భారత్‌వైపు ఈజిప్టు చూపు

భారత్‌, ఈజిప్టు... ద్వైపాక్షిక బంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని తాజాగా నిర్ణయించుకోవడం  గతించదగిన పరిణామం.

Published : 31 Jan 2023 00:22 IST

భారత్‌, ఈజిప్టు... ద్వైపాక్షిక బంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని తాజాగా నిర్ణయించుకోవడం  గతించదగిన పరిణామం. ఎర్రసముద్రం, మధ్యధరా సముద్రాల ద్వారా ఐరోపా విపణితో అనుసంధానమయ్యే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇండియా విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ఇది వీలు కల్పించనుంది. ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) వంటి వేదికలపై పాకిస్థాన్‌ ఆటలు సాగనివ్వకుండా సమర్థంగా కట్టడి చేయడంలో దోహదపడనుంది.

రబ్‌ ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో ఈజిప్టు ఒకటి. ఆఫ్రికా, ఐరోపా విపణులకు ప్రవేశద్వారంలాంటిది. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఈజిప్టు మాజీ అధ్యక్షుడు గామల్‌ అబ్దెల్‌ నాసర్‌ హయాములో ఇరు దేశాలు సన్నిహితంగా మెలిగేవి. 1955లో భారత్‌-ఈజిప్టు మైత్రీ ఒడంబడికపై సంతకాలు జరిగినా, తరవాత పరిస్థితులు మారాయి. ముఖ్యంగా హోస్నీ ముబారక్‌ ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో (1981-2011) ద్వైపాక్షిక సంబంధాల్లో స్తబ్ధత నెలకొంది. 2008లో ముబారక్‌ మళ్ళీ మన దేశానికి వచ్చిన తరవాత పరిస్థితులు  కొంత మెరుగుపడ్డాయి. 2009లో నామ్‌ సదస్సు కోసం అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ ఈజిప్టులో పర్యటించారు. 2014లో అబ్దుల్‌ ఫతా అల్‌-సీసీ పాలనపగ్గాలు చేపట్టాక మనదేశంతో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2015, 2016లలో భారత్‌లోనూ పర్యటించారు. మోదీ సర్కారు కూడా కైరోతో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నిరుడు సెప్టెంబరులో రాజ్‌నాథ్‌సింగ్‌, అక్టోబరులో జైశంకర్‌ ఈజిప్టులో పర్యటించారు. నిజానికి 2020లో ఈజిప్టులో పర్యటించాలని ప్రధాని మోదీ భావించినా కొవిడ్‌ కారణంగా వీలుపడలేదు. తాజాగా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రం అల్‌-సీసీని ఆహ్వానించి గౌరవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పరస్పర సహకారంతో ముందుకు...

భౌగోళికంగా పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలను అనుసంధానించే స్థానంలో ఈజిప్టు ఉంది. ఇటు అరబ్‌ ప్రపంచం, అటు ఆఫ్రికా రాజకీయాల్లో ఇది కీలకం. రోజువారీ అంతర్జాతీయ వాణిజ్య రవాణాలో దాదాపు 12శాతం ఈజిప్టులోని సూయెజ్‌ కాలువ ద్వారానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కైరోతో సంబంధాలు దిల్లీకి వ్యూహాత్మకంగా కీలకంగా మారాయి. అందుకు తగినట్లే ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా సత్సంబంధాలు నెలకొన్నాయి. కష్టకాలంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. కొవిడ్‌ రెండో ఉద్ధృతి వేళ ఈజిప్టు ఔషధాలు, వైద్య సామగ్రిని ఇండియాకు పంపించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సరఫరా గొలుసులు దెబ్బతినడంతో గత ఏడాది ఈజిప్టు తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కొంది. ఆ సమయంలో దిల్లీ స్నేహహస్తం అందించింది. ఎగుమతులపై నిషేధాన్ని పక్కనపెట్టి గోధుమల్ని ఆ దేశానికి పంపించింది. ఈజిప్టు ఏనాడూ భారత్‌ను ఇబ్బందిపెట్టేలా అడుగులు వేయలేదు. ఓఐసీ వంటి వేదికలపై పాక్‌ కుట్రలను అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు మనకు అండగా నిలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయ, భద్రత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేలా ఇండియా, ఈజిప్టు కీలక ముందడుగు వేశాయి. ఐటీ, సైబర్‌ భద్రత, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు, ప్రసార రంగాల్లో అయిదు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను పెంచాలని, ఉగ్రవాదంపై పోరులో కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని ఇరు దేశాలు తాజాగా తీర్మానించుకున్నాయి. ప్రతిష్ఠాత్మక ‘సూయెజ్‌ కాలువ ఆర్థిక మండలి’లో భారత పరిశ్రమలకు భూమిని కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ఈజిప్టు హామీ ఇచ్చింది.

సద్వినియోగం చేసుకోవాలి...

ఈజిప్టు దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నాళ్లుగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఆ దేశ పౌండు మారకం విలువ పడిపోయింది. విదేశ మారకద్రవ్య నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. దీన్ని దిల్లీ సద్వినియోగం చేసుకోవాలి. ఈజిప్టులో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను మరింతగా పెంచేందుకు కృషి చేయాలి. అవసరమైతే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని అక్కడికి మాంసం, ఇనుము, ఉక్కు, తేలికపాటి వాహనాలు, నూలు వంటి ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలి. ఈజిప్టులో వివిధ రంగాల్లో భారత పెట్టుబడులు పెరగాలి. మన దేశం నుంచి  తేజస్‌ యుద్ధవిమానాలు, ధ్రువ్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని కైరో భావిస్తోంది. తమ దేశానికి భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరగాలని కాంక్షిస్తోంది. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే ద్వైపాక్షిక సంబంధాలకు పూర్తిస్థాయిలో జవసత్వాలు సమకూరతాయి. మరోవైపు- వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఈజిప్టుతో బంధాన్ని పటిష్ఠం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశంలో పెట్టుబడులు పెంచుతోంది. తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)’ ప్రాజెక్టులో సూయెజ్‌ కాలువను కీలక భాగంగా డ్రాగన్‌ పరిగణిస్తోంది. సూయెజ్‌ కాలువ ఆర్థిక మండలిలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటుచేసుకుంది. ఈ క్రమంలో దిల్లీ అప్రమత్తం కావాలి. పెట్టుబడుల ఆరాటంతో కైరో చైనా వైపు పూర్తిగా మళ్ళకుండా చూసుకోవాలి.

ఎం.నవీన్‌ కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి