశీలించడానికి సెన్సార్‌బోర్డు ఉంది కదా. అది సరే అన్న తరవాతా స్వీయ ప్రకటిత నైతిక పోలీసుల మాదిరిగా ప్రవర్తించడమంటే- ‘మా రాజ్యమిది... ఇక్కడ మేము చెప్పిందే రాజ్యాంగం’ అని తలెగరేయడమే!

ఆలోచనాపరులు ఎవరైనా సాధారణంగా వాస్తవాల ప్రాతిపదికన అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అవివేకులు మాత్రం అభిప్రాయాల్లోంచి వాస్తవాలను నిర్ధారించబూనుతారు. ఆధారాల్లేని ప్రతిపాదనలను తేలిగ్గా నమ్మేస్తూ తోటి మనుషుల మీద అకారణంగా ద్వేషం పెంచుకుంటారు. సంకుచిత మతవిశ్వాసాలు, కులాధిక్య భావనలు, లింగపరమైన దుర్విచక్షణలను మెదళ్ల నిండా పేరపెట్టుకున్నవాళ్లే అలా వ్యవహరిస్తారు. ఆ బాపతు మనుషులే ‘బాయ్‌కాట్‌ సంస్కృతి’ని సైతం పెంచిపోషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవస్థాగత ముఠాలుగా మారి తీవ్ర విద్వేష వ్యాఖ్యలకు తెగబడుతున్నారు. ప్రజల మేలుకోరే కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులనూ ఆ మందమతి మందలు వెంటాడి వేధిస్తున్నాయి. ‘మీరేమి తినాలో బట్టలు వేసుకోవాలో మేమే చెబుతాం... మీరేమి వినాలో చూడాలో మాట్లాడాలో రాయాలో కూడా మేమే నిర్ణయిస్తా’మంటూ ఆ తండాలు చెలరేగిపోతున్నాయి. వాటి బెదిరింపులూ విశృంఖల దాడుల కారణంగానే- రచయితలకు పెనుప్రమాదాలు పొంచిఉన్న సమాజాల్లో మనదీ ఒకటిగా నిలుస్తోంది. 2021 రచనా స్వేచ్ఛా సూచీలో ఆ మేరకు తొలి పది ప్రమాదకర దేశాల్లో ఎనిమిదోదిగా ఇండియా పరువుమాసింది. సృజనశీలుర రెక్కలను కత్తిరించే అభద్రతా వాతావరణం భారతదేశంలో నెలకొందంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఇటీవల వంద మందికిపైగా అంతర్జాతీయ రచయితలు, ఆర్టిస్టులు లేఖ రాశారు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతానికి అది గౌరవదాయకమేనా?

వ్యర్థ ప్రేలాపనలు చేసే వదరబోతులు కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాలేదు. రాజకీయ నేతల్లోనూ ఆ రకం వాళ్లు కుప్పలుతెప్పలుగా పోగుపడ్డారు. బహుశా తమ పార్టీలోని అటువంటి నాయకులను ఉద్దేశించే కాబోలు- సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయకండని ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం గట్టిగా చెప్పారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి పునాది. పుస్తక రచనల నుంచి చలనచిత్ర నిర్మాణాల దాకా అన్నింటికీ అదే ఆధారం. దాన్ని కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యం. భిన్నత్వం మీద కడుపు మంటతో జన స్వేచ్ఛను కబళిస్తున్న వాళ్లను కారాగారాలకు పంపి తీరాలి. కట్టు లేని ఊరు, గట్టు లేని చెరువూ అతిప్రమాదకరమైనవి. పాలకులు ఆ విషయాన్ని గుర్తించి, రాజ్యాంగ కట్టుబాట్లను నిజంగా గౌరవించాలి... తమ పాలనలో వాటికి పట్టంకట్టాలి!

 శైలేష్‌ నిమ్మగడ్డ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు