అడ్డంకులను అధిగమిస్తేనే ‘ని-క్షయ్‌’

ధనిక, అభివృద్ధి చెందుతున్న 19 దేశాలు, ఐరోపా సమాఖ్యతో కూడిన ‘జి-20’ కూటమికి భారత్‌ సారథ్యం వహిస్తోంది. ఈ హోదాలో క్షయ నిర్మూలనకు కీలకంగా భావిస్తున్న ‘ని-క్షయ్‌ మిత్ర’ను ఆదర్శవంతంగా అమలుచేసి చూపిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇటీవల ప్రకటించారు.

Published : 01 Feb 2023 00:22 IST

ధనిక, అభివృద్ధి చెందుతున్న 19 దేశాలు, ఐరోపా సమాఖ్యతో కూడిన ‘జి-20’ కూటమికి భారత్‌ సారథ్యం వహిస్తోంది. ఈ హోదాలో క్షయ నిర్మూలనకు కీలకంగా భావిస్తున్న ‘ని-క్షయ్‌ మిత్ర’ను ఆదర్శవంతంగా అమలుచేసి చూపిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇటీవల ప్రకటించారు. భారత్‌ను 2025 నాటికి క్షయరహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకునేందుకు బహుముఖంగా కృషి జరగాల్సిన అవసరముంది.

ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా దేశాలన్నీ 2030 నాటికల్లా క్షయ నుంచి విముక్తి పొందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లక్షించింది. దాన్ని అయిదేళ్లు ముందుగానే చేరుకోవాలని భారత్‌ సంకల్పించింది. ఇందుకు నిరుడు సెప్టెంబరులో ‘ప్రధానమంత్రి టీబీ-ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ను తీసుకొచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని ప్రారంభిస్తూ- ప్రపంచంలోని  మొత్తం క్షయ పీడితుల్లో 25 శాతానికిపైగా భారత్‌లోనే ఉండటం కలచివేస్తోందంటూ ఆవేదన చెందారు. ప్రపంచవ్యాప్తంగా 2021లో కోటీ 6 లక్షల మంది క్షయ చికిత్స పొందారని, వీరిలో 16లక్షల మంది మృత్యువాత పడ్డారని క్షయ నివేదిక-2022లో డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 4.5శాతం అధికంగా ఈ కేసులు వెలుగుచూసినట్టు విశ్లేషించింది. కొవిడ్‌ తలెత్తడంతో క్షయ నిర్ధారణ, చికిత్సలకు అవాంతరాలు ఏర్పడటమే ఈ పెరుగుదలకు కారణమంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

తగ్గినా... ఇంకా ఎక్కువే!

కొంతకాలంగా భారత్‌లో టీబీ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినా, ఇప్పటికీ అవి ఆందోళనకర స్థాయుల్లోనే ఉంటున్నాయి. దేశంలో 2015 నాటికి ప్రతి లక్షమందిలో 256 మంది క్షయ బాధితులు ఉండగా, 2021లో ఆ సంఖ్య 210కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2021లో నమోదైన మొత్తం కేసుల్లో 68శాతం భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఇండొనేసియా, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణాఫ్రికా... ఈ ఎనిమిది దేశాల్లో గుర్తించినవే! ఒక్క భారత్‌లోనే ఏకంగా 28శాతం కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్న భారత్‌ ప్రతిష్ఠను ఈ గణాంకాలు మసకబార్చేవే!

మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ అనే బ్యాక్టీరియా కారణంగా క్షయ తలెత్తుతుంది. ఈ వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత అందించే సమర్థమైన ఔషధాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోగులు వీటిని కనీసం ఆరు నెలలపాటు వాడాల్సి ఉంటుంది. కొద్దిరోజులు మందులు వాడగానే క్షయ లక్షణాలు కనుమరుగవుతాయి. దాంతో కొంతమంది వ్యాధి తగ్గిపోయిందన్న భావనతో మందులు వాడటం ఆపేస్తున్నారు. ఫలితంగా వారిలోని బ్యాక్టీరియా ఔషధాలను తట్టుకునేంతగా బలపడి వ్యాధిని తిరగదోడుతోంది. ఇలా రోగనిరోధకతను ఎదుర్కొనే క్షయ (డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ) బాధితులు శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ను దీర్ఘకాలం వాడాల్సి వస్తోంది. వీటి దుష్ప్రభావాల వల్ల కొందరిలో మూత్రపిండాలు, కిడ్నీ వంటి కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి. దేశంలో ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ నుంచి కోలుకున్నవారి ఆయుర్దాయం తక్కువగా ఉంటున్నట్లు జాతీయ క్షయ పరిశోధన కేంద్రం (ఎన్‌ఐఆర్‌టీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ సూచించినట్లు- చికిత్స పూర్తిచేసుకున్న బాధితులకు రెండేళ్లపాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధిగా ఆరోగ్య పరీక్షలు చేపట్టాల్సిన అవసరముంది.

ప్రతి రోగినీ పర్యవేక్షించాలి...

క్షయరహిత దేశంగా అవతరించాలని కాంక్షిస్తున్న ఇండియా- పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుర్తించని టీబీ కేసులు పెద్దసంఖ్యలో ఉంటున్నాయన్న డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి. ‘నిక్షయ పోషణ యోజన’ ద్వారా దేశంలోని 10,45,269 మంది క్షయ రోగులకు మెరుగైన పరీక్షలు, చికిత్సలు, పోషకాహారం దరిచేర్చేందుకు 40,492 మంది దాతలు ముందుకు వచ్చారు. ని-క్షయ్‌ పోర్టల్‌ ద్వారా చేపట్టిన ఈ దత్తత కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలి. క్షయ నుంచి కోలుకున్న బాధితులు సమాజంలో వివక్షకు గురికాకుండా తమ పనిపాట్లను కొనసాగించేందుకు తోడ్పడాలి. కొవిడ్‌ టీకా తయారీలో ఆదర్శంగా భాసించిన భారత్‌- పెద్దల కోసం ఉద్దేశించిన టీబీ వ్యాక్సిన్‌ పరిశోధనల్లోనూ ఆ స్ఫూర్తిని చాటాలి. ముఖ్యంగా వీపీఎం-1002, ఎంపీఐ (మైక్రోబ్యాక్టీరియమ్‌ ఇండికస్‌ ప్రాణి) వ్యాక్సిన్ల క్లినికల్‌ పరీక్షలను త్వరితగతిన పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి. ఆరోగ్య రంగానికి మరింతగా నిధులు వెచ్చించడంతో పాటు వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించుకోవాలి. దేశంలో 4,760 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలవారికి అందుబాటులో ఉండేలా వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలి. క్షయ పరీక్షలను ముమ్మరంగా చేపట్టడంతో పాటు- చికిత్స పూర్తయ్యేంత వరకు క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా రోగులకు అవగాహన కలిగించాలి. ఏ ఒక్క బాధితుడినీ విస్మరించకుండా పూర్తిస్థాయిలో చికిత్స అందించగలిగితేనే- మరో రెండేళ్లలో భారత్‌ క్షయరహిత దేశంగా అవతరించే స్వప్నం సాకారమవుతుంది!  

 టి.రఘుబాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.